
- రిజర్వేషన్లపై ప్రభుత్వం తెచ్చిన జీవో 9 కోర్టుల్లో నిలవదు:జస్టిస్ ఈశ్వరయ్య
న్యూఢిల్లీ, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఈ బిల్లులను కేంద్ర కేబినెట్, పార్లమెంట్ ఉభయ సభలు క్లియర్ చేయనందున రాష్ట్రపతి ఆమోదం పొందలేక పోతున్నాయన్నారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చకుండా కాగితాలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయితీ రాజ్ చట్టాన్ని సవరించినంత మాత్రాన 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ను దాటి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్, సుప్రీంకోర్టు తీర్పులు అడ్డుగా ఉన్నాయని చెప్పారు.
సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 9 ఎట్టి పరిస్థితుల్లో కోర్టుల్లో నిలవదని చెప్పారు. ఈ జీవో రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నందున ఇది అమలు కాదన్నారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే.. 50 శాతం రిజర్వేషన్లకు లోబడి ఎలక్షన్స్ జరపాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, వర్గీకరణ అమల్లో ఉందని గుర్తుచేశారు.
కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలో ప్రభుత్వాలకు తెలియనప్పుడే తాను డ్రాఫ్ట్ తయారు చేసినట్లు గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమని, మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరినా రాజ్యాంగబద్ధంగా నిలుపుకొవచ్చని స్పష్టత ఇచ్చానన్నారు. తమిళనాడు మాదిరిగా ముందుకెళ్లినప్పుడే రిజర్వేషన్లు పొందగలమని తెలిపారు.