సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మినీ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఫేజ్ 3 పోటీలు హోరాహోరీగా సాగాయి. బుధవారం నిజామాబాద్, రంగారెడ్డి, నల్గొండ జట్లు విజయం సాధించాయి. మొదటి మ్యాచ్ నిజామాబాద్, ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ జట్టు 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆదిలాబాద్ జట్టులో సాయికృష్ణా రెడ్డి 44 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జట్టు 17.5 ఓవర్ల లో ఒక్క వికెట్ నష్టానికి 143 పరుగులు చేసి తొమ్మిది వికెట్లతో గెలిచింది. నిజామాబాద్ జట్టులో హర్షవర్థన్ 70, నాటౌట్, శ్రీకర్ రెడ్డి 62 పరులుగు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.
రెండో మ్యాచ్ కరీంనగర్, రంగారెడ్డి జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు 20 ఓవర్ల లో ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కరీంనగర్ జట్టులో తక్షిల్ 63 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి మూడు వికెట్లతో విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లా జట్టులో సాయి 42 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
మెదక్, నల్గొండ జిల్లా జట్ల మధ్య డే అండ్నైట్ మ్యాచ్లో జరిగింది. టాస్ గెలిచిన నల్గొండ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. శ్రీనాథ్ యాదవ్ 61, ప్రకాశ్61, సాయినాథ్ 47 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన మెదక్ జట్టు 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేయగా మెదక్ జట్టులో విక్రమ్ 39 పరుగులు చేశాడు.
నల్గొండ జట్టు 107 పరుగుల ఆధిక్యతతో గెలుపొందింది. సిద్దిపేటలో జరుగుతున్న పోటీలను కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగంరావు, హెచ్ సీఎ మెంబర్ భార్గవ్ దీక్షిత్ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా అసోసియేషన్ సెక్రటరీలు సురేశ్. ప్రదీప్, సిద్దిపేట సెక్రటరీ మల్లికార్జున్, సిద్దిపేట అసోసియేషన్ సభ్యులు విజయ్ బాబు, మాజీద్ పర్యవేక్షించారు.
