యువతకు టీ-సాట్ చేయూత.. నిరుద్యోగులకు.. విద్యార్థులకు వరం

యువతకు టీ-సాట్ చేయూత.. నిరుద్యోగులకు.. విద్యార్థులకు వరం

ఆధునిక సాంకేతికతతో దూసుకుపోతున్న ప్రస్తుత కాలంలో టీసాట్ తెలంగాణలోని అన్ని వర్గాలకు వరంగా మారింది. విద్యార్థులు, యువత, మహిళలు, రైతుల కోసం టీసాట్ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తూ మన్ననలు పొందుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు చేరువయ్యింది. 

ప్రభుత్వ ప్రోత్సాహంతో టీసాట్ విస్తృతస్థాయిలో కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే నెం1 ఎడ్యుకేషనల్ నెట్​వర్క్​గా పేరుపొందడం యావత్ తెలంగాణకు గర్వకారణం. కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పేద విద్యార్థులు, యువత కోసం ప్రత్యేక యూట్యూబ్ చానళ్లు ఏర్పాటు చేసి విద్యా కార్యక్రమాలు అందిస్తూ టీసాట్ దిక్సూచిగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 60 వేలకు పైగా ఉద్యోగాల నియామకం చేపట్టడంతో టీసాట్ అందిస్తున్న సబ్జెక్టుల మెటీరియల్స్ యవతకు సోపానంగా మారాయి. 

రాష్ట్రంలోని గ్రూప్-1, 2, 3 ఉద్యోగాలతోపాటు, డీఎస్సీ, కేంద్ర ప్రభుత్వ యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, బ్యాకింగ్ పోస్టులతో పలు పోటీ పరీక్షల కోసం విశేష అనుభవమున్న మంచి ఫ్యాకల్టీచే రూపొందిస్తున్న కంటెంట్ ఎంతో తోడ్పడుతుంది. గ్రూప్-1 పరీక్షల కోసం సుమారు 750 గంటల నిడివితో 1200 ఎపిసోడ్స్, గ్రూప్-2 పరీక్షల కోసం 245 గంటలు 300 ఎపిసోడ్స్, గ్రూప్-3 పరీక్షలకు 150 గంటలపాటు 300 ఎపిసోడ్స్​లో విలువైన మెటీరియల్ అందించడంతోపాటు, క్రాష్ కోర్సు పేరిట అదనంగా కంటెంట్ అందించడంతో టీ-సాట్ సహకారంతో వందలాది మంది యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించారు. 

పేద విద్యార్థులకు వరం

ఉద్యోగ పరీక్షలకే కాకుండా ఉన్నత చదువుల కోసం అర్హత పరీక్షలు రాసేవారి కోసం కూడా టీసాట్ ప్రత్యేక మెటీరియల్ తయారుచేయడం కోచింగ్​కు వెళ్లలేని పేద విద్యార్థులకు వరంగా మారింది. టెట్, సెట్, నెట్, బీఎడ్, డీఎడ్, జేఈ, ఎమ్సెట్, టీజీఈఏప్సెట్ పరీక్షలకు టీ-సాట్ ప్రత్యేక కంటెంట్ అందిస్తోంది. రాబోయే టెట్ పరీక్ష కోసం 50 రోజులకు 200 ఎపిసోడ్స్,  డీఎస్సీ క్రాష్ కోర్సు కోసం 613 గంటలకు సంబంధించి 50 ఎపిసోడ్స్ నాణ్యమైన కంటెంట్ తయారుచేసింది. ‘జనరల్ స్టడీస్ ఫర్ ఆల్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని టీసాట్ ప్రసారం చేస్తుండడంతో జనరల్ సబ్జెక్టులకు తోడ్పడుతుంది.

 ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలతో ఎంఓయూ కుదుర్చుకున్న టీసాట్ ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ కళాశాల, మహిళా శిశు సంక్షేమశాఖలతో కూడా సమన్వయం కుదుర్చుకొని డిజిటల్ తరగతులను ప్రారంభించింది. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ట్రావెల్ అండ్ టూరీజం మేనేజ్ మెంట్ కోర్సుకు ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించింది. టీ-సాట్, ఫొటానిక్స్, వ్యాలి కార్పొరేషన్లతో సంయుక్తంగా వీఎల్ఎస్ఐపై వృత్తి నైపుణ్య శిక్షణఅందిస్తున్నాయి.

