మొట్టమొదటి లోక్ పాల్ గా PC ఘోష్

మొట్టమొదటి లోక్ పాల్ గా PC ఘోష్

దేశ మొట్టమొదటి లోక్ పాల్ గా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నియమితులయ్యారు. లోక్ పాల్ పదవిలో చంద్ర ఘోష్ ను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. లోక్ పాల్ కమిటీలో 8మంది సభ్యులను కూడా నియమించారు. లోక్ పాల్ చట్టం ఆమోదం పొందిన ఐదేళ్ల తర్వాత మొదటి కమిటీ నియామకం జరిగింది.

సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ దేశ మొదటి లోక్ పాల్ గా నియమితులయ్యారు. 2013లోనే లోక్ పాల్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. 2014 జనవరి 16న చట్టాన్ని నోటిఫై చేశారు రాష్ట్రపతి. అప్పట్నుంచి ఇప్పటివరకు లోక్ పాల్ నియామకం జరగలేదు. ఫిబ్రవరి చివరికల్లా లోక్ పాల్ ను నియమించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టటంతో… ఎన్నికల ముందు లోక్ పాల్ గా PC ఘోష్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కమిటీ.. లోక్ పాల్ ను ఎంపిక చేసింది. కమిటీలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రొహత్గీ సభ్యులుగా ఉన్నారు. అయితే కమిటీ సమావేశాలకు ఖర్గే హాజరుకాలేదు. కమిటీ PC ఘోష్ పేరును సూచించగా… రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. లోక్ పాల్ జ్యుడీషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ భోస్లే, జస్టిస్ ప్రదీప్ కుమార్, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠీ, నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా సశస్త్ర సీమాబల్ మాజీ చీఫ్ అర్చన రామసుందరం,  మహారాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ దినేశ్ కుమార్ జైన్, మహేందర్ సింగ్, ఇంద్రజీత్ ప్రసాద్ లను నియమించారు.

లోక్ పాల్ గా ఎంపికైన పినాకి చంద్ర ఘోష్.. 2013 మార్చి నుంచి 2017 మే వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడిగా ఉన్నారు.

లోక్ పాల్ నియామకంతో 51 ఏళ్ల కల నెరవేరినట్టైంది. లోక్ పాల్ పదాన్ని డాక్టర్ LM సింఘ్వీ ప్రతిపాదించారు. 1960లో అప్పటి న్యాయ శాఖా మంత్రి అశోక్ కుమార్ సేన్.. రాజ్యాంగబద్ద అంబుడ్స్ మన్ గురించి పార్లమెంట్ కు వివరించారు. 1968లో జన్ లోక్ పాల్ బిల్లును ప్రఖ్యాత లాయర్ శాంతి భూషన్ ప్రతిపాదించారు. 1969లో లోక్ పాల్ బిల్లును 4వ లోక్ సభ ఆమోదించింది. అయితే రాజ్యసభలో మాత్రం గట్టెక్కలేకపోయింది. 2011లో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ ఇతర సామాజిక కార్యకర్తలు ఉద్యమించారు. దీంతో 2011 డిసెంబర్ 27న లోక్ పాల్ ను ఆమోదించింది లోక్ సభ. అయితే ఆ బిల్లు బలహీనంగా ఉందని మళ్లీ ఆందోళనలు జరగడంతో… కొన్ని మార్పులు చేసి 2013 డిసెంబర్ 17న రాజ్యసభలో ఆమోదించారు. డిసెంబర్ 18న లోక్ సభ ఆమోదించింది. 2014 జనవరి 16న రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

ప్రస్తుత, మాజీ ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఏడాదికి 10 లక్షలకు మించి విదేశాల నుంచి విరాళాలు స్వీకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వాటి నిర్వాహకులపై అవినీతి సంబంధ ఫిర్యాదులపై స్వతంత్రంగా దర్యాప్తు చేసే అధికారం లోక్ పాల్ కు ఉంటుంది.