బీఆర్ఎస్ పనైపోయింది.. పార్టీకి ప్రజలు దూరమవుతున్నరు: కడియం

బీఆర్ఎస్ పనైపోయింది.. పార్టీకి ప్రజలు దూరమవుతున్నరు: కడియం
  • నిర్ణయం తీసుకోవాల్సిన టైమొచ్చిందని వ్యాఖ్య 
  • కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కావ్యతో దీపాదాస్ మున్షీ భేటీ 
  • కాంగ్రెస్​లోకి రావాలని ఆహ్వానం
  •  ఇయ్యాల ఇద్దరూ పార్టీలో చేరే చాన్స్

హైదరాబాద్, వెలుగు: కారణాలేవైనా రాష్ట్రంలో బీఆర్ఎస్​పనైపోయిందని, పార్టీకి ప్రజలు దూరమవుతున్నారని బీఆర్ఎస్​ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజల మేలు కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ‘‘కాంగ్రెస్​లో చేరాలని ఆ పార్టీ స్టేట్​ఇన్ చార్జ్ దీపాదాస్​మున్షీ ఆహ్వానించారు. నా సహచరులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను. నేనింకా కాంగ్రెస్​లో చేరలేదు. ఏ నిర్ణయమూ తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్​తరఫున పోటీ చేసే విషయంపై తర్వాత చెప్తాను” అని తెలిపారు.

శుక్రవారం మినిస్టర్​క్వార్టర్స్​లో కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్యతో కాంగ్రెస్​రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్​మున్షీ, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్​చౌదరి, మల్లు రవి, సంపత్​కుమార్ సమావేశమయ్యారు. కాంగ్రెస్​లో చేరాలని వాళ్లిద్దరినీ ఆహ్వానించారు. కాగా, బీఆర్ఎస్​వరంగల్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నానని కడియం కావ్య ఇప్పటికే ప్రకటించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు కేసీఆర్​కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే శ్రీహరి, కావ్యతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఏఐసీసీ ఆదేశాల మేరకే కడియం ఫ్యామిలీని పార్టీలోకి ఆహ్వానించామని దీపాదాస్​మున్షీ తెలిపారు. వారు ఎప్పుడు చేరుతారన్న దానిపై తాము కూడా కుతూహలంగా ఉన్నామన్నారు.  

ఇయ్యాల చేరే చాన్స్.. 

కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య శనివారం కాంగ్రెస్​లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో శ్రీహరి, కావ్య భేటీ కావాల్సి ఉండగా.. దానికి ముందే దీపాదాస్​మున్షీ కడియం ఇంటికి వెళ్లారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కావ్యకు వరంగల్​ఎంపీ టికెట్​ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని కడియం శ్రీహరికి దీపాదాస్​మున్షీ చెప్పారని సమాచారం.