ఇండస్ట్రీని బలోపేతం చేసేందుకు..

ఇండస్ట్రీని బలోపేతం చేసేందుకు..

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు హైదరాబాద్‌‌లోని ఫిలిం చాంబర్‌‌‌‌లో ఆదివారం జరగనున్నాయి. నిర్మాతలు సి.కళ్యాణ్, దిల్ రాజు ప్రెసిడెంట్‌‌గా పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా శనివారం దిల్ రాజు ప్యానెల్ ప్రెస్‌‌ మీట్ నిర్వహించింది. దిల్ రాజు మాట్లాడుతూ ‘ఈ పోటీలో ఎలాంటి వివాదాలు లేవు. ఫిల్మ్ చాంబర్‌‌‌‌ను, ఇండస్ట్రీని బలోపేతం చేసేందుకే ముందుకు వచ్చాం. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫామ్‌‌లో ఉన్న నిర్మాతలందరూ మా ప్యానెల్‌‌లో ఉన్నారు. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో అనే నాలుగు సెక్టార్లూ కీలకమే. ఈ నాలుగింటిలో మాది  యాక్టివ్  ప్యానెల్‌‌. సమస్యల పరిష్కారానికి  పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. సరైన పద్దతిలో షూటింగ్స్ జరగాలి.  

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. ఓటింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. పదిహేను వందల మంది నిర్మాతలు ఉంటే 200 మంది మాత్రమే యాక్టివ్‌‌గా ఉంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్‌‌, స్టూడియో సెక్టార్‌‌‌‌లో ఉన్న వారంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఫిల్మ్ చాంబర్‌‌‌‌ బైలాస్‌‌లో కొన్ని మార్పులు చేయాలి. మార్పులు జరిగిన మరుక్షణం గిల్డ్‌‌ని కౌన్సిల్‌‌లో కలుపుతాం. చాంబర్‌‌‌‌లో సరైన వ్యక్తులు ఉంటేనే న్యాయం జరుగుతుంది’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సునీల్ నారంగ్, దామోదర ప్రసాద్, వై.రవి శంకర్, స్రవంతి రవికిషోర్, సూర్యదేవర నాగవంశీ, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ నామా, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.