రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి :జస్టిస్ సుదర్శన్ రెడ్డి

రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి :జస్టిస్ సుదర్శన్ రెడ్డి
  •     బీసీల సదస్సులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్య
  •      గట్టిగా నిలబడితేనే  42% రిజర్వేషన్లు: ప్రొఫెసర్ కోదండరాం

బషీర్​బాగ్, వెలుగు: రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు 42% బిల్లును 9వ షెడ్యూల్​లో చేర్చాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు అధ్యక్షతన శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో "బీసీలకు 42% రిజర్వేషన్లు సాధన" అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి  జస్టిస్ సుదర్శన్ రెడ్డితోపాటు జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర మూర్తి, ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు.

 ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. కేరళ, తమిళనాడులో సామాజిక న్యాయం కోసం ప్రజా ఉద్యమాలు జరిగాయని గుర్తుచేశారు.1961 జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్లపై పరిమితి పెట్టారని, అప్పటికీ ఇప్పటికీ జనాభాలో, సామాజిక అంశాల్లో అనేక మార్పులు వచ్చాయని చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకొని కోర్టులు వ్యవహరించాలన్నారు. 

జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. వి.పి.సింగ్ బీసీలకు రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ వేస్తే, దానికి వ్యతిరేకంగా మనువాదులు యాత్ర చేపట్టారని గుర్తుచేశారు. గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.42 % రిజర్వేషన్లు 9వ షెడ్యూల్​లో చేర్చినప్పటికి సుప్రీంకోర్టులో దీనిపై చర్చ వస్తుందన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్లకు టీజేఎస్ కట్టుబడి ఉందన్నారు. 

అందుకోసం నవంబర్​లో అన్ని జిల్లాలో సదస్సులు, డిసెంబర్​లో హైదరాబాద్​లో భారీ ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు. జనవరిలో సీఎం రేవంత్ రెడ్డితో సహా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. కోర్టులు కూడా 50% పరిమితిపై శిలా శాసనం ఏమి పెట్టలేదని కోదండరాం పేర్కొన్నారు.