నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు : మంత్రి జూపల్లి

నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు : మంత్రి జూపల్లి
  • పదేండ్ల బీఆర్ఎస్ పాలనంతా విధ్వంసమే: మంత్రి జూపల్లి
  • తలతిక్క పనులకే ఆ పార్టీ ఓడిపోయింది
  • కాళేశ్వరం సహా అన్నింటిపై సమగ్ర విచారణ
  • మంత్రులకూ ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోలేదని ఎద్దేవా
  • ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన.. అభివృద్ధి పనులకు భూమి పూజ

ఆదిలాబాద్, వెలుగు:తలతిక్క పనులతోనే బీఆర్ఎస్​ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కంటే.. విధ్వంసమే ఎక్కువ జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర కీలక అంశాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. మంత్రులకు కూడా ప్రగతి భవన్ గేట్లు తెరుచుకునేవి కావని తెలిపారు. గేటు దాకా వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి ఉండేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. 

ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పలు చోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆదిలాబాద్ ప్రజాసేవ భవన్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు సహా అన్ని రంగాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపడుతున్నది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. రైతులకు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు పంట నష్టపరిహారం చెల్లిస్తున్నాం’’అని జూపల్లి అన్నారు.

జీవో 49 అమలు కాకుండా చూస్తా

ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ను అమలు కాకుండా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉట్నూర్ లోని ఐటీడీఏ మీటింగ్ హాల్ లో ఆదివాసీ పెద్దలు, అధికారులతో శుక్రవారం ఆయన సమావేశం అయ్యారు. దీనికి ముందు ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. జీవో 49 రద్దు చేయాలని ఎమ్మెల్యేలు, గిరిజన పెద్దలు మంత్రిని కోరారు. ఈ జీవో కారణంగా ఏజెన్సీ వాసులు తీవ్రంగా నష్టపోతారని, అడవిని ఖాళీ చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని మంత్రికి వివరించారు. 

అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడారు. జీవో 49కు ప్రభుత్వం ఇంకా గెజిట్ రిలీజ్ చేయలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా.. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన 5కే రన్​ను మంత్రి జూపల్లి ప్రారంభించారు. మావల అర్బన్ పార్క్​ను పరిశీలించారు. రిమ్స్ హాస్పిటల్​ను విజిట్ చేసి రోగులతో మాట్లాడారు. ఉట్నూర్ లో రూ.13.70 కోట్లతో నిర్మించనున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రాన్ని నిలదీయాలి

బీహార్, యూపీకి ఇచ్చినట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఏం లాభం లేదని మండిపడ్డారు. ‘‘మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదు. గతంలో 3 రాష్ట్రాలను విభజించిన టైమ్​లో తెలంగాణ ఉద్యమం కూడా నడుస్తున్నది. అప్పు డు కేంద్రంలో ఉన్న బీజేపీ.. ఎందుకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయలేదు? ఏపీ, తెలంగా ణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని తెలిసిన ప్పటికీ.. సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు’’అని జూపల్లి మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్​చార్జ్ కంది శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.