లిఫ్టులు సరే... ముంపు సంగతేంది?

లిఫ్టులు సరే... ముంపు సంగతేంది?
  • కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్​లో మునుగుతున్న పంటలు 
  • మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 40 వేల ఎకరాలకు పైగా మునక 
  • ఎకరానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలంటున్న రైతులు 
  • సీఎం హామీ ఇచ్చి 4నెలలవుతున్నా దక్కని న్యాయం

మంచిర్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్​తో మంచిర్యాల జిల్లాలోని వేలాది ఎకరాల్లో సాగుభూములు, మంచిర్యాల, చెన్నూర్​టౌన్లతో పాటు పలు గ్రామాలు నీట మునుగుతున్నాయి. ఇప్పటివరకు రైతులకు గానీ, ముంపు బాధితులకు గానీ ప్రభుత్వం పైసా నష్టపరిహారం ఇవ్వలేదు. శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం కేసీఆర్​చెన్నూర్​నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించేందుకు తలపెట్టిన చెన్నూర్ లిఫ్ట్​ఇరిగేషన్​ స్కీంకు రూ.1658 కోట్లతో భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్​ముంపు ప్రాంతాలను విజిట్​చేయాలని, వరద బాధితులకు పరిహారం అందించాలని బీజేపీ, కాంగ్రెస్​లీడర్లతో పాటు బాధితులు డిమాండ్​ చేస్తున్నారు. అలాగే, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సీఎం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.  

ముంపు బాధితులకు న్యాయం చేసేదెన్నడు? 

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్​లో ఎంటీఎల్​వరకు మునిగిపోయే భూములకు మార్కెట్​రేటు ప్రకారం ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించి తీసుకోవాలని రైతులు డిమాండ్​చేస్తున్నారు. రైతుల పక్షాన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్​ జి.వివేక్​వెంకటస్వామి ఆధ్వర్యంలో పలు పోరాటాలు చేశారు. హైదరాబాద్​ఇందిరాపార్కు దగ్గర రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. రాష్ర్ట గవర్నర్​తో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఫిర్యాదులు చేశారు. అంతకుముందు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్..​కోటపల్లి మండలం అన్నారం నుంచి కలెక్టరేట్ వరకు మూడు రోజులు పాదయాత్ర నిర్వహించారు.   స్పందించిన కేసీఆర్​ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం బ్యాక్​వాటర్​ బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికీ నాలుగు నెలలవుతున్నా ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో ఈ వానాకాలం సీజన్​లో పంటలు వేయాలా, వద్దా అని రైతులు ఊగిసలాడుతున్నారు. గత నాలుగేండ్లలో జరిగిన నష్టానికి పరిహారం రాకపోవడంతో మళ్లీ వరదలు వస్తే పంటలు తుడిచిపెట్టుకొని పోతాయని ఆందోళన చెందుతున్నారు. 

40 వేల ఎకరాలు మునక.. 

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్​కారణంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 40 వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సమయంలో సర్కారు గోదావరి ఇన్​ఫ్లోను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. క్యాచ్​మెంట్​ఏరియా నుంచి పెద్ద ఎత్తున వచ్చే వరదను లెక్కలోకి తీసుకోలేదు. అలాగే ఫుల్​రిజర్వాయర్​ లెవల్​(ఎఫ్​టీఎల్) సర్వే చేసి ముంపు భూములను సేకరించారు. వరదలు వచ్చినప్పుడు మ్యాగ్జిమమ్​ట్యాంక్​లెవల్​(ఎంటీఎల్)తో మునిగిపోయే భూములను గుర్తించలేదు. దీంతో నాలుగేండ్లుగా మంచిర్యాల జిల్లాలోని జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాలతో పాటు పెద్దపల్లి జిల్లాలోని మంథని, రామగుండం, వెల్గటూరు మండలాల్లో మొత్తం 40వేల ఎకరాల్లో పంటలు మునిగిపోతున్నాయి.