కాలె యాదయ్య భూ బకాసురుడు : పామెన భీమ్​ భరత్

కాలె యాదయ్య భూ బకాసురుడు : పామెన భీమ్​ భరత్
  •  ఆయన కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడినయ్

చేవెళ్ల, వెలుగు : ఎమ్మెల్యే కాలే యాదయ్య భూ బకాసురుడు.. దళిత ద్రోహి అని.. చేవెళ్ల సెగ్మెంట్ లోని దళిత రిజర్వేషన్ సీట్లో మొయినాబాద్ జడ్పీటీసీగా కొడుకు, నవాబ్ పేట్ జడ్పీటీసీగా  భార్య , ఎంపీపీగా కోడలు, అన్న కొడుకును సర్పంచ్ గా చేసి అధికార పదవులు కట్టబెట్టారని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీమ్​ భరత్ ధ్వజమెత్తారు. దళితులపై ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఒక్క ఎమ్మెల్యే  పదవి సరిపోదా..? మొయినాబాద్, నవాబ్ పేట్ మండలాల్లో  దళితులు లేరా..? అన్ని ప్రశ్నించారు. యాదయ్య కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం శంకర్ పల్లి మండలంలోని జన్వాడ, మీర్జాగూడ, మీయా ఖాన్ గూడ, ఇంద్రారెడ్డి నగర్, అంతప్పగూడ, సంకేపల్లి, పర్వేద, లచ్చిగూడ, కచ్చిగూడ, కొత్త గూడ తదితర గ్రామాల్లో గడప, గడపకు ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా  భీం భరత్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి, వెంచర్లు కనిపిస్తే చాలు .. ఎమ్మెల్యేకు కమీషన్ ఇవ్వాల్సిందేనని, లేదంటే కబ్జా చేస్తాడని ఆరోపించారు. ‘ ఒకాయన పూటకో పాటి మారుతూ.. ఊసరవెల్లి రంగులు మారుస్తూ .. పువ్వు గుర్తు తోటి మీ ముందుకు వస్తున్నాడు. మీ చెవిలో పువ్వులు పెడతాడు.. నమ్మకండి.. మోసపోకండి.ఇంతకుముందు ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేశాడో ...ఆలోచించండి ఎన్నికలు   అయిపోయినంక ఏ పార్టీకి అమ్ముడుపోతాడో తెలియదు.  ఇలాంటి వారికి ఓట్లు వేస్తే మన బతుకులు ఆగమైతయ్​’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. తల్లి సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను సంక్షేమ పథకాలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.