ఉరేసుకొని వివాహిత సూసైడ్

ఉరేసుకొని వివాహిత సూసైడ్

పద్మారావునగర్, జవహర్ నగర్, వెలుగు: అత్తింటివారి వేధింపులు భరించలేక ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బన్సీలాల్​పేట డివిజన్​భోలక్​పూర్ కు చెందిన పోల మల్లేశ్, పెంటుబాయిల కూతురు జ్యోతి(43),  దమ్మాయిగూడకు చెందిన దున్న శ్రీనుబాబు ప్రేమించుకొని 2005లో పెండ్లి చేసుకున్నారు. వీరికి పాప విష్ణు మౌనిక(13), బాబు సాకేత్(9) ఉన్నారు. వీరిది కులాంతర వివాహం కావడంతో జ్యోతికి మొదటి నుంచి అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. 
శ్రీనుబాబుకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని గ్రహించిన జ్యోతి భర్తను నిలదీయడంతో గొడవలు ఎక్కువయ్యాయి. తరచూ జ్యోతిని భర్త కొట్టేవాడు. భర్త, అత్తామామతో పాటు ఆడపడుచు వేధింపులు ఎక్కువ కావడంతో జ్యోతి గతేడాది గాంధీ నగర్​ పీఎస్​లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వారికి కౌన్సిలింగ్​ఇచ్చి పంపించారు. అయినప్పటికీ వారి వేధింపులు ఆగలేదు. 15 రోజుల క్రితం జ్యోతి తండ్రి మల్లేశ్ చనిపోగా కనీసం చూడడానికి శ్రీనుబాబు వెళ్లకపోగా, పిల్లలను కూడా పంపించలేదు. దీంతో జ్యోతి ఒక్కతే తండ్రి అంత్యక్రియలకు హాజరై  11 రోజుల తర్వాత అత్తింటికి వెళ్లింది. రాగానే అత్తింటి వేధింపులు కొనసాగడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె సోమవారం రాత్రి బెడ్రూంలోకి వెళ్లి ఎంతకూ తలుపు తెరవలేదు. విషయాన్ని భర్త పోలీసులకు తెలపడంతో అక్కడకు వెళ్లి తలుపులు పగులగొట్టి చూడగా, జ్యోతి ఫ్యాన్​కు  చీరతో ఉరేసుకొని కనిపించింది. పోలీసులు డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తమ కూతురు మృతికి అత్తింటి వేధింపులే కారణమని ఆమె తల్లి పెంటుబాయి దమ్మాయిగూడ పీఎస్​లో కంప్లెంట్​ ఇవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు 
చేస్తున్నారు.

కమిషనర్​కు మర్రి శశిధర్​రెడ్డి ఫోన్​

జ్యోతి ఆడపడుచు భర్త(కానిస్టేబుల్)​ సాయంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె బంధువులు మాజీ మంత్రి, బీజేపీ నేత మర్రి శశిధర్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే  పోలీస్​కమిషనర్​తో మాట్లాడారు. జ్యోతి సూసైడ్​కు కారకులైన వారిని కఠినంగా శిక్షించి, ఆమె 
పిల్లలకు న్యాయం చేయాలని శశిధర్​రెడ్డి చెప్పారు. దీంతో స్పందించిన సీపీ కేసును నిష్పాక్షిపాతంగా దర్యాప్తు చేయాలని జవహర్​నగర్ ​పోలీసులను 
ఆదేశించారు.