
- కేసీఆర్‌కు నోటీసులు
- మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటలకు కూడా
- వ్యక్తిగతంగా హాజరుకావాలన్న కాళేశ్వరం కమిషన్
- జూన్ 5న కేసీఆర్, 6న ఈటల, 9న హరీశ్ విచారణ
- వారిని విచారించాకే సర్కారుకు
- పూర్తి రిపోర్ట్ అందజేయాలని కమిషన్ నిర్ణయం
- గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు హాజరు కాని కేసీఆర్
- ఈ సారైనా వస్తారా? రారా? అని అనుమానాలు
- నోటీసుల నేపథ్యంలో కేసీఆర్‌తో హరీశ్ భేటీ.. సుదీర్ఘంగా చర్చలు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారా? లేదా? అన్న చర్చలకు తెరదించుతూ.. ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్ తోపాటు గత ప్రభుత్వం తొలి టర్మ్‌లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు, ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌కూ సమన్లు ఇచ్చింది. ఈటలను జూన్ 6న, హరీశ్‌రావును 9న విచారణకు రావాలని అందులో పేర్కొన్నది. కాళేశ్వరం కమిషన్ గడువును సర్కారు 2 నెలలపాటు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన మరుసటిరోజే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విధానపర నిర్ణయాలు, ఆర్థిక నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్‌తోపాటు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌కు కమిషన్ నోటీసులు పంపింది. 15 రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. వాస్తవానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ రిపోర్టును సమర్పించాల్సి ఉంది. అయితే, ఆ ముగ్గురి స్టేట్మెంట్లు లేకుండా రిపోర్ట్ ఇస్తే లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో.. వారిని సైతం విచారించాకే రిపోర్టు ఇవ్వాలని కమిషన్ నిర్ణయించింది.
కేసీఆర్ నిర్ణయం మేరకే నడుచుకున్నామన్న ఆఫీసర్లు
కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ఇప్పటిదాకా 109 మంది అధికారులు, ప్రైవేట్వ్యక్తులను కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారించింది. దాదాపు అధికారులందరూ నాటి ప్రభుత్వ పెద్దల నిర్ణయానికి అనుగుణంగానే నడుచుకున్నామని ఓపెన్ కోర్టుల్లో చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాల్లో నాటి సీఎం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. నాటి సీఎం అధ్యక్షతన జరిగిన హైపవర్ కమిటీ మీటింగ్‌లలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని కమిషన్‌కు అధికారులు వెల్లడించారు. 2016 జనవరిలోనే ప్రాజెక్ట్ డీపీఆర్‌పై మాజీ సీఎం కేసీఆర్ తొలి రివ్యూ మీటింగ్ నిర్వహించారని మాజీ ఈఎన్సీలు, పలువురు ఐఏఎస్‌లు కమిషన్ ఓపెన్ కోర్టులో తెలిపారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా అదే ఏడాది మార్చిలో సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పించినట్టు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌పై 2016 మార్చి 31న అసెంబ్లీలో కేసీఆరే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ప్రాజెక్టు గురించి సభ్యులకు వివరించారు. అనంతరం అదే ఏడాది మే 2న ప్రాజెక్టుకు కేసీఆర్ భూమి పూజ చేశారు. అది జరిగిన ఐదు నెలలకే తొలి హైపవర్ కమిటీ మీటింగ్నిర్వహించారు. 2016 సెప్టెంబర్ 14న, అక్టోబర్ 22న నిర్వహించిన రెండు హైపవర్ కమిటీ మీటింగ్‌లలో.. వ్యాప్కోస్ డీపీఆర్‌లలో మార్పులు చేయాలని కేసీఆరే సూచించారని కమిషన్ విచారణలో అధికారులు వెల్లడించారు. ఆ మీటింగుల మినిట్స్‌నూ కమిషన్‌కు అధికారులు సమర్పించారు.
ప్రమాదం జరిగినా నీటినిల్వపై వెనక్కితగ్గలే..
ప్రాజెక్టు అంచనా వ్యయం, నిర్మాణం తదితర అంశాలపై స్టాండింగ్ కమిటీలోనూ చర్చించారని, ఆ తర్వాత కేబినెట్లోనూ చర్చించి ప్రాజెక్టుపై ముందుకు వెళ్లారని అధికారులు స్పష్టంగా కమిషన్‌కు వివరించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం తొలుత రూ.80,119 కోట్లుగా నిర్ణయించినా.. డీపీఆర్‌లలో మార్పులకు అనుగుణంగా ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.1.27 లక్షల కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నదీ కేసీఆరేనని స్పష్టం చేశారు. మరోవైపు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లను మార్చాలంటూ చెప్పిందీ ఆయనేనని పేర్కొన్నారు. 2019 అక్టోబర్ 10న మేడిగడ్డ బ్యారేజీలో తొలిసారి ప్రమాదం జరిగినప్పుడు కూడా నీటి నిల్వపై వెనక్కి తగ్గలేదని, నీళ్లు నింపాలంటూ కేసీఆరే డైరెక్షన్స్ ఇచ్చారని అధికారులు స్టేట్మెంట్లు ఇచ్చారు. ‘‘ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా వ్యవహరించిన హరీశ్ రావు కూడా.. ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పనులు జరుగుతున్నన్నాళ్లూ దగ్గరుండి చూసుకున్నారు. పలు విధానపరమైన నిర్ణయాలను ఆయన కూడా తీసుకున్నారు. అధికారులకు పలు అంశాల్లో ఆదేశాలిచ్చారు” అని ఓపెన్ కోర్టుల్లో అధికారులు వెల్లడించారు.
బ్యాంక్ గ్యారెంటీలు, కంప్లీషన్ సర్టిఫికెట్లు నాటి ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఇచ్చినట్టు స్పష్టంగా చెప్పారు. ఇక, ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ప్రాజెక్టుకు ఆర్థిక అనుమతులు, బిల్లుల చెల్లింపులు, తదితర వ్యవహారాలూ ఆయన శాఖ ద్వారానే నడిచాయి.
కేసీఆర్‌తో హరీశ్ భేటీ
కమిషన్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లిన హరీశ్ రావు.. కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు తెలిసింది. ఏం చేయాలి? విచారణకు హాజరవ్వాలా? వద్దా? లీగల్ ఒపీనియన్ ఏమైనా తీసుకోవాలా? లాంటి అంశాలపై చర్చించినట్టు సమాచారం. కమిషన్ ఓపెన్ కోర్టులు నిర్వహించిన తీరు.. అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు.. ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలు తదితర అంశాలపైనా ఇరువురు నేతలు డిస్కస్ చేసినట్టు తెలిసింది.
కేసీఆర్ వస్తారా? రారా?
అధికారులు చెప్పిన వివరాల ఆధారంగా రిపోర్ట్‌లో వారిపై అభియోగాలు మోపితే ఇబ్బందులు వస్తాయని కమిషన్ భావించింది. ఈ క్రమంలోనే వారినీ విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్లనూ తీసుకుంటే బాగుంటుందని కమిషన్ ఆలోచించింది. అందులో భాగంగానే కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు పంపించినట్టు తెలిసింది. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణకు హాజరయ్యేందుకు కమిషన్ అవకాశం ఇచ్చినట్టు సమాచారం. అయితే, విచారణకు వాళ్లు హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో విద్యుత్ జ్యుడీషియల్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కాలేదు. తాను విచారణకు రాలేనంటూ కమిషన్‌కు లేఖ ద్వారా తెలిపారు.
అనంతరం కమిషన్ విచారణార్హతపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. కమిషన్ చైర్మన్‌ను మార్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నోటీసుల విషయంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొన్నది. అయితే, కేసీఆర్ విచారణకు హాజరు కాకుంటే ఏం చేయాలన్న దానిపైనా కమిషన్ సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.