ప్రొఫెసర్లు లేరు.. హాస్టళ్లు సరిపోతలేవు..విద్యా కమిషన్‌‌ ఎదుట కేయూ విద్యార్థుల ఆవేదన

 ప్రొఫెసర్లు లేరు.. హాస్టళ్లు సరిపోతలేవు..విద్యా కమిషన్‌‌ ఎదుట కేయూ విద్యార్థుల ఆవేదన
  • వెట్టిచాకిరీ తప్ప కన్వర్షన్‌‌ చేయడం లేదన్న పార్ట్ టైం టీచర్లు
  • తమను రెగ్యులరైజ్ చేయాలని విన్నవించిన కాంట్రాక్ట్‌‌ లెక్చరర్లు
  • కాకతీయ యూనివర్సిటీలో విద్యా కమిషన్‌‌ పబ్లిక్ హియరింగ్

హనుమకొండ/హసన్‌‌పర్తి, వెలుగు : ‘యూనివర్సిటీలో రెగ్యులర్‌‌ ప్రొఫెసర్లు లేరు.. డిపార్ట్‌‌మెంట్లకు సొంత భవనాలు లేవు.. హాస్టళ్లు సరిపోతలేవు.. బుక్స్‌‌ అందుబాటులో లేవు.. గత ప్రభుత్వం పెంచిన ఫీజులతో పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు’ అని కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్‌‌ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై స్టడీ చేసేందుకు విద్యా కమిషన్‌‌ చైర్మన్‌‌ ఆకునూరి మురళి, సభ్యులు పీఎల్‌‌ విశ్వేశ్వరరావు, చెరగొండ వెంకటేశ్‌‌ గురువారం కేయూలో పర్యటించారు.

 వీసీ కర్నాటి ప్రతాప్‌‌రెడ్డి, రిజిస్ట్రార్‌‌ వి.రామచంద్రం ఆధ్వర్యంలో సెనెట్‌‌ హాల్‌‌లో పబ్లిక్‌‌ హియరింగ్‌‌ నిర్వహించి.. స్టూడెంట్లు, టీచింగ్, నాన్‌‌టీచింగ్, ఔట్ సోర్సింగ్, పార్ట్​ టైం ఉద్యోగులు, ప్రొఫెసర్లు, ప్రైవేట్‌‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌‌తో పాటు అన్ని వర్గాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా కేయూ స్టూడెంట్స్‌‌ మాట్లాడుతూ టీచింగ్‌‌ స్టాఫ్‌‌ లేకపోవడంతో విద్యావ్యవస్థ కుంటుపడుతోందన్నారు. 

లా కాలేజీలో 400 మంది స్టూడెంట్లకు నాలుగు టాయిలెట్స్‌‌ మాత్రమే ఉన్నాయని, బిల్డింగ్‌‌ కూడా శిథిలావస్థకు చేరుకుందని చెప్పారు. లైబ్రరీలో అప్‌‌డేటెడ్‌‌ బుక్‌‌ ఒక్కటి కూడా లేదని కమిషన్‌‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇంజినీరింగ్, జర్నలిజం, సైకాలజీ డిపార్ట్‌‌మెంట్ల స్టూడెంట్లపై భారం మోపుతున్నారని, ఆయా కోర్సుల ఫీజులను తగ్గించాలని కోరారు. కేయూలో రీసెర్చ్‌‌ సెంటర్లు, భవన నిర్మాణాలకు భూములు అవసరం ఉంటుందని, ఇంటిగ్రేటెడ్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూల్‌‌ను మరోచోట ఏర్పాటు చేయాలని కోరారు. 

వెట్టి చాకిరీ చేయిస్తున్నరు : పార్ట్‌‌టైం లెక్చరర్లు

రెగ్యులర్‌‌ స్టాఫ్‌‌తో సమానంగా పనిచేస్తున్నా తమను కన్వర్షన్‌‌ చేయడం లేదని పార్ట్‌‌ టైం లెక్చరర్‌‌ తిరునహరి శేషుతో పాటు మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. 16 పీరియడ్ల వర్క్‌‌లోడ్‌‌ ఉన్న తమను వీసీ స్థాయిలోనే కన్వర్షన్‌‌ చాన్స్‌‌ ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్‌‌ చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్స్‌‌ శ్రీధర్‌‌, ఫిరోజ్‌‌ఖాన్‌‌ కోరారు.

సమగ్రమైన ఎడ్యుకేషన్‌‌ పాలసీ తీసుకొస్తాం : ఆకునూరి మురళి

రాష్ట్రంలో సమగ్రమైన ఎడ్యుకేషన్‌‌ పాలసీ తీసుకొచ్చేందుకే సమస్యలపై స్టడీ చేస్తున్నామని విద్యా కమిషన్‌‌ చైర్మన్‌‌ ఆకునూరి మురళి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పర్యటిస్తున్నామని, కేయూ స్టూడెంట్లు, ఉద్యోగులు, టీచింగ్‌‌, నాన్‌‌ టీచింగ్‌‌ స్టాఫ్‌‌ చెప్పిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.