
- తాజాగా రేవంత్ రెడ్డిని కలిసిన కాలె యాదయ్య
- ఇప్పటివరకు సీఎంను కలిసిన ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- డెవలప్ మెంట్ ఫండ్స్ కోసమేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు జనవరి 24న సీఎంను కలవగా.. ఆ తర్వాత రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కలిశారు.
సీఎంను కలిసిన తర్వాత మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు స్పందిస్తూ సెక్యూరిటీ తగ్గించటంతో పాటు నియోజవర్గాల్లో తమకు అధికారులు ప్రోటోకాల్ పాటించటం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. తనపై ఇటీవల దాడి జరిగిందని తనకు 4 + 4 సెక్యూరిటీ ఇవ్వాలని కోరానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో భూ సమస్యలు పరిష్కరించాలని, నియోజక అభివృధ్దికి నిధులు కేటాయించాలని సీఎం ను కలిసి కోరినట్లు ప్రకాశ్ గౌడ్ చెప్పారు.
మూడు రోజుల క్రితం భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఈ నెల11న భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అదేరోజు ఆ నియోజకవర్గంలో నిర్వహించనున్న పబ్లిక్ మీటింగ్ లో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ చర్చ జరుగుతోంది. తాజాగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం సెక్రటేరియెట్ లో సీఎంను కలవడం మరింత చర్చకు దారి తీసింది. వీరందరూ త్వరలో కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం సాగుతోంది.
బీజేపీ నుంచి ఒకరు..
బీజేపీకి చెందిన సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు కూడా గత నెల 21న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో బీజేపీ ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్న టైమ్ లో ఆ యాత్రకు అటెండ్ అవ్వకుండా సీఎంను కలవటంతో జోరుగా చర్చ స్టార్ట్ అయింది. అయితే పాల్వాయి హరీష్ మాత్రం సీఎంను కలవటంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు నిధులు, సమస్యల పరిష్కారం కోసమే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తనను కలుస్తున్నారని మంగళవారం మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం గమనార్హం.