కాజల్ అగర్వాల్ నుంచి పూర్తి స్థాయి తెలుగు సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. గత ఏడాది ‘కన్నప్ప’లో అతిథి పాత్రలో కనిపించిన ఆమె, ఇటీవల హిందీలో విడుదలైన ‘సికిందర్’ చిత్రంలో కీలక పాత్ర పోషించినప్పటికీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇలాంటి సమయంలో కాజల్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘ది ఇండియా స్టోరీ’(The India Story). కాజల్ అగర్వాల్‌తో పాటు శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ కోర్ట్‌రూమ్ డ్రామాకు చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 24న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా తాజాగా విడుదలైన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయంలో వాడుతున్న రసాయనాలు, పెస్టిసైడ్ కంపెనీల అక్రమాలు, ఆహార కల్తీ వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ రూపొందించిన ఈ కాన్సెప్ట్ టీజర్ ఆలోచింపజేసేలా ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న అతిపెద్ద సంక్షోభాన్ని హైలైట్ చేస్తూ, వ్యవస్థలోని లోపాలు మరియు కఠిన నియంత్రణల అవసరాన్ని సినిమా ప్రస్తావించబోతున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది.
ముఖ్యంగా పిల్లలు తాగే పాలు, ఆహార పదార్థాలు, రసాయనాలతో పండించిన పండ్లు, చికెన్, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల్లో జరుగుతున్న కల్తీని చూపించిన విధానం ఆసక్తిని పెంచుతోంది. ఈ కల్తీ ఆహారం కారణంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే ప్రయత్నమే ‘ది ఇండియా స్టోరీ’ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. టీజర్‌లో ప్రస్తావించిన గణాంకాలు కూడా ఈ సమస్య తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనుండగా, సామాజిక అంశాన్ని బలమైన కోర్ట్‌రూమ్ డ్రామాతో మిళితం చేసిన కథ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి. సాగర్ బి షిండే నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ విడుదల చేస్తోంది.
