
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అంబుడ్స్‌మన్‌గా మధ్య ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్, ఎథిక్స్ ఆఫీసర్‌గా రిటైర్డ్ జస్టిస్ కేసీ భాను ఎంపికయ్యారు. ఈ మేరకు ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఈ ఇద్దరి నియామకాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. 87వ ఏజీఎంకు కొనసాగింపుగా జరిగిన ఈ సమావేశంలో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్ అంబుడ్స్‌మన్ పేరును ప్రతిపాదించగా.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ వి. చాముండేశ్వర్ నాథ్ బలపరిచారు.
ఎథిక్స్ ఆఫీసర్ పోస్టుకు జస్టిస్ భాను పేరును హెచ్‌సీఏ సీనియర్ మెంబర్ వినోద్ ఇంగ్లే ప్రతిపాదించారు. మరో సీనియర్ మెంబర్ రవీందర్ సింగ్ బలపరిచారు. కాగా, ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం కేసులో ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, ట్రెజరర్ సీజే శ్రీనివాస్ సీఐడీ కస్టడీలో ఉండగా.. తాత్కాలిక ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్ ఏజీఎంకు నేతృత్వం వహించారు. సభ్యులు ఎజెండాలోని అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకాలపైనే చర్చ చేయడంతో ఏజీఎం సాఫీగా, స్వల్ప సమయంలోనే ముగిసిందని హెచ్‌సీఏ మెంబర్ ఒకరు తెలిపారు. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు ఏకసభ్య కమిటీ వేటు వేసిన 57 క్లబ్‌లను అనుమతించలేదు.
సుప్రీంకమిటీ చర్యలు తీసుకున్న ఈ క్లబ్‌లను గత ఏజీఎంలకు ఆహ్వానించి తప్పు చేశారని, అందుబాటులో ఉన్న అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు ఈసారి రూల్స్ పాటించారని సదరు మెంబర్ చెప్పారు. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ పదవీకాలం ఏడాది కాగా.. ఈ పోస్టులకు అంగీకారం తెలిపిన జస్టిస్ సురేశ్ కుమార్, జస్టిస్ కేసీ భాను రెండు మూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఉప్పల్ స్టేడియం పక్కనున్న పార్కింగ్ స్థలం వివాదం అంశాన్ని ఓ సీనియర్ మెంబర్, అధికార పార్టీకి చెందిన నేత ఏజీఎంలో ప్రస్తావించారు. దీనిపై టీఎస్‌ఐఐసీతో చర్చలు జరిపి వివాదాన్ని పరిష్కరించేందుకు తన వంతు కృషి
చేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.