
- బ్యారేజీల నిర్మాణం నుంచి కాంట్రాక్టుల అప్పగింత దాకా అంతా ఆయన ఇష్టారాజ్యమే
- భారీగా ఆర్థిక అవకతవకలు.. ప్రజాధనం దుర్వినియోగం
- కమిషన్ నివేదికలో సంచలన విషయాలు.. నేడు కేబినెట్లో చర్చ
- ప్రతి చిన్న పనిలోనూ కేసీఆర్ జోక్యం ఉంది
- మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దన్న ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదికనూ తొక్కిపెట్టారు
- బ్యారేజీల్లో నీటిని నింపాలని ఆయనే ఆదేశించారు
- అన్నారం, సుందిళ్ల లొకేషన్లను కావాలనే మార్చారు
- దానికి తగ్గట్టు పనుల కాంపొనెంట్లను పెంచి అంచనాలను భారీగా పెంచారు
- ప్రాజెక్టు ఖర్చుపై డీపీఆర్‌కు ముందే ప్రధానికి లేఖ రాశారు
- ఖర్చును రూ.38,500 కోట్ల నుంచి 1.10 లక్షల కోట్లకు పెంచారు
- కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అయాచిత లబ్ధి చేకూర్చారు
- బ్యారేజీల వైఫల్యాలకు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కూడా బాధ్యులే
- అధికారుల నిర్లక్ష్యాన్నీ ప్రస్తావించిన రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నుంచి.. కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్నీ కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచాయని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ తేల్చింది. ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ ఆయన జోక్యం చేసుకున్నారని పేర్కొంది. కేబినెట్లో చర్చించకుండానే.. సరైన ఫైళ్లు లేకుండానే ప్రాజెక్టు పనులను చేయించారని తెలిపింది. డీపీఆర్ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని ఆక్షేపించింది. బ్యారేజీ సైట్‌ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడంపైనా ఆయనే నిర్ణయం తీసుకున్నారని
తేల్చిచెప్పింది. కేసీఆర్ నిర్ణయాలే చివరికి బ్యారేజీల ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయని, ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అసలు దోషి ఆయనేనని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు వైఫల్యాలకు నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్‌రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా బాధ్యులేనని తేల్చిచెప్పింది. ఆర్థికాంశాల్లో అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఈటల రాజేందర్ బాధ్యతగా వ్యవహరించలేదని తెలిపింది. అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పనితీరునూ తప్పుబట్టింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు ఎల్ అండ్‌టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థలూ బ్యారేజీలు విఫలమవడంలో ప్రధాన కారణమని కమిషన్ తేల్చి చెప్పింది.
కమిటీతో ఉత్తమ్ భేటీ
జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. అధికారుల స్థాయి నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ప్రాజెక్టు నిర్మాణాన్ని సక్రమంగా చేపట్టలేదని, ఆర్థిక అవకతవకలు జరిగాయని నిగ్గు తేల్చింది. ఇటీవలే ఆ రిపోర్టును రాష్ట్ర సర్కార్‌కు కమిషన్ అందించిన సంగతి తెలిసిందే. దానిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నది. సోమవారం ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్‌ను ఏర్పాటు చేసి చర్చించనుంది. అందులో భాగంగానే నివేదికలోని అంశాలపై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీతో ఆదివారం మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. రిపోర్టులోని పలు అంశాలను కమిటీ ప్రస్తావించినట్టు తెలిసింది. ఆ అంశాల ఆధారంగా కేబినెట్లో సర్కారు నిర్ణయం తీసుకోనుంది.
లొకేషన్లు మార్చి.. అంచనాలు పెంచి..