30 వేలకుపైగా వీడియోలు అప్​లోడ్​

నైపుణ్యతను పెంచే దిశలో భాగంగా టీ-సాట్ అందిస్తున్న స్కిల్ డెవలప్​మెంట్​ పాఠ్యాంశాలు ఆధునిక సాంకేతికత, కమ్యూనికేషన్ స్కిల్స్​ విద్యార్థులు పొందుతున్నారు. అంతేకాక విద్యార్థుల కోసం అందిస్తున్న ‘స్ఫూర్తి’ కార్యక్రమం ద్వారా స్వాతంత్య్ర యోధులతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖుల జీవిత చరిత్రలతోపాటు అవార్డులు పొందిన ప్రముఖ వ్యక్తుల ప్రత్యేక ఇంటర్వ్యూలతో వారి విలువైన అనుభవాలను యువతకు టీసాట్ అందుబాటులోకి తెస్తుంది. టీ-సాట్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు నెట్​వర్క్, సోషల్ మీడియా ద్వారా 25 వేలకు పైగా వీడియోలను అందుబాటులోకి తేవడంతో లక్షకు పైగా వ్యూస్, సబ్​స్కైబర్స్​తో ఆదరణ పొందుతోంది. 

నూతన సీఈవో సేవలు టీ-సాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి సంస్థ అభివృద్ధికి వేగవంతంగా చర్యలు తీసుకున్నారు. ఆయన సంస్థలో భారీ మార్పులు తీసుకొచ్చిన నేపథ్యంలో తక్కువ సమయంలోనే 5 వేలకుపైగా వీడియోలను అప్​లోడ్​ చేయడంతో లక్షల సంఖ్యలో వ్యూస్ రావడమే కాకుండా భారీగా సబ్ స్కైబర్స్ పెరిగారు. ప్రత్యేకంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం టీ-సాట్ 30 వేలకుపైగా వీడియోలను అప్​లోడ్​ చేసింది. టీ-సాట్ 16 శాటిలైట్ల ద్వారా తెలంగాణలో సుమారు 80 లక్షలకుపైగా కుటుంబాలకు డిజిటల్ ప్రసారాలను నేరుగా అందిస్తూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. 

‘నిపుణ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు

‘నిపుణ’ పేరిట టీ-సాట్ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ పశుసంవర్థక శాఖలతో సమన్వయం కుదుర్చుకొని రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించడంతో వ్యవసాయ రంగానికి ప్రయోజకరంగా ఉంది. 

 టీసాట్ నెట్​వర్క్​ చానెల్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను టీ-సాట్ ఈ–మ్యాగజైన్ ద్వారా ఈ–లైబ్రరీలో అందుబాటులో ఉంచడంతో కావాల్సినప్పుడు సమాచారాన్ని పొందే అవకాశం ఉంది. పేద విద్యార్థుల కోసం నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచాలనే ప్రధాన లక్ష్యంతో సీఎం రేవంత్​రెడ్డి ప్రోత్సాహంతో, ఐటీ, కమ్యునికేషన్ల శాఖ మంత్రి శ్రీధర్​బాబు మార్గదర్శకత్వంలో టీ-సాట్ విద్యా ప్రసార ఛానళ్లలో ఐదు మిలియన్ యూజర్లతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. 

నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం

టీ-సాట్ తెలంగాణ ఉన్నత విద్యామండలితో ప్రత్యేక అవగాహన కదుర్చుకుని విద్యార్థులకు పాఠ్యాంశాలు అందిస్తోంది. 3వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం 8 గంటల డిజిటల్ పాఠాలను ప్రసారం చేస్తున్న టీసాట్ వీరి కోసం 1,710 గంటల కంటెంట్​ను అందుబాటులోకి తెచ్చింది. టెన్త్​ విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన మెలకువలతో కంటెంట్​ను తీసుకురావడంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడింది. 

ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రతిరోజు 11 ఎపిసోడ్ల డిజిటల్ పాఠాలను ప్రసారం చేస్తూ 2,170 గంటల కంటెంట్​ను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం 10 లక్షలకుపైగా ఇంటర్మీడియట్ విద్యార్థులు, 2 లక్షలకుపైగా సాంఘిక సంక్షేమ పాఠశాల,  కళాశాలల విద్యార్థులకు రోజూ టీ-సాట్ పాఠ్యాంశాలను అనుసరిస్తున్నారు. వీరి కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు టీ-సాట్ పాఠ్యాంశాలను అందిస్తోంది.