
కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాకిస్తూ మాజీ స్పీకర్ కాగోడు తిమ్మప్ప కుమార్తె రాజనందిని ఏప్రిల్ 12 బుధవారం రోజున బీజేపీలో చేరారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో రాజనందిని బీజేపీలోకి వెళ్లారు. మరోవైపు రాజనందిని బీజేపీలో చేరడంపై ఆమె తండ్రి తిమ్మప్ప స్పందించారు.
తిమ్మప్ప మాత్రం తన కూతురు నిర్ణయాన్ని అంగీకరించలేదని, ఆమె ఇలా చేస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని, దీని వెనుక బీజేపీ నేత హర్తాళు హాలప్ప వ్యూహం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే 189 మంది అభ్యర్థులతో అధికార బీజేపీ ఫస్ట్ లిస్టును ప్రకటించింది. ఇందులో కొత్తగా 52 మందికి టికెట్ ఇచ్చింది. ఎనిమిది మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దింపుతోంది.
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ స్థానం నుండి పోటీ చేస్తుండగా, మాజీ సిఎం బిఎస్ యడియూరప్ప కుమారుడు బివై విజయేంద్ర తన తండ్రి షికారిపుర నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్కమగళూరు నుంచి, రాష్ట్ర మంత్రి ఆర్ అశోక కనకపురలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌పై పోటీ చేయనున్నారు.
వరుణ నియోజకవర్గంలో మాజీ సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి వీ సోమన్న పోటీ చేయనున్నారు. ఇవాళ బీజేపీ రెండో లిస్టును ప్రకటించనుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి113 సీట్లు కావాలి. మార్చి10న కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి.