
- బీజేపీ సర్కారుతోనే బీఆర్ఎస్‌కు చెక్‌పెట్టే వ్యూహం
- రాష్ట్రంలోకి దర్యాప్తు సంస్థ ఎంటర్ కాకుండా మూడేండ్ల కిందట కేసీఆర్ జీవో
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో ఆంక్షలు
- సీబీఐ ఎంట్రీకి ప్రత్యేక నోటిఫికేషన్, జీవో ఇవ్వనున్న రాష్ట్ర సర్కారు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ కేసు కేంద్రం కోర్టులోకి వెళ్లినట్లయింది. ప్రాజెక్టు అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నేతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సీబీఐకి అప్పగించకుండా ఇక్కడే నిర్వీర్యం చేసేందుకు రేవంత్ సర్కారు ప్రయత్నిస్తున్నదని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సైతం పలుమార్లు ఆరోపించారు.
ఈ క్రమంలో ఆదివారం ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించడం అన్ని పార్టీలను షాక్‌కు గురిచేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పేరు చేర్చినప్పుడు, గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండుసార్లు బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని కవితతోపాటు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఇటీవల ధ్రువీకరించారు. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు ఈ రెండు పార్టీలు ఏకమవుతాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం దర్యాప్తును సీబీఐకి అప్పగించడం ద్వారా బీజేపీతోనే బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా పావులు కదిపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీబీఐ ఎంట్రీకి ఇక లైన్ క్లియర్
కాళేశ్వరం కేసు అప్పగించడంతో రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ దర్యాప్తు సమయంలో రాష్ట్రంలోకి సీబీఐ డైరెక్ట్ ఎంట్రీకి అనుమతి నిరాకరిస్తూ 2022 ఆగస్టు 30న గత బీఆర్‌ఎస్ సర్కార్ జీవో ఎంఎస్ నంబర్ 51 జారీ చేసింది. నాటి నుంచి రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వ అనుమతి (జనరల్ కన్సెంట్) తప్పనిసరి అయింది. కానీ కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఆదివారం సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈమేరకు త్వరలో సీబీఐకి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఒకవేళ సీఎం లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీబీఐకి జనరల్ కన్సెంట్ లభించినట్లేనని అధికారులు చెప్తున్నారు. లేఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్, జీవో కూడా జారీ చేసి కేంద్రానికి పంపుతుందని, అక్కడి నుంచి ఆదేశాలు వెళ్లగానే సీబీఐ దర్యాప్తు మొదలవుతుందని అంటున్నారు. ఘోష్కమిషన్ సమగ్ర దర్యాప్తు నివేదికతోపాటు విజిలెన్స్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) రిపోర్టుల ఆధారంగా సీబీఐ ఎఫ్ఐఆర్ఫైల్చేసి, నిందితులను విచారణ చేస్తుందని భావిస్తున్నారు.
ఢిల్లీ మినహా ఇతర రాష్ట్రాల్లో సీబీఐకి నో ఎంట్రీ
ఢిల్లీ అవినీతి నిరోధక చట్టం-–1988, ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం..ఢిల్లీ మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ సీబీఐకి నేరుగా దర్యాఫ్తు చేసే అధికారం లేదు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1946 (డీఎస్‌పీఈ) సెక‌్షన్ 6 ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సాధారణ సమ్మతి(జనరల్ కన్సెంట్) తో కేసుల విచారణను చేపట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల జనరల్ కన్సెంట్‌ను ఈ చట్టం తప్పనిసరి చేసింది. కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని కట్టడి చేసేందుకు కొన్ని రాష్ట్రాలు డీఎస్‌పీఈ సెక‌్షన్ 6ను తమ రాష్ట్రాల పరిధిలో ఉపసంహరించుకుంటూ జీవోలు జారీ చేశాయి. ఈ జాబితాలో పలు రాష్ట్రాలు ఉన్నాయి. ఏపీలోనూ 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకుంది.
ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు నేపథ్యంలో 2022 లో బీఆర్ఎస్ టార్గెట్‌గా సీబీఐ దాడులు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం జీవో నంబర్ 51ను అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే రాష్ట్రంలోకి సీబీఐ అడుగుపెట్టడానికి వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణతోపాటు పశ్చిమ బెంగాల్, కేరళ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరాం, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా సీబీఐ దర్యాప్తుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.
సీబీఐకి లేఖ రాస్తం: సీఎం
కాళేశ్వరంపై దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన హోటల్ తాజ్ కృష్ణాలో మీడియాతో చిట్ చాట్ చేశారు. కాళేశ్వరం అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగించాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు పలు సందర్భాల్లో పదే పదే డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ‘‘కాళేశ్వరంపై మేం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాం. ఇక బంతి బీజేపీ కోర్టులో ఉంది. నిర్ణయం తీసుకోవాల్సింది కూడా వాళ్లే. ఏం జరుగుతుందో చూద్దాం” అని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా నిషేధం విధించారని, కానీ తాము కేసు దర్యాప్తు చేయాలని కోరుతూ సీబీఐకి లేఖ రాస్తామని సీఎం చెప్పారు.