విద్యార్థుల ఉద్యమంతో .. రగులుతున్న కేయూ

విద్యార్థుల ఉద్యమంతో .. రగులుతున్న కేయూ
  • పీహెచ్​డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ మొదలైన ఆందోళన
  • పోలీసులు తమ కాళ్లు, చేతులు విరగ్గొట్టారని స్టూడెంట్స్​ నిరసన  
  • సెలవులు, హాస్టళ్ల బంద్​తో దీక్షలు మొదలెట్టిన విద్యార్థులు 
  • అన్ని వర్గాల నుంచి పెరుగుతున్న మద్దతు 

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ రగిలిపోతోంది. పీహెచ్​డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు, సంఘాలు నిరసన చేపట్టగా పోలీసులు అరెస్ట్ చేయడం, తమ కాళ్లు, చేతులు విరిగేలా కొట్టారంటూ స్టూడెంట్లు ఆరోపణలు చేయడం, ఎంజీఎంలో అర్ధరాత్రి హైడ్రామా, పోలీసుల వివరణ, హాస్టళ్ల మూసివేత..ఇలా కేయూలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో వర్సిటీ అట్టుడుకుతోంది. పీహెచ్​డీ అక్రమాలపై విచారణ జరపడంతో పాటు పోలీసుల దాడిని ఖండిస్తూ విద్యార్థులు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. 

అయినా సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో కేయూ స్టూడెంట్​ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్​కు పిలుపునిచ్చారు. తమ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని వర్సిటీ ఆఫీసర్లు క్యాంపస్ కాలేజీలు, హాస్టళ్లకు సెలవులిచ్చి, తాళాలేశారని మండిపడుతున్నారు. పరీక్షలు కూడా వాయిదా వేయడంతో ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిప్పు రాజేసిన పీహెచ్​డీ నోటిఫికేషన్​

దాదాపు ఆరేండ్ల తర్వాత కేయూలో పీహెచ్​​డీ అడ్మిషన్లకు నోటిషికేషన్ రిలీజ్​ చేయగా..పైరవీలు, కాసులకు కక్కుర్తి పడి ఆఫీసర్లు వాటిని అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ నెల మొదటి వారం నుంచి స్టూడెంట్లు ఆందోళనకు దిగారు.  అక్రమాల వల్ల అర్హత కలిగిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ ప్రిన్సిపాల్​ఆఫీసులో నిరసన చేపట్టగా పోలీసులు అరెస్టు చేశారు. తమను టాస్క్​ ఫోర్స్​ ఆఫీస్​కు తీసుకెళ్లి కొట్టడంతో కాళ్లు, చేతులు విరిగాయని ఆరోపించారు.అప్పటినుంచి క్యాంపస్​ అగ్నిగుండంగా మారగా.. విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షకు వివిధ పార్టీల మద్దతు తెలుపుతుండడం, వారి రోజూవారీ ఆందోళనలతో క్యాంపస్​ హోరెత్తుతోంది.

ఉద్యమాన్ని చీల్చేందుకు సెలవులు

పీహెచ్​డీ అడ్మిషన్ల అవకతవకలపై తాము చేస్తున్న ఉద్యమాన్ని చల్లార్చేందుకు వర్సిటీ అధికారులు ఏ కారణం చూపకుండానే ఈ నెల 3 నుంచి 10 వరకు క్యాంపస్​ కు సెలవులు ప్రకటించారని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. అప్పటికీ తాము శాంతించకపోవడంతో 18వ తేదీ వరకు సెలవులు పొడిగించారంటున్నారు. హాస్టళ్లు క్లోజ్​ చేసి తాళాలు వేయడంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. సెలవులు ప్రకటించిన ఆఫీసర్లు వర్సిటీ పరిధిలో జరగాల్సిన బీపీఎడ్​, ఎంపీఎడ్​, ఎల్​ఎల్​బీ(3 వైడీసీ, 5వైడీసీ) ఫైనల్​ సెమిస్టర్ల పరీక్షలు కూడా వాయిదా వేశారు. బీపీఎడ్ ​గ్రూపులకు సెప్టెంబర్​ 6 నుంచి 13వరకు, ఎల్​ఎల్​బీ పరీక్షలు 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరగాల్సి ఉంది. 

