వీసీ వర్సెస్..యూనివర్సిటీ!

వీసీ వర్సెస్..యూనివర్సిటీ!

హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీలో వీసీ తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. అధ్యాపకుల ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లలో పక్షపాతం చూపారంటూ టీచింగ్​స్టాఫ్​లో అసహనం వ్యక్తమవుతుండగా.. వర్సిటీ సమస్యలు, ఫీజులు, పీహెచ్​డీ అక్రమాలపై ప్రశ్నించిన స్టూడెంట్లను కేసులు పెట్టించి వేధిస్తున్నాడంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఆ వివాదాలు సమసిపోకముందే ఇప్పుడు నాన్​టీచింగ్ స్టాఫ్​లోనూ అసంతృప్తి మొదలైంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రాలు అందిస్తే.. నోటీసుల పేరున టార్చర్​ చేస్తున్నాడంటూ బోధనేతర సిబ్బంది ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26వ తేదీ  నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు.  

బదిలీలు..ప్రమోషన్లపై వివాదం 

వీసీ రమేశ్​వర్సిటీ పరిధిలో తనకు పడని టీచింగ్​స్టాఫ్​ను దూరప్రాంతాలకు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. ప్రమోషన్లలోనూ పక్షపాతానికి పాల్పడ్డారనే ప్రచారమూ ఉంది. ఎవరైనా ఎదురు చెబితే బదిలీలు, షోకాజ్​నోటీసుల పేరుతో భయపెడుతారనే అపవాదు ఉంది. సొంత డిపార్ట్​మెంట్​కు చెందిన ఓ ప్రొఫెసర్ కు ప్రమోషన్​నిలిపివేసి డిమోషన్ ఇవ్వడంతో పాటు వర్సిటీ పరిధిలోని ఓ ఇంజినీరింగ్​కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లను పక్కన పెట్టి, జూనియర్లకు క్యాంపస్​లో పోస్టింగ్​ఇవ్వడంకూడా వివాదాస్పదమైంది. 

ఈ నేపథ్యంలోనే పదోన్నతుల్లో పారదర్శకత లోపించిందని, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రమోషన్లు చేపట్టారంటూ కొంతమంది యూజీసీకి కూడా ఫిర్యాదు చేశారు. యూజీసీ రూల్స్​కు విరుద్ధంగా16 మంది అనుబంధ అధ్యాపకులను నియమించారని పలువురు టీచర్లు ఆరోపిస్తున్నారు.

Also Raed : కూతురి వరుసయ్యే బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నడని హత్య

ఈ ఏడాది జూలై 7న వర్సిటీ బాటనీ డిపార్ట్​మెంట్​లో రెగ్యులర్​ఫ్యాకల్టీని వదిలి కాంట్రాక్టు అధ్యాపకులకు హెచ్​వోడీగా బాధ్యతలివ్వగా.. దానిపై రెగ్యులర్ ​ఫ్యాకల్టీ ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది.

పీహెచ్​డీ సీట్ల వ్యవహారంలో...

కొద్ది రోజుల కింద చేపట్టిన పీహెచ్​డీ అడ్మిషన్లలో కుంభకోణం జరిగిందని, సీట్లు అమ్ముకున్నారంటూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఆ సందర్భంగా 10 మంది స్టూడెంట్లపై కేసులు పెట్టారు. ఇద్దరిని జైలుకు పంపించారు. ఇదివరకు కూడా నాలుగైదు సార్లు కేయూ పీఎస్​లో కేసులు నమోదు చేశారు. సమస్యలపై కొట్లాడితే కేసులు పెట్టడమేంటని విద్యార్థులు మండిపడుతున్నారు. వెంటనే వీసీతో పాటు రిజిస్ట్రార్​ను బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. వీసీ, రిజిస్ట్రార్​ ఫొటోలతో 15 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

నాన్​టీచింగ్​స్టాఫ్​కు నోటీసులు

వీసీపై నాన్​ టీచింగ్​స్టాఫ్​ కూడా మండిపడుతున్నారు. వివిధ క్యాడర్ల ప్రమోషన్లు, పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలు, పరీక్షలు, అడ్మినిస్ట్రేషన్​ ఆఫీస్​లో అదనపు పనితో గొడ్డు చాకిరీ చేయించడం, పీఆర్సీ తదితర డిమాండ్లతో గతేడాది వీసీకి వినతిపత్రాలు ఇచ్చారు. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా.. ఇంతవరకు చేసిందేమీ లేదు. 

ఈ క్రమంలోనే కొంతమంది రిజిస్ట్రార్​కు వినతిపత్రం ఇవ్వగా..వారందరికీ నోటీసులివ్వడం విమర్శలకు తావిచ్చింది. దీంతోపాటు ఈ నెల 16న నాన్​ టీచింగ్ స్టాఫ్​తో మీటింగ్​నిర్వహించగా..అక్కడి సిబ్బంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా మీటింగ్​ నుంచి వెళ్లిపోవడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు కేయూ ఉద్యోగ సంఘాల నాయకులు లకావత్ యాదగిరి, అబ్దుల్ షుకూర్ ప్రకటించార. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు పోరాడతామన్నారు.

