సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణం

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10:36 గంటలకు కోర్టు హాల్​లో దత్తాతో చీఫ్​ జస్టిస్​ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. బాంబే హైకోర్టు చీఫ్ ​జస్టిస్​గా ఉన్న దత్తాను సుప్రీంకోర్టు జడ్జిగా నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. కిందటేడాది సెప్టెంబర్‌‌లో అప్పటి చీఫ్​ జస్టిస్ యుయు లలిత్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్​ దత్తా పేరును సిఫార్సు చేసింది. జస్టిస్ దత్తా ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 28కి పెరిగింది. 

సుప్రీంకోర్టులో సీజేఐతో సహా 34 మంది జడ్జిలు ఉండాలి. ప్రస్తుతం 6 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జస్టిస్​ దత్తా.. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, దివంగత సలీల్ కుమార్ దత్తా కుమారుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అమితవ రాయ్ బావమరిది. జస్టిస్ దత్తా.. ఫిబ్రవరి 9, 1965న జన్మించారు. ఫిబ్రవరి 8, 2030 వరకు ఆయన పదవిలో ఉంటారు.