కానీ, 18వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన ఆఫీసర్లు మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ పరీక్షలు అయ్యాక ఏం చదవాలో ప్లాన్​తో ఉన్న విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. దీంతో సోమవారం మధ్యాహ్నం వీసీ బిల్డింగ్​ ఎదుట ఆందోళన చేపట్టారు.

వీసీ పాలనపై చార్జ్ షీట్

వర్సిటీ వీసీగా తాటికొండ రమేశ్​ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అక్రమాలు పెరిగిపోయాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆయనకు వీసీగా కొనసాగే అర్హతే లేదని, వీసీ వచ్చినప్పటి నుంచి కేయూలో జరిగిన పరిమాణాలు, వీసీగా పాలనపై సోమవారం కేయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చార్జ్​ షీట్​ రిలీజ్​ చేశారు. పీహెచ్​డీ కేటగిరీ 1, 2 అక్రమాలు, కేయూ భూముల కబ్జాలు, వర్సిటీలో అక్రమ నియామకాలు, వీసీపై ఉన్న కేసులు, అక్రమ బదిలీలు తదితర అంశాలను అందులో పొందుపరిచారు. రెండున్నరేండ్లలో వీసీ చేసిన అవినీతి, అక్రమాలపై కమిటీ వేసి విచారించాలని స్టూడెంట్స్ డిమాండ్​ చేస్తున్నారు.

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ 

పీహెచ్​డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తూ కేయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్​కు పిలుపునిచ్చారు. ఇప్పటికే మొదలుపెట్టిన దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరగా.. బీజేపీ, కాంగ్రెస్​, ఇతర పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి, మాజీ మంత్రి గుండె విజయరామరావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి  ప్రదీప్​ రావు, కుసుమ జగదీశ్​ గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి ములుగు ఎమ్మెల్యే సీతక్క, పార్టీ రాష్ట్ర నాయకురాలు కూచన రవళి విద్యార్థులకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు.

పరీక్షలు పెట్టకపోతే   పెట్రోల్​ పోసుకుని చచ్చిపోతా

పరీక్షల విషయంలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో లా కాలేజీకి చెందిన ఫైనల్​ ఇయర్​ స్టూడెంట్ భగత్​​ ఆవేదనకు గురయ్యాడు. ఆయనకు ఇటీవల కర్నాటక సెంట్రల్​ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం సీటు రాగా..అడ్మిషన్​ ఫీజు కట్టాడు. కేయూలో టెన్త్​ సెమిస్టర్​ ఎగ్జామ్స్ కంప్లీట్​ కాకపోవడంతో అక్కడి ఆఫీసర్ల నుంచి పర్మిషన్​ తీసుకున్నాడు. కానీ, పరీక్షలు రెండు సార్లు వాయిదా వేయడం, ఎగ్జామ్స్​ ఎప్పుడు కండక్ట్ చేస్తారో క్లారిటీ ఇవ్వకపోవడంతో సెంట్రల్​ యూనివర్సిటీ సీటు  రద్దవుతుందేమోనని భయపడ్డాడు. 

మరోసారి గడువు కోరేందుకు సోమవారం కర్నాటక సెంట్రల్​ యూనివర్సిటీ వెళ్లిన భగత్​..అక్కడి నుంచి సెల్ఫీ వీడియో తీసి సోషల్​మీడియాలో పెట్టాడు. వీసీ రమేశ్, రిజిస్ట్రార్​ శ్రీనివాసరావు నిర్లక్ష్యంతో సీటు కోల్పోయేలా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. పరీక్షల షెడ్యూల్​ ప్రకటించాలని, లేదంటే మంగళవారం ఎగ్జామినేషన్ ​బ్రాంచ్​ ఎదుట పెట్రోల్​ పోసుకుని నిప్పటించుకుంటానని హెచ్చరించాడు. విషయం తెలుసుకున్న వీసీ రమేశ్​ సాయంత్రం భగత్​కు ఫోన్​ చేశారు. వెంటనే షెడ్యూల్​ప్రకటిస్తామని చెప్పి, ఈ నెల 14 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ​రిలీజ్​ చేశారు. కానీ బీపీఎడ్​ పరీక్షలపై క్లారిటీ ఇవ్వలేదు.