బ్యారేజీల లొకేషన్లను ఉద్దేశపూర్వకంగానే మార్చారని, ఆ నిర్ణయమూ నాటి సీఎం కేసీఆర్‌దేనని జ్యుడీషియల్ కమిషన్ నివేదిక తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 2016 జులై, ఆగస్టులో ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొంది. అయితే, వ్యాప్కోస్‌తో అధ్యయనాలు చేయించకుండానే అదే ఏడాది అక్టోబర్‌లో హైపవర్ కమిటీ మీటింగ్‌ను నిర్వహించారని, బ్యారేజీల సైట్లను మార్చి నిర్మాణాలు చేపట్టాలనికేసీఆర్, హరీశ్ రావు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తేల్చిచెప్పింది. దీనికి ప్రభుత్వ (కేబినెట్) ఆమోదం కూడా లేదని స్పష్టం చేసింది. అప్పట్లో నిపుణులు ఇచ్చిన రిపోర్టులను తొక్కిపెట్టారని తీవ్రంగా ఆక్షేపించింది. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని ఓ సాకును చూపించి మేడిగడ్డకు లొకేషన్‌ను మార్చారని పేర్కొంది. ఆ నిర్ణయంలో ఎక్కడా నిజాయితీ లేదని తెలిపింది. ‘‘2015 జనవరి 21న ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ ఫీజిబుల్ కాదని ఆ కమిటీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అక్కడ కడితే ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఖర్చు ఎక్కువ అవుతుందని ప్రభుత్వానికి సూచించింది. దానికి బదులు వేమనపల్లి వద్ద బ్యారేజీని నిర్మిస్తే బాగుంటుందని ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సు చేసింది. కానీ, ఆ రిపోర్టును అప్పటి సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారు. కనీసం అందులోని సిఫార్సులను పట్టించుకోలేదు. కోల్డ్ స్టోరేజీకి దానిని పరిమితం చేశారు’’ అని రిపోర్ట్ తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి 2016 మార్చి 1న జీవోలు 231, 232, 233 ఇచ్చారని.. కానీ, వాటిని కేబినెట్ ముందు పెట్టలేదని, బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదమూ లేదని స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వ బిజినెస్ రూల్స్‌కు విరుద్ధమని కమిషన్ తన నివేదికలో ఆక్షేపించింది.
డీపీఆర్‌కు ముందే ప్రధానికి లేఖ
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి వ్యాప్కోస్ సంస్థ డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను సమర్పించడానికి ముందే ప్రాజెక్టు ఖర్చుపై 2016 ఫిబ్రవరి 11న ప్రధానికి నాటి సీఎం కేసీఆర్ లేఖ రాశారని జ్యుడీషియల్ కమిషన్ నిగ్గు తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 71,436 కోట్లు ఖర్చవుతుందని ప్రధానికి రాసిన ఆ లేఖలో పేర్కొన్నారని స్పష్టం చేసింది. వాస్తవానికి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పొంతన లేకుండా పెంచేశారని తెలిపింది. తొలుత ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,500 కోట్లుగా ఉండగా.. నాటి సీఎం కేసీఆర్ లేఖ ప్రకారం 2016 నాటికి దానిని రూ.71,436 కోట్లకు పెంచారని స్పష్టం చేసింది. ఆ వ్యయం కాస్తా.. 2022 మార్చి నాటికి రూ.1,10,248 కోట్లకు పెంచుతూ పరిపాలనా అనుమతులు ఇచ్చారని స్పష్టంచేసింది.
నీళ్లు నింపాలన్నదీ కేసీఆరే..
బ్యారేజీల్లో నీళ్లు నింపాలని ఆదేశాలిచ్చింది కూడా అప్పటి సీఎం కేసీఆరేనని కమిషన్ నివేదిక తేల్చిచెప్పింది. బ్యారేజీలను నీటిని మళ్లించేందుకే వాడాల్సి ఉన్నా.. నీటిని పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నింపారని స్పష్టం చేసింది. ఇలా నీళ్లను నింపడంతోనే బ్యారేజీలకు పెను ప్రమాదం ఏర్పడిందని తేల్చింది. బ్యారేజీలను నిర్మించినప్పటి నుంచీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం)ను చేపట్టలేదని, పూర్తి నిర్లక్ష్యం చేశారని కమిషన్ నివేదిక తేల్చింది. కాలానుగుణంగా పరీక్షలు చేయలేదని, వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత చేయాల్సిన ఇన్స్పెక్షన్లు చేయలేదని, నివేదికలు ఇవ్వలేదని పేర్కొంది. వాస్తవానికి బ్యారేజీలను ఫ్లోటింగ్ స్ట్రక్చర్లుగా (తేలియాడే నిర్మాణం) డిజైన్ చేసినప్పటికీ.. నీటిని స్టోర్ చేసే వాటిగా కట్టారని, అది ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లను మార్చాక అక్కడ బ్యాక్ వాటర్ స్టడీస్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్స్, జీడీ కర్వ్స్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్‌ను చేయలేదని తెలిపింది. నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని స్పష్టం చేసింది. సీకెంట్ పైల్స్ వంటి నిర్మాణాలను చేపట్టేటప్పుడు నాణ్యతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాల్సి ఉన్నా.. పట్టింపులేనట్టుగానే వ్యవహరించినట్టు ఉందని తెలిపింది. సరైన కొలతలు లేకుండానే వర్చువల్‌గానే వాటి నిర్మాణాన్ని ఓకే చేశారని తెలిపింది.