ఆది నుంచి అంతే...

2021​లో కేయూ వీసీగా ప్రొఫెసర్​రమేశ్​నియామకమైనప్పటి నుంచి ఆయనను వివాదాలు వెంటాడుతున్నాయి. ప్రొఫెసర్​గా పదేండ్ల అనుభవం లేకున్నా వీసీగా నియమించారంటూ ఇప్పటికే హైకోర్టుతో పాటు లోకాయుక్తలో కేసులు వేశారు. 

అవి ఇంకా నడుస్తున్నాయి. బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే వర్సిటీ ఫీజులు విపరీతంగా పెంచడంతో ఆందోళనలు జరిగాయి. వర్సిటీలో చదువుతున్న సెల్ఫ్​ఫైనాన్స్​కోర్సులకు హాస్టల్​వసతి లేదని, ఆ స్టూడెంట్లందరినీ ఖాళీ చేయించేందుకు సర్క్యూలర్​ జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. వర్సిటీ భూములను ఆక్రమించుకున్నవారికి వీసీ అండదండలున్నాయని, అందుకే ల్యాండ్​కమిటీ రిపోర్ట్​ కు ఇంతవరకు మోక్షం కలగడం లేదనే విమర్శలున్నాయి. వర్సిటీ వీసీ హోదాలో ఉండి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం వారిపై ఆర్టికల్స్​రాయడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో పాటు ఇక్కడి వారిని కాదని ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని రిజిస్ట్రార్​గా తీసుకురావడం, రూల్స్​కు విరుద్ధంగా రిటైర్డ్​ ప్రొఫెసర్​ను నియమించడంపై వర్సిటీలో లొల్లి నడుస్తోంది.  

'పారదర్శకంగానే పీహెచ్​డీ అడ్మిషన్ల ప్రక్రియ

హనుమకొండ, వెలుగు : కేయూలో పీహెచ్​డీ క్యాటగిరీ-–2 అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని, విద్యార్థి సంఘాల  నాయకుల్లో కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేయూ ఫ్యాకల్టీ డీన్స్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్ట్స్​, ఫార్మసీ, సైన్స్, కామర్స్​అండ్ బిజినెస్​ మేనేజ్​మెంట్, లా, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, సోషల్ సైన్స్​ డీన్స్​ప్రొఫెసర్లు బన్న అయిలయ్య, వై.నరసింహారెడ్డి, పి.మల్లారెడ్డి, పి.అమరవేణి, విజయలక్ష్మి, టి.శ్రీనివాసులు, ఎస్​.రామనాథ కిషన్​, టి.మనోహర్​మంగళవారం సాయంత్రం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 

కేయూ పీహెచ్​డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ఆందోళనలు చేస్తున్నవారిలో కొంతమందికి తక్కువ మార్కులు వచ్చాయని, కనీసం రూల్​ ఆఫ్​ రిజర్వేషన్​లో కూడా ఆ స్టూడెంట్స్​ ఫిట్​ కాలేదన్నారు. పీహెచ్​డీ సీటు రాకపోవడంతో ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి సీటు సంపాదించాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల ముందు గుర్తింపు తెచ్చుకోవాలని ఇదంతా చేస్తున్నారని, కొంతమంది వారికి సపోర్ట్​ చేస్తున్నారని, అందులో వివిధ పార్టీల లీడర్లు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు, రిటైర్డ్ ​ప్రొఫెసర్లు, పార్ట్​ టైం, కాంట్రాక్టు అధ్యాపకులు, నాన్​ టీచింగ్ ​స్టాఫ్​, కేయూఈసీ మెంబర్స్ ఉండడం దురదృష్టకరమన్నారు.  

వీసీ, రిజిస్ట్రార్.. ఫొటోలకు పిండ ప్రదానం 

హసన్ పర్తి :  పీహెచ్​డీ కేటగిరీ –-2 అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయని, న్యాయ విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల జేఏసీ చేస్తు న్న దీక్షలు కొనసాగుతున్నాయి.  14వ రోజు దీక్షలను పార్ట్ టైం లెక్చరర్ అసోసియేషన్ నాయకులు సోల్తీ కిరణ్ ప్రారంభించారు. మంగళవారం స్టూడెంట్స్​..వీసీ రమేశ్, రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఫొటోలకు పిండ ప్రదానం చేశారు. 

తర్వాత సహపంక్తి భోజనాలు చేశారు. కేయూ జాక్ చైర్మన్ ఇట్టబోయిన తిరుపతి యాదవ్, జాక్ నేతలు గుగులోతు రాజు నాయక్, మేడ రంజిత్ కుమార్, బొట్ల మనోహర్, మాచర్ల రాంబాబు, అంబాల కిరణ్, అరేగంటి నాగరాజు, మట్టెడ కుమార్, మొగిలి వెంకట్ రెడ్డి, విజయ్ ఖన్నా, ఎండీ పాషా, నిమ్మల రాజేశ్, బానోతు లకుపతి, గట్టు ప్రశాంత్ గౌడ్, కాయిత నాగరాజు, మంగలపెళ్లి హస్సేన్ పాల్గొన్నారు.