Kajal Aggarwal: నేను బతికే ఉన్నా.. యాక్సిడెంట్ పుకార్లపై హీరోయిన్ కాజల్

Kajal Aggarwal: నేను బతికే ఉన్నా.. యాక్సిడెంట్ పుకార్లపై హీరోయిన్ కాజల్

హీరోయిన్ కాజల్ అగర్వాల్కు రోడ్డు ప్రమాదం జరిగిందనే న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తనకు యాక్సిడెంట్‌ అవ్వడంతో పరిస్థితి విషమంగా ఉందంటూ సోమవారం (సెప్టెంబర్ 8) సాయంత్రం నుంచి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇంకొందరైతే కాజల్ ఇక లేదని కూడా వైరల్ చేశారు. ఈ వార్తలు ఆమె అభిమానులలో పెద్దఎత్తున ఆందోళనను రేకెత్తించాయి. చాలామంది సోషల్‌ మీడియాలో కాజల్ తొందరగా కోలుకోవాలని మెసేజ్లు పెడుతూ తమ మద్దతును కూడా వ్యక్తం చేశారు.

లేటెస్ట్గా తనపై వస్తున్న రూమర్ వార్తలపై కాజల్ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా వేదికగా నోట్ రిలీజ్ చేసి అన్నిటికీ క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగా తాను ఆరోగ్యంగా ఉన్నానని, నిరాధారమైన ఊహాగానాలకు ఎవ్వరూ నమ్మొద్దని కాజల్ స్పష్టం చేసింది.

‘‘నేను ప్రమాదంలో ఉన్నానని (ఇక లేనని కూడా!) వస్తోన్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. నిజం చెప్పాలంటే అవి చూసి నేను నవ్వుకున్నాను. ఎందుకంటే ఇంతకుమించిన కామెడీ న్యూస్‌ ఉండదు. అవన్నీ పూర్తి అవాస్తవం. దేవుడి దయ వల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను.

ఇలాంటి తప్పుడు వార్తలు ఎవ్వరూ నమ్మొద్దు. ముఖ్యంగా కావాలని ప్రచారం కూడా చేయొద్దు. ఇది పాటిస్తారని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌లను షేర్‌ చేసే బదులు ఏదైనా నిజమైన వార్తలను నలుగురితో పంచుకోండి’’ అంటూ నోట్‌ ద్వారా కాజల్ చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం కాజల్ ఫ్యామిలీ లైఫ్ను లీడ్ చేస్తుంది. ఇటీవలే కన్నప్పలో పార్వతీదేవిగా నటించి మెప్పించింది. త్వరలో ఇండియన్ 3తో పాటు బాలీవుడ్ రామాయణ మూవీస్తో పలకరించనుంది. మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.