
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ముందుగా ట్రేడ్ టారిఫ్స్ ప్రకటించిన ట్రంప్ ఆ తర్వాత వాటిపై సెకండరీ టారిఫ్స్ పెంచారు. అక్కడితో ఆగని ట్రంప్ ఫార్మా, ఫర్నిచర్, ఆటో, మూవీస్ అంటూ కనిపించిన ప్రతి దానిపైనా సుంకాలు వేస్తూ విదేశీ ఎగుమతులను అడ్డుకుంటున్నారు. దీనికి తోడు తాజాగా మరో కొత్త సుంకాలను ప్రకటించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ట్రంప్ సోమవారం అమెరికాలోకి దిగుమతయ్యే అన్ని మీడియం అండ్ హెవీ డ్యూటీ ట్రక్కులపై నవంబర్ 1 నుంచి 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. విదేశీ కంపెనీల పోటీ నుంచి అమెరికన్ తయారీదారులను కాపాడేందుకు ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. వాణిజ్య రక్షణవాదాన్ని తన ఆర్థిక ఎజెండాలో భాగంగా మార్చుకున్న ట్రంప్.. అమెరికాలోని ట్రక్ తయారీదారులను దిగుమతుల ద్వారా వస్తున్న బయటి పోటీ నుండి రక్షించడానికి ఈ చర్యలు తోర్పడతాయని వినిపిస్తోంది.
నవంబర్ నుంచి ఈ సుంకాలు అమలులోకి వస్తుండగా అవి భారతదేశంపై పెద్దగా ప్రభావాన్ని చూపబోవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ తాజా నిర్ణయం కారణంగా ఏప్రిల్ నెల నుంచి భారీగా సుంకాలతో ఇబ్బంది పడుతున్న భారత్ కొత్త ట్రక్ టారిఫ్స్ వల్ల ఎలాంటి ప్రతికూలతలను ఎదుర్కోదని వెల్లడైంది. ఎందుకంటే భారతదేశం నుంచి అమెరికాకు ఎలాంటి ట్రక్ ఎగుమతులు లేకపోవటమే. అయితే ట్రంప్ తాజా చర్యలు ప్రధానంగా యూరోపియన్ దేశాల్లోని ఆటో కంపెనీలను టార్గెట్ చేసినవిగా వెల్లడైంది. అమెరికాలో కమర్షియల్ వాహనాలు ప్రధానంగా ఈయూ దేశాల నుంచి రావటంపై ట్రంప్ ప్రస్తుతం గురిపెట్టారని నిపుణులు అంటున్నారు. గత నెలలో, జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా భారీ ట్రక్కుల దిగుమతులపై సుంకాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయని ట్రంప్ మొదట్లో వెల్లడించిన తర్వాత ప్రస్తుత చర్యలు వస్తున్నాయి.