కేయూ భూముల  లెక్క తేలేనా? 

కేయూ భూముల  లెక్క తేలేనా? 

వారంపాటు డిజిటల్ ​సర్వే 
క్యాంపస్‍ మూడు వైపులా ఆక్రమణలు
కబ్జాదారుల్లో లీడర్లు, ప్రభుత్వ ఆఫీసర్లు
రికార్డుల ట్యాంపరింగ్‍ సహా అనేక ఆరోపణలు

వరంగల్‍, వెలుగు: హనుమకొండ జిల్లా ఉన్నతాధికారులు కాకతీయ యూనివర్సిటీ భూముల లెక్క తేల్చే పనిలో పడ్డారు. వందల ఎకరాల కేయూ క్యాంపస్‍ ల్యాండ్​ఇప్పటికే ఆక్రమణలకు గురైంది. అధికారుల కళ్లముందే నిత్యం కొత్త బిల్డింగులు కడుతున్నారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని 15 ఏండ్లుగా స్టూడెంట్‍, ఉద్యోగ సంఘాలు నెత్తినోరు బాదుకుంటున్నాయి. ఏడాదికి రెండు మూడు సార్లు వీసీ, రిజిస్ట్రార్‍ భూముల కబ్జాపై పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా కబ్జాలపర్వం పెరుగుతోంది తప్పితే ఆగలేదు. సడన్‍గా జిల్లా ఉన్నతాధికారులు కేయూ మొత్తం భూములు తేల్చేందుకు డిజిటల్ సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వారం పదిరోజుల్లో హద్దులు సైతం నిర్ణయించేలా మంగళవారం నుంచి డిజిటల్‍ సర్వే మొదలుపెట్టారు. పొలిటికల్‍, మనీ, పవర్‍తో ఏండ్ల తరబడిగా నానుతున్న ఈ సమస్యను పరిష్కరించడంలో ఆఫీసర్లు ఎంతవరకు సక్సెస్‍ అవుతారో తెలియాల్సి ఉంది.
1,018 ఎకరాల భూములు 

వరంగల్‍ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ కోసం1968లో 1,018 ఎకరాలు సేకరించారు. కేయూ ఎస్డీఎల్సీఈ సెంటర్‍ కరీంనగర్‍ రోడ్డు నుంచి పెద్దమ్మగడ్డ రోడ్‍లో డబ్బాలు.. వెనక భాగంలో పలివేల్పుల మీదుగా గుండ్లసింగారం వరకు ఇవి ఉన్నాయి. 1980లో ఎస్సారెస్పీ కెనాల్‍ కోసం 413 సర్వే నంబర్‍లో మూడు గుంటల భూమిని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. దానికి సర్కారు పరిహారం సైతం ఇచ్చింది. ఇది తప్పించి మిగతా మొత్తం కేయూ పరిధిలో ఉంది. వరంగల్‍ సిటీలో భూముల రేట్లకు రెక్కలు రావడంతో కబ్జాదారుల కన్ను కేయూ భూములపై పడింది. పలివేల్పులతో పాటు ఎస్సారెస్పీ కెనాల్‍ వైపు ఉన్న 412, 413 సర్వే నంబర్లలో పెద్దఎత్తున ఆక్రమణలు జరిగాయి. ఇందులో పార్టీ లీడర్లతోపాటు గవర్నమెంట్‍ ఆఫీసర్లు, సిబ్బంది సైతం ఉన్నారు. భూములు ఆక్రమించారని గతంలో కొందరి మీద రౌడీషీట్‍ సైతం ఓపెన్‍ చేశారు. పలివేల్పుల, కాకతీయ కెనాల్‍ వైపు ఏకంగా 40 నుంచి 50 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు గతంలో అధికారులు గుర్తించారు. హద్దులు నిర్ణయించారు. కేయూ ల్యాండ్స్ పేరుతో బోర్డులు పెట్టారు. అయినా కబ్జాదారులు ఆగట్లేదు.
ఫిర్యాదులు పట్టించుకోలే
అక్రమార్కులు రెవెన్యూ అధికారులతో కలిసి రికార్డుల ట్యాంపరింగ్‍ చేశారు. కేయూ భూములను వారి పేరుతో రిజిస్ట్రేషన్‍ చేసుకున్నారు. ఈసీలు చేసి ప్లాట్ల బిజినెస్‍ చేసే ప్రయత్నం చేశారు. అయినా కేయూ అధికారులు లైట్‍ తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న స్టూడెంట్‍ యూనియన్లు, ప్రజా సంఘాలు 2008లోనే భగ్గుమన్నాయి. సర్వే నంబర్‍ 412లో 36 గుంటల భూమి ఆక్రమణకు గురైన విషయం తెలుసుకుని రోడ్డెక్కాయి. కేయూ అధికారుల తీరును తప్పుపట్టాయి. దీంతో యూనివర్సిటీ పెద్దలు స్పందించి క్యాంపస్‍ స్థలాన్ని తిరిగి స్వాధీన పరుచుకుని హద్దులు, బోర్డులు పెట్టారు. 2013లో కేయూ ఆస్తుల పరిరక్షణకు చుట్టూరా గోడలు కట్టేందుకు రూ.9 లక్షలు కేటాయించారు. అధికారుల అలసత్వం కారణంగా ఆ పనులు పూర్తి చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కేయూ భూముల వ్యవహారంపై ధర్నాలు, నిరసనలు చేసిన స్టూడెంట్‍ యూనియన్‍ బాధ్యులు ఆరేడేండ్లుగా అధికార పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నారు. నాడు గొంతు విప్పిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా మాట్లాడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
డిజిటల్‍ సర్వేపైనే అందరి దృష్టి
కొన్ని రోజుల క్రితం కేయూ వీసీగా ప్రొఫెసర్‍ తాటికొండ రమేశ్‍ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎప్పటి మాదిరిగానే  కాకతీయ భూముల వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. వీసీ హనుమకొండ కలెక్టర్‍ రాజీవ్‍గాంధీ హనుమంతుతో సమావేశమయ్యారు. ఆయన ఆదేశానుసారం డిజిటల్‍ భూసర్వేకు శ్రీకారం చుట్టారు. మంగళవారం కేయూ రిజిస్ట్రార్‍ ప్రొఫెసర్‍ బి.వెంకట్రామిరెడ్డి దానిని ప్రారంభించారు. భూ అక్రమార్కుల జాబితాలో ఎక్కువగా అధికార పార్టీ లీడర్లు, గవర్నమెంట్‍ ఆఫీసర్లు ఉన్నారని ఎప్పటినుంచో అంటున్నారు. ఈ క్రమంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్‍ సర్వేను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆక్రమణలు, హద్దులు ఎలా గుర్తిస్తారు.. భూములను ఎలా కాపాడాతారు..? కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.