నాన్నను చూసి.. నల్లకోటు వేసుకున్నా

నాన్నను చూసి.. నల్లకోటు వేసుకున్నా

ఇంజనీరింగ్, మెడిసిన్ చదివితేనే కెరీర్ బాగుంటుందని అనుకోలేదామె. మహిళలు తక్కువగా కనిపించే న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టాలి అనుకుంది. జ్యుడిషియల్​ ఆఫీసర్​ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జడ్జి అయిన తండ్రిని ఇన్​స్పిరేషన్​గా తీసుకుని కష్టపడి చదివింది. చిన్న వయసులోనే (24 ఏండ్లు) జూనియర్ సివిల్​ జడ్జిగా ఎంపికైంది. ఆమె పేరు అర్చనా గుబ్బ.

‘‘మాది షాద్​నగర్ దగ్గర్లోని లింగందన. ఇప్పుడు హైదరాబాద్​లో ఉంటున్నాం. నాన్న ప్రభాకర్ మల్కాజిగిరి 17వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్​ జడ్జిగా పనిచేస్తున్నారు. అమ్మ విజయ నిర్మల హోమ్ మేకర్. అన్న వంశీ కృష్ణ  కూడా లా (సెకండ్​ ఇయర్)  చదువుతున్నాడు. నాన్న జడ్జి కావడంతో చట్టాలు, న్యాయవ్యవస్థ గురించి ఇంట్లో ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. దాంతో, నాన్నని చూసి నాకు ఆరో క్లాస్​ నుంచే లా చదవాలని ఉండేది. పెద్దయ్యాక  జ్యుడిషియల్ ఆఫీసర్ అవ్వాలని కలలు కనేదాన్ని. అందుకని ఇంటర్​లో ఎం.ఇ.సి కోర్సు తీసుకున్నా. ఆ తరువాత హైదరాబాద్​లోని సింబయాసిస్ కాలేజీలో ఐదేండ్లు బిబిఎ, ఎల్​ఎల్​బి (బ్యాచిలర్ ఆఫ్​ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్​ లెజిస్లేటివ్​ లా) కోర్స్ చేశా. 

హైకోర్ట్ తీర్పుతో అవకాశం 
కోర్స్ తర్వాత లాయర్​గా ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నా. అంతలోపే ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (2020లో) జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్ రిలీజ్​ చేసింది. తెలంగాణవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. కానీ,  లాయర్​గా మూడేండ్లు అనుభవం ఉన్నవాళ్లకే ఆ ఎగ్జామ్​కి అనుమతి ఉంది. అయితే, సివిల్​ జడ్జికి మూడేండ్ల అనుభవం అక్కర్లేదని, కొత్తవాళ్లని కూడా ఎగ్జామ్​కు అనుమతించాలని హైకోర్టు చెప్పడంతో 2021లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతో, నాకు అవకాశం దొరికింది. చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జి అయితే  హైకోర్టు జడ్జి అవ్వొచ్చు. ఎలాగైనా జాబ్ కొట్టాలని కోచింగ్ తీసుకుని కష్టపడి చదివా. లాక్​డౌన్​లో పూర్తిగా ఎగ్జామ్ మీదే దృష్టిపెట్టా. ఈ ఏడాది మార్చి 30న రిజల్ట్స్ వచ్చాయి. మండల స్థాయి ట్రయల్​ కోర్టులో జూనియర్ సివిల్​ జడ్జిగా ఎంపికయ్యా. మొదటి ప్రయత్నంలోనే జాబ్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్​ఎల్ఎం (మాస్టర్ ఆఫ్​ లెజిస్లేటివ్ లా) క్రిమినాలజీ, క్రిమినల్ జస్టిస్ కోర్సు చదువుతున్నా. 

మరింత మంది రావాలి
‘చాలామంది అమ్మాయిలకి లా కోర్సు మీద అవేర్​నెస్ ఉండదు. లా చేస్తే కెరీర్ ఉండదని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. నేను జూనియర్‌‌‌‌ సివిల్ జడ్జిగా సెలక్ట్ అయ్యానని తెలిశాక, చాలామంది ఫోన్ చేసి ‘ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇందులో కెరీర్ బాగుంటుందా?’ అని అడిగారు. మరింత మంది మహిళలు జడ్జిలు అవ్వాలి. అప్పుడే ఈ రంగంలోకి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది’ అని అర్చనా అన్నారు. 

– సంతోష్​ బొందుగుల