ప్రపంచదేశాలను వణికిస్తోన్న ప్రాణాంతక మంకీపాక్స్ వ్యాధికి డెన్మార్క్ సంస్థ బవేరియన్ నార్డిక్(Bavarian Nordic A/S) టీకాను అభివృద్ధి చేసింది. టీకా పేరు.. జిన్నెయోస్(Jynneos). ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అనుమతి ఇచ్చింది.
వ్యాక్సినియా అంకారా-బవేరియన్ నార్డిక్ (MVA-BN)గా పిలువబడే ఈ టీకాను 18 ఏళ్ల వయసు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో ఇవ్వాలి. మోతాదుల మధ్య నాలుగు వారాల విరామం ఉంటుంది. 2నుండి 8 డిగ్రీల సెల్సియస్ చల్లని ఉష్ణోగ్రతల వద్ద టీకాను ఎనిమిది వారాల వరకు నిల్వ ఉంచవచ్చు. అయితే, 18 ఏళ్లలోపు ఉన్నవారికి టీకా ఇచ్చేందుకు అనుమతి లేనప్పటికీ.. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, యుక్తవయసు వారు, రోగనిరోధక శక్తి లేని వారికి దీన్ని ఇవ్వవచ్చని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
బవేరియన్ నార్డిక్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ ఎంపాక్స్ వ్యాక్సిన్‌ను(MVA-BN) ప్రభుత్వాలు, గావీ(GAVI), యునిసెఫ్ వంటి అంతర్జాతీయ ఏజెన్సీలు కొనుగోలు చేయొచ్చు. తయారీ సంస్థ ఒక్కటే కావడంతో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే వీటి ఉత్పత్తి జరుగుతోంది. అయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో తక్షణమే ఈ వ్యాక్సిన్ అందించేందుకు ముమ్మర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.
కాగా, జపాన్‌కు చెందిన KM బయోలాజిక్స్ తయారు చేసిన LC16 అనే మరో వ్యాక్సిన్‌ను కూడా WHO సమీక్షిస్తోంది.