కర్నాటక కాంగ్రెస్ లో ఓ ఎమ్మెల్యే ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఆరోపణలు ఆ ఎమ్మెల్యేను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తనకు ఏదైనా జరిగితే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని డిమాండ్ చేయడంతో.. ఈ ఇష్యూ ఇప్పుడు కర్నాటకలో హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
తనకు ఏదైనా జరిగితే కడూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఎస్ ఆనందే బాధ్యత వహించాలని, తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ లత అనే మహిళా కానిస్టేబుల్ తన వాట్సాప్ స్టేటస్ లో పోస్టు పెట్టింది. ఈ విషయం వైరల్ గా మారడంతో డిపార్ట్ మెంట్ లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో కాక రేపింది. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లడంతో మహిళా కానిస్టేబుల్ పై వేటు పడింది. చిక్కమగళూరు ఎస్పీ ఉమా ప్రశాంత్.. కానిస్టేబుల్ లతను సస్పెండ్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో హెల్మెట్ ధరించనందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులు జరిమానా విధించారు. ఈ విషయం తెలియడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సంఘటనా స్థలానికి వెళ్లారు. తన మద్దతుదారులకు అండగా నిలుస్తూ.. జరిమానాపై మహిళా కానిస్టేబుల్ లతను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎన్నికల ఫలితాల తరువాత కానిస్టేబుల్ లతను కడూరు పోలీస్ స్టేషన్ నుండి తరికెరె పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు ఉన్నతాధికారులు. ప్రతీకారంతోనే తనను బదిలీ చేశారంటూ లత నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నించేందుకు ఎమ్మెల్యే ఇంటికి కూడా వెళ్లారు కానిస్టేబుల్ లత.
చిక్కమగళూరు జిల్లా బీజేపీకి కంచుకోటగా ఉంది. అయితే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. జిల్లాలోని అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి కూడా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.