కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల .. దీక్ష తాత్కాలిక విరమణ

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల .. దీక్ష తాత్కాలిక విరమణ

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్​డీ అక్రమాలపై ఎంక్వైరీ చేయించి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ చీఫ్ ​విప్​దాస్యం వినయ్​భాస్కర్​ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు దీక్షలను తాత్కాలికంగా విరమించారు. ఎస్​డీఎల్​సీఈ వద్ద నిరసన దీక్ష చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు, రిటైర్డ్​ ప్రొఫెసర్లతో  సోమవారం వినయ్​భాస్కర్ ​ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు పీహెచ్​డీ అక్రమాల గురించి ఆయనకు వివరించారు. దీంతో వారిని సముదాయించి దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసి నిమ్మరసం తాగించారు. వినయ్​భాస్కర్​ మాట్లాడుతూ విద్యార్థులు కోరిన విధంగానే ఉన్నత విద్యామండలి చైర్మన్ ​ప్రొఫెసర్ ​ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతో మాట్లాడతామని, వారంలోగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

పది రోజులు చూస్తం: కేయూ స్టూడెంట్​ జేఏసీ

మంత్రి కేటీఆర్, చీఫ్ ​విప్ ​వినయ్​ భాస్కర్​ హామీ మేరకు తమ నిరసన దీక్షను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు కేయూ స్టూడెంట్​ లీడర్లు తెలిపారు. వారం రోజులు టైం చెప్పినప్పటికీ తాము 10 రోజుల వరకు వేచి చూస్తామన్నారు. ఆలోగా సమస్య పరిష్కరించకపోతే మళ్లీ దీక్షలు చేపట్టి, అర్హులైన అభ్యర్థులందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. కేయూ స్టూడెంట్ ​జేఏసీ చైర్మన్ ఇట్టబోయిన తిరుపతి, జేఏసీ నేతలు మేడ రంజిత్, గుగులోతు రాజు నాయక్,  మందా వీరస్వామి, మాచర్ల రాంబాబు, అరెగంటి నాగరాజు, బొట్ల మనోహర్, మట్టెడ కుమార్, ఎండీ పాషా, అంకిల్ల శంకర్, నిమ్మల రాజేష్,   అకుట్ కార్యదర్శి మామిడాల ఇస్తారి, రిటైర్డ్ ప్రొఫెసర్లు గాదె దయాకర్ పాల్గొన్నారు.