
- (1873 సెప్టెంబర్ లో సత్యశోధక్ సమాజ్ స్థాపన జరిగిన సందర్శంగా.. )
భారతదేశ చరిత్రలో ఆధునిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే. దేశంలో సామాజిక సమానత్వం కొరకు పోరాడుతూ రాజకీయ చైతన్యం రగిలించిన వ్యక్తి. ఒక బానిసకు అవమానం అంటే, ఆత్మగౌరవం అంటే తెలియాలని బయలుదేరాడు. ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలకు పడ్డ బానిస సంకెళ్లను విప్పడానికి విద్యను విముక్తి మార్గంగా ఎంచుకొన్నారు. అంధకారాన్ని తరిమిన జ్ఞాన విప్లవం ఇది. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పించి మహిళలు, బాలికలకు చదువుచెప్పించాడు. ఆమె దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.
బాలికలకు పాఠశాలలను నెలకొల్పారు. కోట్లాది ప్రజలకు దారి చూపిన గొప్ప ఆది దంపతులు వీరు. జ్యోతిరావు పూలే విప్లవ పోరాటం ఆయన నెలకొల్పిన సత్యశోధక్ సమాజ్ నుంచే జరుగుతుంది. 19వ శతాబ్దం నాటి సాంప్రదాయక, చాందస భావాలతో నిండిన సమాజాన్ని సంస్కరించడానికి బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ సంస్థలు పుట్టాయి. అవి కేవలం ఉన్నత కులాలకే పరిమితమయ్యాయి. వీటికి అభిముఖంగా అట్టడుగు అణగారిన వర్గాల విముక్తికి సత్యశోధక సమాజ్ యుద్ధ నాదాన్ని మోగించింది. ఇదీ 1873 సెప్టెంబర్లో మహారాష్ట్రలోని పూణేలో ఏర్పడింది. ఈ సంస్థ స్థాపించి 150 ఏళ్ల మైలు రాయిని దాటింది. అసమానతలు, కుల పోరాటాలు ఇప్పటికీ ధ్వనిస్తున్న కాలంలో పూలే సాగించిన సామాజిక సమరం నేటికి అనుసరణీయం.
వారసత్వ జ్ఞానంతో సమానత్వ సమరం
సత్యశోధక్ సమాజ్ సత్యాన్వేష' కుల' సంఘం. ఇది జాతి చారిత్రక వారసత్వ జ్ఞానంతో అస్తిత్వ పోరాటం చేయమంటుంది. ఈ క్రమంలో పూలే దేశంలో వేల సంవత్సరాలుగా అణచివేయబడిన వర్గాల చరిత్రను వెలికితీశారు. వారి సామాజిక స్థితికి కారణాలను బయటపెట్టాడు. కడపటి వాడే ఈ దేశాన్ని పాలించిన మొట్టమొదటి మహారాజ్ అనీ పిలుపునిచ్చాడు. ఊరికి దూరంగా జీవిస్తున్న నేటి మాదిగలే ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించారనీ మరుగునపడిన చారిత్రక సత్యాన్ని చెప్పాడు.
ఇప్పటికీ మాదిగలు ఒంట పట్టించుకున్నారనేది ప్రశ్నార్థకమే? సత్యశోధక్ సమాజ్లో కేవలం అణచివేతకు గురైన వర్గాలకు మాత్రమే ఉంది. ఆయన సహధర్మిణి సావిత్రిబాయి మహిళల విభాగానికి నాయకత్వం వహించారు. దీన బంధు అనే వార్తాపత్రిక ద్వారా ఈ ఉద్యమాన్ని విస్తరించాడు. పురోహితులు లేకుండా వివాహాలు జరిపాడు. కులం, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడారు. వీటన్నిటిపై ప్రశ్నలవర్షంగా తన గులాంగిరి గ్రంథం నిలిచింది. పూలే చైతన్యంతో ఆనాటి కాలంలో నాయి బ్రాహ్మణులు (మంగలి) బ్రాహ్మణ ఆధిపత్య వర్గాలకు క్షౌరాన్ని తీయడం ఆపేశారు.
