కడక్ నాథ్ కోడి.. చాలా కాస్ట్ లీ గురూ…

కడక్ నాథ్ కోడి.. చాలా కాస్ట్ లీ గురూ…

గంగాధర, వెలుగు :ముదురు నలుపు, నీలం రంగుల్లో ఉంటాయి  కడక్‌నాథ్‌ కోళ్లు. చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా నలుపు రంగులో ఉంటుంది. కొన్ని పుంజులు అరుదుగా నలుపు, బంగారు రంగు ఈకలతో ఉంటాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఇవి తట్టుకుంటాయి. ఈ కోళ్లు ఆరు నెలల వయసు నుంచే గుడ్లు పెడతాయి. వీటికి పొదుగుడు లక్షణం తక్కువ. అందుకే  ఇంక్యుబేటర్​లో పెట్టి ఇరవై ఒక్క రోజుల వరకు ఉంచుతారు.

పోషక విలువలు

ఈ కోళ్ల మాంసంలో అరుదైన సూక్ష్మపోషకాలు ఉన్నాయి. సాధారణ కోళ్ల మాంసంతో పోలిస్తే  మాంసకృత్తులు ఎక్కువ, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.  మాంసంలో 18 రకాల అమైనో యాసిడ్లు, విటమిన్లు, క్యాల్షియం, ఐరన్​, పాస్ఫరస్​ వంటివి ఉంటాయని మైసూరులోని ‘సెంట్రల్​ ఫుడ్​ అండ్​ రీసెర్చ్​ ఇని​స్టిట్యూట్’ స్పష్టం చేసింది. ఈ కోడి ఇరవై వారాల వయసులో 920 గ్రాముల బరువు ఉంటుంది. ఆరేడు నెలలకు గుడ్లు పెడుతుంది. ఒక్క ఏడాదిలో నూట ఐదు గుడ్లు పెడుతుంది. గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. పిల్లలు నీలం, నలుపు, తెలుపు చారలతో ఉండి, పెరిగే కొద్దీ నలుపు రంగులోకి మారతాయి.

అరుదైన కోళ్లు

గంగాధర మండలం మంగపేటకు చెందిన నాగెల్లి కమలాకర్​రెడ్డి పాలిటెక్నిక్​లో ఎలక్ట్రానిక్స్‌​ డిప్లొమా చదివాడు. చదువు పూర్తికాగానే ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా, సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాడు. పెరటికోళ్ల పెంపకాన్ని ఎంచుకున్నాడు. పెరటి కోళ్లకు రోగ నిరోధక శక్తి తక్కువ. తరచుగా చనిపోయేవి. నష్టం వాటిల్లేది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి అతడు యూట్యూబ్​లో నల్లకోళ్ల పెంపకం చూశాడు. మహారాష్ట్రలోని రాంపూర్​కు వెళ్లి 500 కోడి పిల్లలను కొనుగోలు చేశాడు. ఎకరం విస్తీర్ణంలో రూ.15 లక్షలు ఖర్చు చేసి షెడ్లు వేశాడు. కోడి గుడ్లను మార్కెట్లో అమ్మకుండా కోడి పిల్లలను తయారు చేయడానికి రూ.2 లక్షలతో ఒక ఇంక్యుబేటర్​ను కొనుగోలు చేశాడు.  గుడ్లను ఇంక్యుబేటర్​లో 21 రోజులపాటు ఉంచి పిల్లలుగా తయారు చేస్తున్నాడు.

కడక్​నాథ్​ కోళ్ల పెంపకం లాభాల మీద లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ కోళ్ల పెంపకం గురించి కమలాకర్​రెడ్డిని అడిగితే… ‘‘మొదట నాటుకోళ్లను పెంచా. ఎండ, వేరే కారణాల వల్ల కోళ్లు చనిపోయాయి. నష్టాన్ని అధిగమించేందుకు కడక్​నాథ్​ కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టా. ఇప్పుడు నా దగ్గర ఏడు వందల కోళ్లు ఉన్నాయి. కోళ్లు, గుడ్లు, కోడి పిల్లలు కొనడానికి సిద్ధిపేట, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్​ జిల్లాల నుంచి వస్తున్నారు. నాకు మంచి ఉపాధి దొరికింది” అని అన్నాడు.