Dharmendra: ఇండియన్ సినిమాలో ఒక శకం ముగిసింది.. ధర్మేంద్ర మృతిపై సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

Dharmendra: ఇండియన్ సినిమాలో ఒక శకం ముగిసింది.. ధర్మేంద్ర మృతిపై సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

‘భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది. తన నటనతో అనేక పాత్రలకు వన్నె తెచ్చిన దిగ్గజ నటుడు ధర్మేంద్ర దివికేగారు’. 89 ఏళ్ల ధర్మేంద్ర గత కొంత కాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించడంతో సోమవారం (2025, నవంబర్ 24న) తుదిశ్వాస విడిచారు. "యాక్షన్ కింగ్", "హీ-మ్యాన్" గా పేరుపొందిన ధర్మేంద్ర మృతికి.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

దిగ్గజ నటుడు ధర్మేంద్ర జీ ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, అద్భుతమైన మానవుడని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ‘‘శ్రీ ధర్మేంద్ర జీ ఒక దిగ్గజ నటుడు మాత్రమే కాదు, అద్భుతమైన మానవుడు కూడా. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ అనుభవించిన వినయం మరియు ఆప్యాయత నా హృదయాన్ని లోతుగా తాకింది. ఆయనతో నేను పంచుకున్న మధురమైన జ్ఞాపకాలు.. వ్యక్తిగత క్షణాలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.

ఆయన మృతికి నా హృదయపూర్వక సంతాపం. ఆయన గొప్ప ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. నా ఆలోచనలు మరియు ప్రార్థనలు ఆయన కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా నా ప్రియమైన స్నేహితులు సన్నీ డియోల్ మరియు బాబీ డియోల్‌తో ఉన్నాయి. ఆయన వారసత్వం లక్షలాది మంది హృదయాలలో సజీవంగా ఉంటుంది. ఓం శాంతి’’ అని చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. 

టాలీవుడ్ హీరో వెంకటేష్ X వేదికగా నివాళులు అర్పించారు. ‘‘ధర్మేంద్ర జీ.. కేవలం సినిమా ఐకాన్ మాత్రమే కాదు అంతకంటే కంటే ఎక్కువ. తరతరాలను తాకిన ఆయన విజన్, ఇచ్చిన ప్రేమానురాగాలు.. భారతీయ సినిమాకు కొత్త యుగాన్ని నిర్వచించేలా చేసింది. ఆయన సినిమాలు అలరించడంతో పాటుగా ఎంతో మందిని స్ఫూర్తి నింపాయి. ఆయన నట చాతుర్యం ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగా ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని వెంకటేష్ ట్వీట్ చేశారు.

సినీ ఐకాన్ ధర్మేంద్ర జీ మరణవార్త విని చాలా బాధపడ్డానని జూనియర్ ఎన్టీఆర్ X వేదికగా ఎమోషనల్ అయ్యారు. ‘‘ ధర్మేంద్ర జీ మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన నిర్వచించిన శకాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేము మరియు భారతీయ సినిమాకు ఆయన తెచ్చిన ఆప్యాయత ఎప్పటికీ మనతో ఉంటుంది. మొత్తం కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం మరియు ప్రార్థనలు’’ అని ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు.

ALSO READ : హంగూ ఆర్భాటం లేకుండా.. చకచకా జరిగిన ధర్మేంద్ర అంత్యక్రియలు..

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ‘ మన సినీ పరిశ్రమ యొక్క అసలైన హీ-మ్యాన్. తర తరాలకు స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు ధర్మేంద్ర జీ. మీరు మీ సినిమాలు ద్వారా పంచిన ప్రేమ ద్వారా ఎప్పటికీ జీవిస్తారు. ఓం శాంతి’ అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. 

దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తీవ్ర బాధాకరం అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ‘‘దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తీవ్ర బాధాకరం. బహుముఖ ప్రజ్ఞాశాలి, విశిష్ట నటుడిని కోల్పోవడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఈ విషాద సమయంలో ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు, ఆయన స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ సీఎం రేవంత్‌ నివాళి తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు X వేదికగా సంతాపం తెలుపుతూ.. ‘ధర్మేంద్ర మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దిగ్గజ నటుడు, తన అద్భుతమైన నటనతో లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి తరతరాలు గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని బాబు ట్వీట్ చేశారు. 

‘భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది. తన నటనతో అనేక పాత్రలకు వన్నె తెచ్చారు. ఇది ఎంతో విచారకరమైన సమయం. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చిత్ర పరిశ్రమకు తీరని లోటు ’ అని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.