కుమ్మక్కయ్యారు..
ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏజెన్సీతో అధికారులు కుమ్మక్కయ్యారని కమిషన్ నివేదిక తేల్చింది. దురుద్దేశపూర్వకంగా వ్యవహరించి దాని నుంచి లబ్ధి పొందాలని చూశారని వెల్లడించింది. ప్రాజెక్టు కోసం భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది. బ్యారేజీలకు వ్యాప్కోస్ సంస్థతో స్టడీ చేయించినా.. ఆ నివేదికనూ పక్కన పడేశారని కమిషన్ తెలిపింది. అందుకు సంస్థకు చెల్లించిన రూ.6.77 కోట్లను సంబంధిత అధికారుల నుంచి వసూలు చేయాలని సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఏడో బ్లాక్ కుంగుబాటులో ఏజెన్సీ ఎల్ అండ్ టీ పాత్ర కూడా ఉందని స్పష్టం చేసింది. ఏడో బ్లాక్ పునరుద్ధరణను ఎల్ అండ్ టీ ఖర్చులతోనే చేయించాలని సిఫార్సు చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లోనే సమస్యలు వచ్చినందున.. ఆయా సంస్థలతోనే రిపేర్లు చేయించాలని సూచించింది.
కాళేశ్వరం కార్పొరేషన్‌ది నేరపూరిత నిర్లక్ష్యం
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చులో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ది నేరపూరిత నిర్లక్ష్యమని కమిషన్ నివేదిక వెల్లడించింది. బోర్డు మెంబర్లు దీనికి బాధ్యులని తేల్చి చెప్పింది. ఏదీ పట్టించుకోకుండానే లోన్ ఫెసిలిటేటర్లుగా వ్యవహరించి ప్రజాధనం దుర్వినియోగానికి కారకులయ్యారని పేర్కొంది. ప్రాజెక్టు అంచనా వ్యయాల పెంపు, రెవెన్యూ జనరేషన్ ఆబ్లిగేషన్లను పట్టించుకోలేదని పేర్కొంది.
‘‘2015 జనవరి 21న ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ ఫీజిబుల్ కాదని ఆ కమిటీ తిరస్కరించింది. అక్కడ కడితే ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఖర్చు పెరుగుతుందని సూచించింది. దానికి బదులు వేమనపల్లి వద్ద బ్యారేజీని నిర్మిస్తే బాగుంటుందని సిఫార్సు చేసింది. కానీ, ఆ రిపోర్టును అప్పటి సీఎం కేసీఆర్ ఉద్దేశ పూర్వకంగా తొక్కిపెట్టారు. కనీసం అందులోని సిఫార్సులను పట్టించు కోలేదు. కోల్డ్ స్టోరేజీకి దానిని పరిమితం చేశారు’’ అని రిపోర్ట్ తేల్చింది.
కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అయాచిత లబ్ధి
సీడబ్ల్యూసీ సిఫార్సుల ప్రకారం కాంట్రాక్టును డిజైన్లు, నిర్మాణం, ప్లానింగ్ సహా ప్రాజెక్టు పూర్తి బాధ్యతలు కాంట్రాక్టర్‌కే అప్పగించేలా టర్న్‌కీ పద్ధతిలో ఇవ్వాల్సి ఉన్నా.. గంపగుత్తగా కాంట్రాక్టును కేటాయించారని కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లను కావాలని మార్చేసిన నాటి సర్కారు.. దానికి తగ్గట్టుగా ప్రాజెక్టు పొడవు, ఫ్లడ్ బ్యాంకులు, డిజైన్లనూ మార్చి వాటి ఖర్చులకూ అంచనాలను 2018 మేలో భారీగా సవరించిందని పేర్కొంది. వ్యాప్కోస్‌తో చర్చించకుండానే ఆ రెండు బ్యారేజీల స్థలాలను మార్చి కాంట్రాక్ట్‌కు 2016 జులై/ఆగస్టులో ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొంది. బ్యారేజీల స్పెసిఫికేషన్లలో మార్పులు, డిజైన్లు, డ్రాయింగ్లు, క్వాంటిటీలు పెరిగాయన్న సాకుతో 2021–2022 మధ్య రెండోసారి అంచనాలు పెంచేశారని ఆక్షేపించింది. అందులో స్టాఫ్ క్వార్టర్లు, గెస్ట్ హౌస్, స్లోప్ ప్రొటెక్షన్ వర్క్‌లను అదనంగా చూపించారని తెలిపింది. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఆయాచిత లబ్ధి చేకూర్చారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని నివేదిక తేటతెల్లం చేసింది. మేడిగడ్డ బ్యారేజీకి 2019 సెప్టెంబర్ 9న సబ్‌స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్, 2021 మార్చి 15న కంప్లీషన్ సర్టిఫికెట్‌ను కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఇవ్వడం అతిపెద్ద తప్పు అని కమిషన్ నివేదిక స్పష్టంగా తేల్చిచెప్పింది. ఏజెన్సీకి అయాచిత లబ్ధి చేకూర్చేందుకే తప్పుడు ఇంటెన్షన్‌తో అక్రమంగా వాటిని జారీ చేశారని పేర్కొంది.
