భూసేకరణ దగ్గరే ఆగిన కాళేశ్వరం కాల్వలు..మూడు ప్యాకేజీల పనులు మొదలే కాలే

భూసేకరణ దగ్గరే ఆగిన  కాళేశ్వరం కాల్వలు..మూడు ప్యాకేజీల పనులు మొదలే కాలే
  • ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని భూసేకరణ 
  • అవసరం 4,791 ఎకరాలు
  • సేకరించింది 634 ఎకరాలు మాత్రమే

మెదక్, నర్సాపూర్, వెలుగు: సాగునీటి సమస్యలు లేకుండా చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన  కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు మెదక్ జిల్లాలో ముందుకు సాగడం లేదు. ఏళ్లుగా భూసేకరణ స్థాయిలోనే ఆగిపోయాయి. వివిధ మండలాల పరిధిలో 75,473 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఉద్దేశించిన ప్యాకేజీ 17, 18, 19 పనులు ఇంకా మొదలే కాలేదు. కాల్వల నిర్మాణ గడువు ఎప్పుడో పూర్తి కాగా ఇరిగేషన్ అధికారులు గడువుల మీద గడువు పొడిగిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. 

ఇపుడు ప్రభుత్వం మారడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వల పరిస్థితి  ఏమవుతుందో అన్న అయోమయం నెలకొంది. జిల్లాలో మొత్తం ఐదు ప్యాకేజీలుగా కాళేశ్వరం కాల్వల పనులు మంజూరయ్యాయి. ప్యాకేజీ 13, 14, 15 కింద చేగుంట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట మండలాల్లోని 76 చెరువులను నింపడం ద్వారా 19,452 ఎకరాలకు సాగునీటిని అందించాలన్నది లక్ష్యం. ఇందుకు సంబంధించిన మెయిన్​ కెనాల్​ పనులు జరిగాయి. ఈ కాల్వకు నీటిని కూడా విడుదల చేశారు. కాగా 79 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటరీ కెనాల్​ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది.  

3,157 ఎకరాలు పెండింగ్​

ప్యాకేజీ 17, 18, 19ల ద్వారా 8 మండలాల్లో 75,473 ఎకరాలకు సాగు నీటిని అందించేందుకుగాను 52.800 కిలోమీటర్ల దూరం మెయిన్​ కెనాల్​, 75.2 కిలోమీటర్ల దూరం బ్రాంచ్​ కెనాల్​, 22.568 కిలోమీటర్ల దూరం టన్నెల్​ నిర్మించాల్సి ఉంది. ఈ మూడు ప్యాకేజీల పనులు చేపట్టేందుకు మొత్తం 4,791 ఎకరాల భూమి సేకరించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఇప్పటి వరకు కేవలం1,634 ఎకరాల భూసేకరణ మాత్రమే జరిగింది. ఇంకా 3,157 ఎకరాల భూసేకరణ పెండింగ్​లో ఉంది.   

అసంపూర్తిగా భూసేకరణ

ప్యాకేజీ 17 లో 4.575 కిలోమీటర్ల దూరం మెయిన్​ కెనాల్​, 18.62 కిలోమీటర్ల టన్నెల్​ నిర్మించేందుకుగాను 402 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 382 ఎకరాలు సేకరించగా, ఇంకా 20 ఎకరాలు సేకరించాల్సి ఉంది. వెల్దుర్తి, కౌడిపల్లి, కొల్చారం మండలాల పరిధిలో 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేందుకు ప్యాకేజీ 18 ద్వారా 36.305 కిలోమీటర్ల దూరం మెయిన్​ కెనాల్, 3.948 కిలోమీటర్ల దూరం టన్నెల్​ నిర్మించాల్సి ఉంది. 

కాల్వ, టన్నెల్​ నిర్మాణం కోసం మొత్తం1,289 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా  ఇప్పటి వరకు 800 ఎకరాలు మాత్రమే సేకరించారు. మరో 488ఎకరాలు సేకరించాల్సి ఉంది. చిలప్​ చెడ్​, కౌడిపల్లి, కొల్చారం, టేక్మాల్​, పాపన్నపేట, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం మండలాల్లో 60,473 ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు గాను ప్యాకేజీ 19 లో12 కిలోమీటర్ల దూరం మెయిన్​ కెనాల్, 75.2 కిలో మీటర్ల దూరం బ్రాంచ్​ కెనాల్​ నిర్మించాల్సి ఉంది. ఈ పనులు చేపట్టేందుకుగాను ఆయా మండలాల పరిధిలో 3,100 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 452 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఇంకా 2,648 ఎకరాల భూ సేకరణ పెండింగ్​లో ఉంది.  

గడువు పొడిగిస్తూనే ఉన్నారు

వాస్తవానికి 2022 సెప్టెంబర్​ లోపే ప్యాకేజీ 17, 18, 19 ల పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఏటా గడువు పొడిగిస్తూ వెళుతున్నారు. ప్యాకేజీ 17, 18 పనులు 2023 డిసెంబర్​ 31 వరకు, ప్యాకేజీ 19 పనులు 2024 డిసెంబర్​ 31 వరకు పూర్తి చేసేలా గడువు పొడిగించారు.  ఈ ఏడాది గడచి పోతున్నా  కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో అనుకున్న  గడువులోగా పనులు పూర్తి కావడం డౌటే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.