మాకెందుకు ఇన్ని రూల్స్? రెగ్యులర్ ప్రాసెసింగ్​పై జేపీఎస్​ల ఫైర్

మాకెందుకు ఇన్ని రూల్స్? రెగ్యులర్ ప్రాసెసింగ్​పై జేపీఎస్​ల ఫైర్
  • నాలుగేండ్లలో రోజుకు 12 గంటలు పనిచేసి అవార్డులు తెచ్చామంటున్న సెక్రటరీలు
  • జేపీఎస్​ల రెగ్యులరైజేషన్​పై జిల్లాల్లో కమిటీల ఏర్పాటు
  • 60 అంశాల్లో డేటా తీసుకొని పనితీరు మదింపు
  • రూల్స్ పై మంత్రులు సైతం అసంతృప్తి

హైదరాబాద్, వెలుగు:  జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్) ల రెగ్యులరైజేషన్ పై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నాలుగేండ్లుగా రోజుకు 12 గంటల పాటు పనిచేస్తున్న తమను రెగ్యులర్  చేయడానికి ఇన్ని రూల్స్  పెట్టడం ఎంత వరకు సమంజసం అని సెక్రటరీలు వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పని చేశామని, అధికారుల వేధింపులు, ఒత్తిడిని తట్టుకుంటూ పల్లె ప్రగతి, శానిటేషన్ డ్రైవ్  వంటి ఎన్నో కార్యక్రమాలను సక్సెస్ చేశామని చెబుతున్నారు. తమ కృషి వల్లే రాష్ర్టానికి గత నాలుగేళ్లలో వివిధ కేటగిరీల్లో 75కు పైగా అవార్డులు వచ్చాయని గుర్తుచేస్తున్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో 5,544 మంది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసింది. 

కాంట్రాక్ట్ గా ఉన్న టైమ్ లోనే వారికి రూ.50 వేల జీతాలు ఉండె. రెగ్యులర్  అయ్యాక వారి జీతాలు భారీగా పెరిగాయి. ఇక రెండు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది వీఆర్ఏలను కూడా విద్యార్హతలను బట్టి 3  గ్రేడ్లులుగా విభజించి ప్రభుత్వం రెగ్యులర్   చేసింది. కాంట్రాక్టు లెక్చరర్లు, వీఆర్ఏలను రెగ్యులర్  చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఎలాంటి కమిటీలు వేయలేదు. వారి పనితీరు, పనిచేసిన కాలం, ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. సెక్రటరీలను రెగ్యులర్  చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం ఖరారు  చేసిన రూల్స్ పై మొదటి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లాల్లో కసరత్తు ప్రారంభం

జేపీఎస్ ల రెగ్యులరైజేషన్ పై 8 అంశాలకు మొత్తం 100 మార్కులు కేటాయించి,  సెక్రటరీల నుంచి 60  ప్రశ్నలకు సమాధానాలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. సెక్రటరీల పనితీరు లెక్కింపుకు జిల్లాల్లో ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో అడిషనల్  కలెక్టర్ (లోకల్ బాడీస్), ఎస్పీ లేదా డీఎస్పీ స్థాయి అధికారి, జిల్లా ఫారెస్ట్  అధికారి ఉన్నారు. పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి జిల్లాల్లో ఉండే కీలక అధికారులు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), జడ్పీ సీఈవో, డీఆర్ డీవో పీడీలను కమిటీలో చోటు కల్పించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ముగ్గురు అధికారులు జిల్లాల్లో సెక్రటరీల పనితీరుపై వర్క్​ను స్టార్ట్ చేశారు. జేపీఎస్​ల రెగ్యులరైజేషన్​పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు, వారి పనితీరు లెక్కకట్టేందుకు ఖరారు చేసిన అంశాలపై మంత్రులు సైతం అసహనం  వ్యక్తం చేశారని సెక్రటేరియెట్​లో చర్చ సాగుతున్నది. “పనితీరు పేరు చెప్పి జేపీఎస్​లను  ఇబ్బంది పెట్టడం కరెక్ట్  కాదు.  ఎన్నికల ముందు వారి నుంచి వ్యతిరేకత వస్తే ఇబ్బంది” అని ఇద్దరు కీలక మంత్రులు పీఆర్  అధికారులతో అన్నట్లు సమాచారం

ALSO READ :సరూర్​నగర్ రైతుబజార్​లో ఔట్‌‌ రీచ్‌‌ ప్రోగ్రామ్

కాంట్రాక్టు లెక్చరర్లు, వీఆర్ఏలను ఏ కమిటీలు లెక్కకట్టినై?

ఏ కమిటీలు ఏర్పాటు చేసి కాంట్రాక్ట్  లెక్చరర్లు, వీఆర్ఏలను రెగ్యులర్  చేశారు? ఏటా మా పనితీరు  లెక్కగడుతూనే ఉన్నరు. మా పర్ఫార్మెన్స్  బాగుందనే కదా నాలుగేండ్లుగా ఉన్నం. నాలుగేండ్ల కింద జేఎన్టీయూ పెట్టిన పరీక్షలో పోటీపడి జాబ్  కొట్టినం.  మమ్మల్ని  రెగ్యులర్  చేయడానికి కమిటీ  ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు. రాష్ట్రానికి మేం తెచ్చిన అవార్డులు మా పనితీరుకు కొలమానం  కాదా? :  కరీంనగర్ కు చెందిన ఓ జేపీఎస్

మేం చేసిన నేరమేంటి? 

ఏ ప్రభుత్వ ఉద్యోగంలో అయినా ప్రొబేషన్  పీరియడ్  రెండేండ్లు ఉంటుంది. జేపీఎస్​ల​కు నాలుగేండ్లకు పెంచారు. అది చాలదని మా పనితీరుకు కమిటీలు ఏర్పాటు చేశారు. డిగ్రీ చదివిన వీఆర్ఏలను జూనియర్  అసిస్టెంట్లుగా నియమించారు. పీజీలు చేసి 7లక్షల మందితో పోటీపడి జేపీఎస్​లుగా సెలెక్టయిన మాకు కమిటీలు ఏర్పాటు చేయడం బాధాకరం. మేం చేసిన నేరమేంటి? :  వనపర్తికి చెందిన మహిళా జేపీఎస్