కమిషన్ నివేదిక ప్రకారం వీళ్లంతా బాధ్యులే..
కేసీఆర్: ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల ప్లానింగ్, నిర్మాణం, కంప్లీషన్, ఓ అండ్ ఎంలలో అవకతవకలు, అక్రమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అప్పటి సీఎం కేసీఆరే బాధ్యుడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాల వల్లే మూడు బ్యారేజీలకు ఇప్పుడీ దుస్థితి ఏర్పడింది.
హరీశ్ రావు: అప్పటి సీఎం కేసీఆర్‌తో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కూడా ఉద్దేశపూర్వకంగానే ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు.
ఈటల రాజేందర్: కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై ఉన్నా.. ఆయనలో ఆ కమిట్మెంట్ లోపించింది. ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాలపై సరిగ్గా దృష్టి సారించలేదు. కాళేశ్వరం కార్పొరేషన్ బోర్డులో ఆర్థిక శాఖ కూడా భాగమైనా అది తమ బాధ్యత కాదని తప్పించుకున్నారు.
ఎస్కే జోషి: అప్పట్లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సీఎస్‌గా ఉన్న ఈయన ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. పరిపాలనకు సంబంధించి బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఫెయిల్యూర్‌కు బాధ్యుడు.
స్మితా సబర్వాల్: అప్పటి సీఎంవో సెక్రటరీగా స్మితా సబర్వాల్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదు. కేబినెట్ అనుమతులకు సంబంధించి బిజినెస్ రూల్స్ ప్రకారం నడుచుకోలేదు.
మురళీధర్‌రావు: ఈఎన్సీగా విధుల్లో ఉన్న ఈయన సెంట్రల్ వాటర్ కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను దాచేశారు. దురుద్దేశపూర్వకంగా అంచనాలను పెంచారు. ఓ అండ్ఎంలో ఫెయిలయ్యారు.
బి.హరిరాం: ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు సీఈగా సీడబ్ల్యూసీకి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ అయి ఉండి కూడా బ్యారేజీల సంగతి తనకు తెలియదంటూ చెప్పారు.
బ్యారేజీల నిర్మాణంలో కాళేశ్వరం సీఈ ఎన్. వెంకటేశ్వర్లు, రామగుండం సీఈ కొట్టె సుధాకర్ రెడ్డి, ఈఈ ఓంకార్ సింగ్, ఇతర అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
బి. నాగేందర్ రావు: అప్పట్లో ఈఎన్సీ (ఓ అండ్ ఎం)గా ఉన్న ఈయన 2021 జనవరి 1 నుంచి బ్యారేజీల ఓ అండ్ ఎంను పట్టించుకోవడంలో విఫలమయ్యారు. బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి ఇతరులపైకి నెపాన్ని మోపే ప్రయత్నం చేశారు. మూడు బ్యారేజీలు డ్యామేజ్ అవ్వడానికి కారణమయ్యారు.
టి. ప్రమీల: స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సీఈగా ఆమె తన విధులను నిర్లక్ష్యం చేశారు. బ్యారేజీలను ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్, డ్యామ్ సేఫ్టీ డ్యూటీలు చేయడంలో విఫలమయ్యారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం పనిచేయలేదు.
నరేందర్ రెడ్డి (సీఈ సీడీవో), కేఎస్ఎస్ చంద్రశేఖర్ (ఎస్ఈ సీడీవో), బసవరాజు (ఈఈ సీడీవో), టి. శ్రీనివాస్ (సీఈ)లు కమిషన్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. నిజాలు దాచారు. వీరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.
శ్రీదేవి (సీఈ ఈఆర్ఎల్): ప్రమాణాలకు తగ్గట్టు మోడల్ స్టడీస్ నిర్వహించలేదు.
అనిల్ కుమార్: అప్పట్లో ఈఎన్సీగా పనిచేసిన ఈయన.. ఆదేశాలను కాదని తన సొంత నిర్ణయాలు తీసుకున్నారు.