సక్సెస్‍ కోసం 3 డీ ఫార్ములా అప్లై చేయండి : కైలాస్‍ సత్యార్థి

సక్సెస్‍ కోసం 3 డీ ఫార్ములా అప్లై చేయండి : కైలాస్‍ సత్యార్థి

సక్సెస్‍ కోసం 3 డీ ఫార్ములా అప్లై చేయండి
చిన్నప్పుడే పెద్ద డ్రీమ్‍ పెట్టుకోవాలి 
దేశంలో గంటకు ఐదుగురు పిల్లలపై లైంగిక దాడులు
వరంగల్​లో 50 వేల మంది స్టూడెంట్లతో  కైలాస్​ సత్యార్థి ఇంటరాక్షన్‍

 

వరంగల్‍, హనుమకొండ, వెలుగు : చిన్నారులు తమ జీవితంలో సక్సెస్‍ కావాలంటే.. డ్రీమ్‍, డిస్కవరీ, డూ (3 డీ) ఫార్ములా అనుసరించాలని నోబెల్‍ శాంతి బహుమతి అవార్డు గ్రహీత కైలాస్‍ సత్యార్థి సూచించారు. సోమవారం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ ​అండ్‍ సైన్స్​ కాలేజీ గ్రౌండ్‍లో 50 వేల మంది స్టూడెంట్లతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టేట్‍ ప్లానింగ్‍ కమిషన్‍ వైస్‍ చైర్మన్‍ బోయినపల్లి వినోద్‍కుమార్‍, ప్రభుత్వ చీఫ్​ విప్​, ఎమ్మెల్యే దాస్యం వినయ్‍భాస్కర్‍తో కలిసి ‘చిల్డ్రన్‍ ఎడ్యుకేషన్‍ ఈజ్​ఏ నేచర్‍ అండ్‍ ఫ్యూచర్‍' అనే అంశంపై మాట్లాడారు. భవిష్యత్​లో ఉన్నత స్థానంలో ఉండాలంటే డ్రీమ్​కూడా అంతే పెద్దగా పెట్టుకొని, కష్టపడాలన్నారు. కలలు సొంత ప్రయోజనాల కోసం కాకుండా..సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. చిన్నారులు తమ నిజ జీవితంలో సమస్యలను అధిగమించడం ద్వారా రియల్‍ హీరోలుగా నిలవాలన్నారు. అప్పట్లో టెక్నాలజీ, ప్రొత్సాహం పెద్దగా లేని కారణంగా నోబెల్‍ ప్రైజ్‍ అందుకోవాలనే తన కలకు 50 ఏండ్లు పట్టిందని.. ఇప్పటి పిల్లలు ఛాలెంజ్‍గా ప్రయత్నిస్తే అంత సమయం అవసరం లేదన్నారు.

తాను పుట్టింది మధ్యప్రదేశ్​లోనని, ఒకరోజు స్కూల్‍ కు వెళ్తున్నప్పుడు ఓ పిల్లవాడు కూలి పని చేయడాన్ని ప్రశ్నించానన్నారు. దీనికి అతడు ‘కొందరికి చదువుకునే అదృష్టం ఉంటే..మాలాంటి వాళ్లకు పని చేయడమే జీవితం’ అని చెప్పాడని.. అప్పుడే బాలల హక్కుల కోసం పనిచేయాలనే ఆలోచనకు వచ్చినట్లు చెప్పారు. ఆడపిల్లలు ఎక్కువగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని  ఇండ్లల్లోనే బాల్యవివాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతీ గంటకు ఐదుగురు చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, ఈ విషయంలో పిల్లలు సైలెంట్‍గా ఉండకూడదన్నారు. ఒకరికొకరం కలిసుంటామంటూ చిన్నారులతో చేయిచేయి కలిపించి అభివాదం చేయించారు.   మేయర్‍ గుండు సుధారాణి, కుడా చైర్మన్‍ సుందర్‍రాజ్‍, హనుమకొండ, వరంగల్‍ కలెక్టర్లు రాజీవ్‍గాంధీ హనుమంతు, డాక్టర్‍ గోపి, సీపీ రంగనాథ్‍, మున్సిపల్‍ కమిషనర్‍ ప్రావీణ్య పాల్గొన్నారు.