రెగ్యులరైజేషన్​ కోసం జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల ఎదురుచూపులు

రెగ్యులరైజేషన్​ కోసం జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల ఎదురుచూపులు
  • రెగ్యులరైజేషన్​ కోసం జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల ఎదురుచూపులు
  • నిరుడే ముగిసిన ప్రొబెషన్ టైమ్
  • ఇంకో ఏడాది పెంచిన సీఎం కేసీఆర్.. అదికూడా ఈనెల 11తో ముగిసింది
  • ఆందోళనలో 8,500 మంది.. 
  • 13న సమ్మె నోటీసులు ఇస్తామన్న జేపీఎస్​ ఫెడరేషన్
  • నెలాఖరు దాకా టైమ్ ఇస్తామంటున్న ఇతర సంఘాలు

హైదరాబాద్/ రాజన్న సిరిసిల్ల, వెలుగు : ఉద్యోగాల రెగ్యులరైజ్ కోసం జూనియర్ పంచాయతీ కార్యదర్శు(జేపీఎస్​)లు ఎదురుచూస్తున్నరు. వారి మూడేండ్ల ప్రొబెషన్​టైమ్ నిరుడే ముగిసింది. అయితే సీఎం కేసీఆర్ వీరి ప్రొబెషన్​టైమ్​ను మరో ఏడాది పెంచిన సంగతి తెలిసిందే. అది కూడా ఈ నెల 11 (మంగళవారం) తో పూర్తయింది. అయినా వారి రెగ్యులరైజేషన్ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.

ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ కమిషనర్​హనమంతరావుకు గురువారం సమ్మె నోటీసులు ఇస్తామని తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ నేతలు తెలిపారు. జేపీఎస్ ఫెడరేషన్​తో పాటు తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్, తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ సెంట్రల్ ఫోరం (టీఎన్జీవో) జేఏసీ గా ఏర్పడ్డాయి. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి టైమ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. అప్పటి వరకు రెగ్యులరైజేషన్ చేయకపోతే సమ్మెకు దిగుతామని వెల్లడించాయి.

రెగ్యులరైజేషన్ పై కదలిక!

2018 ఆగస్టులో 9355 జేపీఎస్ పోస్ట్ లకు నోటిఫికేషన్ జారీ చేశారు. అదే ఏడాది అక్టోబర్ లో పరీక్ష నిర్వహించారు. 2019 ఏప్రిల్ 12న ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మూడేండ్ల ప్రొబెషనరీ టైమ్ విధిస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2020లోనే మూడేండ్లు పూర్తయ్యాయి. అయితే వారిని రెగ్యులర్ చేయకుండా ప్రొబెషన్ టైమ్ మరో ఏడాది పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ లో ప్రకటన చేశారు. జీతాన్ని రూ.15వేల నుంచి 28,719  పెంచారు. ప్రస్తుతం నాలుగేండ్లు కూడా పూర్తవడంతో జేపీఎస్ ల రెగ్యులర్ పై సర్కారులో కదలిక స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న జేపీఎస్, రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ సెక్రటరీల వివరాలు పంపాలని పీఆర్ డైరెక్టర్ డీపీవోలను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 12769 పంచాయతీలు ఉండగా 3 వేల మంది రెగ్యులర్ సెక్రటరీలు ఉన్నారు. మిగతా వారంతా జేపీఎస్, ఔట్ సోర్సింగ్ సెక్రటరీలే. రెగ్యులర్ చేస్తే ఇపుడున్న జీతానికి అదనంగా టీఏ, డీఏ ఇతర అలవెన్సులు కలిపి 20 శాతం పెరగనుంది.

ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ అధికారులు త్వరలో ఫైనాన్స్ అధికారులకు దీనిపై లేఖ రాయనున్నట్లు సెక్రటేరియెట్ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత నాలుగేండ్లలో ఎంతో మంది జేపీఎస్ లు ఉద్యోగానికి రాజీనామాలు చేశారు. సుమారు 40 మంది పనిఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇన్ని పనులు చేస్తున్నా ప్రతి నెల జీతాలు ఆలస్యంగా అందుతున్నాయని జేపీఎస్ లు చెబుతున్నారు.

రెగ్యులర్ సెక్రటరీలూ పాల్గొంటరు

జేపీఎస్ ల ప్రొబెషన్ టైమ్ ముగిసింది. ఇప్పటివరకు రెగ్యులరైజేషన్​పై ఎలాంటి ఆర్డర్స్ లేవు.  ఈ నెలాఖరు వరకు టైమ్ ఇస్తం. రెగ్యులర్ చేయకపోతే నోటీసు ఇచ్చి సమ్మెకు వెళ్తం. యూనియన్లు జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటిస్తం. ఈ సమ్మెలో రెగ్యులర్ సెక్రటరీలు కూడా పాల్గొంటరు.

- పంచాయతీ సెక్రటరీల ఫోరం( టీఎన్జీవో), తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్