మునుగోడు బై పోల్​లో అక్రమాలు జరిగాయని ఈసీకి పాల్ ఫిర్యాదు

మునుగోడు బై పోల్​లో అక్రమాలు జరిగాయని ఈసీకి పాల్ ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: మునుగోడు బై పోల్​లో అక్రమాలు జరిగాయని, ఈ ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ లో ఈసీ ఆఫీసర్లను కలిసి ఈ మేరకు ఆయన కంప్లయింట్ ఇచ్చారు. ఉప ఎన్నికలో అక్రమాలకు సంబంధించిన వీడియోలు, డాక్యుమెంట్లు సమర్పించారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయకపోతే దేశంలో ఎన్నికలు నిర్వహించడమే వేస్ట్ అని అన్నారు. తన ఫిర్యాదుపై ఈసీ అధికారులు షాక్ అయ్యారని తెలిపారు.

ఈ ఎన్నిక కోసం ఒక్క నెలలోనే వేల కోట్ల అవినీతి డబ్బు ఖర్చు అయిందన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నిక ఎక్కడా జరగలేదన్నారు. పోలింగ్ తర్వాత మూడు రౌండ్లు వేసిన సీల్, ఆరవ తేదీన ఒకే రౌండ్ కే ఎలా ఓపెన్ అయిందని పాల్ అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలు రీప్లేస్ అయ్యాయని ఆరోపించారు. అడ్వకేట్ల నుంచి న్యాయ సలహా తీసుకుని, మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. బ్యాలెట్ పేపర్ లతో పోలింగ్ నిర్వహించాలని కోరితే ఎన్నికల సంఘం ఎందుకు ఈవీఎంలను పెట్టిందని ప్రశ్నించారు. పోలింగ్ మర్నాడు కౌంటిగ్ చేపట్టకుండా మూడు రోజుల తర్వాత ఎందుకు చేశారో చెప్పాలన్నారు. ఈ ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానం లేదని, ఎలక్షన్ లో అక్రమాలు జరిగాయనడానికి ఇదే నిదర్శనమన్నారు