రాజకీయాల్లో కాకాది కీలకపాత్ర: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాజకీయాల్లో కాకాది కీలకపాత్ర: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  • తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కాకా వెంకటస్వామి కల
  • ఆయన కలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వెల్లడి
  • కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాల్లో లక్షల కోట్ల అవినీతి : వివేక్ వెంకటస్వామి

వెల్గటూర్, వెలుగు:  దివంగత నేత కాకా వెంకటస్వామి బాటలోనే ఆయన కొడుకు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నడుస్తూ.. మంచి పేరు తెచ్చుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడే ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆయన కల అని పేర్కొన్నారు. సాగు నీటి అవసరమే తెలంగాణ ఉద్యమానికి తొలిమెట్టు అని ఆయన అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్​లో నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి జీవన్​రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం రీ డిజైన్ పేరుతో బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. కాకా వెంకటస్వామి కలలుగన్న తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం కొండాపూర్ నుంచే ప్రారంభమైందని, ప్రజాజీవితంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా, శాసనమండలి సభ్యుడిగా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. 20 ఏండ్లుగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేసి, చివరికి ఎమ్మెల్యేగా గెలుపొందారని కొనియాడారు. ఇక నుంచి ప్రజాసేవలో ముందుండాలని ఆయనకు సూచించారు.

ఎండపల్లి ఎంపీటీసీ కుటుంబానికి పరామర్శ

ఎండపల్లి ఎంపీటీసీ ఎండీ బషీర్ తల్లి  కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే  లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జీవన్ రెడ్డిని కలిసిన ప్రతిసారీ ఓ మంచి విషయం నేర్చుకున్నా..

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసిన ప్రతి సారీ ఒక మంచి విషయం నేర్చుకున్నానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. 2009లో తాను ఎంపీగా గెలుపొందడంలో జీవన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాల్లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని వివేక్​ఆరోపించారు. ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిరంతరం ప్రజల మధ్య ఉన్నారని, అందుకే విజయం సాధించారన్నారు. తెలంగాణలో ప్రజాపాలన మొదలైందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ముందుండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు. చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ధర్మపురిలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. 2009లో తాను ఎంపీగా ఉన్నపుడు రాయపట్నం నుంచి లక్షెట్టిపేట బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశానని వివేక్​ గుర్తుచేశారు.

ధర్మపురి అభివృద్ధి కోసం కృషి చేస్తా:  లక్ష్మణ్​ కుమార్

తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం.. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషిచేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండీ బషీర్, జాడీ రాజేశం, కాడే సూర్య నారాయణ, సంగన భట్ల దినేష్, శైలేందర్ రెడ్డి, మెరుగు మురళి, ఎంపీటీసీ జాడి సుజాత, కొండాపూర్​ సర్పంచ్ తాడిపత్రి రాజవ్వతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.