ఆపద్బాంధవుడు కాకా వెంకటస్వామి.. ఇవాళ (అక్టోబర్ 05) 96వ జయంతి

ఆపద్బాంధవుడు కాకా వెంకటస్వామి.. ఇవాళ (అక్టోబర్ 05) 96వ జయంతి

కాకా వెంకటస్వామి.. ఈ పేరు ఇప్పటికీ, ఎప్పటికీ చరిత్ర పుటల్లో గుర్తుండిపోతుంది. దేశం మెచ్చిన బడుగు, బలహీన వర్గాల నేత ‘కాకా’. అణగారిన వర్గాల కోసం అండగా నిలిచిన గొప్ప మహానీయులు. సేవాగుణంలో కులం, మతం, పార్టీ చూడకుండా.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందు వరుసలో నిలిచేవారు. అందుకే.. ఆయన నిరుపేదల గుండెల్లో గుడిసెల వెంకటస్వామిగా నిలిచారు. నిరుపేదల మనసులో  ‘కాకా’ ఇప్పటికీ సజీవంగా ఉన్నారంటే ఆయన చేసిన సేవలే కారణం. చివరి శ్వాస వరకు ప్రజాసేవే పరమావధిగా బతికారు. ఇప్పటితరం రాజకీయ నాయకులకు గొప్ప స్ఫూర్తిప్రదాత కాక. నిత్యం పేదల కోసం, వారి హక్కుల కోసం అలుపెరగకుండా శ్రమించిన మహానేత. 

పదవులకే వన్నె తెచ్చారు..

నాయకుడిగానే కాదు.. చేపట్టిన పదవులకూ కాకా వన్నె తెచ్చారు. కేంద్ర మంత్రిగా, పార్లమెంట్​లో కాంగ్రెస్ పార్టీ ఉపనేతగా తనదైన ప్రత్యేకత చూపారు. బొగ్గు గని కార్మికులకు ఐటీ మాఫీ చేయాలని కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంటులో ప్రభుత్వాన్ని కోరిన మొదటి ఎంపీ కూడా కాకానే. 1929 అక్టోబర్ 5న జన్మించిన కాకా.. దళిత నేతగా, దేశం గర్వించే గొప్ప నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగారు.  ఇప్పటికీ సింగరేణి కార్మికుల ఇండ్లలోనే కాదు.. నిరుపేదల ఇండ్లలోనూ ‘కాకా’ ఫొటో ఉంటుంది. 

నిరుపేదలకు నీడ కల్పించారు

బడుగుల కోసం జీవితాంతం శ్రమించారు కాకా. హైదరాబాద్​లో వేలాది మంది నిరుపేదల తరఫున భూ పోరాటం చేశారు. వారికి ఇంటి స్థలాలు వచ్చేలా కృషి చేసిన గొప్ప నాయకుడు. అందుకే.. ఆయన్ను గుడిసెల వెంకటస్వామిగా పిలుచుకుంటారు. సిటీలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలు నివసించడానికి నిజాం వారసులతో, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. పేదలకు బాసటగా నిలిచి నీడ కల్పించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదల కోసం 1949లో మొదటిసారి జాతీయ గుడిసెల సంఘం స్థాపించి హైదరాబాద్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ భూ పోరాటంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా, నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలూ కృషి చేశారు. 

కార్మికుల పక్షపాతి

కార్మికులంటే కాకాకు ఎంతో ఇష్టం. ఇష్టం అనడం కంటే ప్రాణం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే కార్మికుల కోసం ఆయన చేసిన సేవలు, పోరాటాలే అందుకు గొప్ప నిదర్శనం. సింగరేణి కార్మికులకు ఐటీ మాఫీ చేయాలని కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంట్ లో తమ ప్రభుత్వాన్ని కోరిన మొదటి నేతగా 'కాకా' ప్రత్యేక గుర్తింపు పొందారు. మన దేశంలో ఈ రోజుల్లో ‘కాకా’ వంటి రాజకీయ నేతలు చాలా అరుదు.  1990లో  కష్టాల్లో ఉన్న సింగరేణి గురించి ఎన్​టీపీసీ యాజమాన్యంతో మాట్లాడారు. 

ఎన్​టీపీసీ నుంచి రూ.400 కోట్ల రుణం అందేలా చేయడంతో సింగరేణి మళ్లీ నిలదొక్కుకోగలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే సింగరేణి కార్మికులతో పేగు బంధం కాకాది. ఇదంతా కాకా ప్రత్యేక చొరవతోనే సాధ్యమైంది. చదువంటే కాకాకు చాలా ఇష్టం. అందుకే విద్యపై ఉన్న మక్కువతో విద్యాసంస్థలను ప్రారంభించారు. ఆయన స్థాపించిన విద్యా సంస్థల్లో చదువుకున్న వేలాది మంది ప్రస్తుతం వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా తన కోసం వచ్చిన ప్రతి ఒక్కర్నీ కలిసి, వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు కాకా. తన వద్దకు వచ్చే వారి పేర్లు గుర్తుపెట్టుకుని మరీ అప్యాయంగా పలకరించేవారు.  

తెలంగాణ ఉద్యమంలో ‘కీ’ రోల్

తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 'కాకా' కీలకపాత్ర పోషించారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కాకా చిన్న కుమారుడు మంత్రి వివేక్ కూడా తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించారు. కాంగ్రెస్ ఎంపీగా పార్లమెంట్​లో నాలుగు కోట్ల ప్రజల గొంతుకగా నిలిచి.. ప్రజల వాణి వినిపించారు. ఉద్యమానికి అండదండలు అందించారు. కాకా బాటలోనే ఆయన కుటుంబ సభ్యులు సాగుతున్నారు. ప్రస్తుతం రేవంత్​రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాకా జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. 

కాకా బాటలోనే కుటుంబమంతా..

కాకా చూపిన బాటలోనే ఆయన కుటుంబ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెంకటస్వామి పెద్ద కుమారుడు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా, చిన్న కుమారుడు వివేక్ వెంకటస్వామి చెన్నూరు. 


- ఉపేందర్ పెండెం,
సీనియర్ జర్నలిస్టు