జంబుద్వీప జన జాగృతి
ఒక వ్యక్తిగా, సంస్థగా అణగారిన వర్గాల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పూలే జీవిత కాలం పోరాడాడు. ఆయన మరణానంతరం కూడా ఆయన ఉద్యమాన్ని తన సతీమణి ముందుకు తీసుకెళ్లారు. షాహు మహారాజ్, భావురావు పాటిల్ వంటి నాయకులు కూడా పూలే వారసత్వాన్ని కొంతవరకు కొనసాగించారు. ఆయన మహోన్నత పోరాటం బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయునికి స్ఫూర్తినిచ్చాయి. పూలేను గురువుగా ప్రకటించుకుని వారసత్వ ఉద్యమాన్ని కొనసాగించాడు.
ఆయన కోరుకున్న సామాజిక, రాజకీయ మార్పును భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఆధునిక భారతీయ సమాజ స్థాపనకు పూలే మార్గదర్శకంగా నిలిచాడు. కానీ పూలే స్థాపించిన సంస్థకు ఆశించిన స్థాయిలో ప్రచారం లేకపోవడం బాధాకరం. 1930లో కాంగ్రెస్లో కలిపారు. కనుమరుగుచేశారు. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో సత్యశోధక్ సమాజ్ వారసత్వానికి కొనసాగింపుగా జంబుద్వీప జన జాగృతి నెలకొల్పబడింది. ఇదీ బీసీ, ఎస్సీ, ఎస్టీల సామాజిక, సాంస్కృతిక చైతన్య వేదిక.
పూలే పోరాటం అంటే ఇదేనా?
రాజ్యాంగం వచ్చి విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగైనప్పటికీ అట్టడుగు వర్గాల జీవితాల్లో ఆశించిన మార్పు రావడం లేదు. ఇంకా కులం పేరుతో దుర్విచక్షణ, అంటరానితనం ఛాయలు కొనసాగుతున్నాయి. లింగ వివక్షత తొలగలేదు. విద్యా వ్యాపారంగా మారింది. అనేక సామాజిక రుగ్మతలు ఇంకా ప్రబలుతున్నాయి. ఈ క్రమంలో సమాజంలో జ్యోతిరావు ఫూలే స్థాపించిన సత్యశోధక సమాజం సిద్ధాంతాలు, పోరాట లక్ష్యాలు అత్యంత ప్రాధాన్యత కలిగిఉన్నాయి.
భారతదేశంలో ఇంకా మెజారిటీ వర్గాలకు వారి జనాభా ప్రకారం అవకాశాలు అందడం లేదు. వీటి కొరకు జరుగుతున్న ఉద్యమాలు విఫలమవుతున్నాయి. దేశంలోని వెనుకబడిన వర్గాలు పూలే, అంబేడ్కర్ సిద్ధాంతాలతో రకరకాల సంఘాలను పెడుతున్నారు. ఇవి అగ్రకుల పాలకుల ఒరలోనే బందీ అవుతున్నాయి. రాజ్యాంగం ద్వారా లబ్ధిపొందిన ఉద్యోగ వర్గం సైతం ఇదే బాటలో ప్రయాణిస్తున్నారు. వెరసి అంబేద్కర్, పూలే వారసులమని చెప్పుకోవడం బాధాకరం. క్షేత్రస్థాయిలో వారి సైద్ధాంతిక విప్లవ పోరాటాన్ని ఏమేరకు తీసుకుపోతున్నామనేది ఆత్మ విమర్శ చేసుకోవాలి.
విముక్తి మార్గం
పూలే 1876 సంవత్సరంలోనే పూణె నగర మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ పదవిలో ఉంటూ ప్రజా సంక్షేమం, సామాజిక సమానత్వం, విద్య కోసం అలుపెరుగని పోరాటం చేశాడు. నేడు రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఎంతోమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు అధికారంలోకి వస్తున్నప్పటికీ.. తన జాతి విముక్తికి పాటుపడకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఆయన విలువలు, పోరాట స్పూర్తి అణచివేయబడిన వర్గాల గొంతుక కావాలి. ఇందుకై పూలే సత్యశోధక సమాజ్ పోరాటం మరోమారు ప్రతి ఒక్కరి గుండెల్లో ధ్వనించాలి. అంతిమంగా అణగారిన వర్గాలు రాజకీయ భాగస్వామ్యమే విముక్తికి మార్గం.
- సంపతి రమేష్ మహారాజ్,సోషల్ ఎనలిస్ట్