బెస్ట్ టూరిజం రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

బెస్ట్ టూరిజం రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కదిద్ది.. రాష్ట్రాన్ని  సరైన దారికి తీసుకురావడానికి కొంచెం సమయం పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డిసెంబర్ 10వ తేదీ ఆదివారం  సచివాలయంలో 4వ అంతస్తులోని కార్యాలయంలో ఎక్సైజ్, టూరిజం, కల్చర్ శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు బాద్యతలు స్వీకరించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన రోజు  కంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉందన్నారు.
గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాల కారణంగా ధనిక రాష్ట్రం.. అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు.హామీలు ఇచ్చి మోసం చేయడంతోనే ప్రజలు గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారని అన్నారు. గతం కంటే ఈ ఐదు ఏండ్ల పాలన భిన్నంగా ఉంటుందని.. శాఖ ఏదైనా 100 శాతం అభివృద్ధి చేస్తామని చెప్పారు. 

మంత్రిగా టూరిజంపై మొదటి సంతకం చేశానని తెలిపారు. ప్రతి అంశంపై  లోతుగా అధ్యయనం చేస్తామని.. టూరిజం పైనే ఎన్నో దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ప్రపంచ స్థాయిలో బెస్ట్ టూరిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలంగాణలో అనేక టూరిస్ట్ స్థలాలు ఉన్నాయని.. వాటి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మాట్లాడుతానన్నారు. కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సంస్కృతిక కళాకారులకు  న్యాయం చేస్తామని.. ఇక, ఉద్యోగులకు సరైన సమయానికి వేతనాలు వచ్చేలా చేస్తామని ఆయన చెప్పారు.