కాళేశ్వరం కిస్తీ కంటే.. వడ్డీనే ఎక్కువ

కాళేశ్వరం కిస్తీ కంటే.. వడ్డీనే ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న అప్పు కింద కడుతున్న రీపేమెంట్​లో కిస్తీ కంటే వడ్డీనే ఎక్కువున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రీపేమెంట్ కింద మొత్తం రూ.15,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో కిస్తీ రూ.6 వేల కోట్లు కాగా, వడ్డీ రూ.6,500 కోట్లుగా ఉంది. ఇందుకోసం నెలకు సగటున రూ.1,300 కోట్లు బడ్జెట్ నుంచే చెల్లిస్తున్నట్టు ఆర్థిక శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. బడ్జెట్​లో చూపించకుండా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తీసుకున్న అప్పుల్లో కాళేశర్వమే టాప్​లో ఉండగా, ఇప్పుడు రీపేమెంట్​లోనూ అదే మొదటి స్థానంలో ఉంది. 

ప్రతినెలా ఉద్యోగులకు జీతాలు ఆలస్యమైనా పర్లేదు గానీ.. కాళేశ్వరం రీపేమెంట్​మాత్రం టైమ్​కు జమ చేయాలని ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు అందినట్టు తెలిసింది. భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్​ చేసుకుంటున్నది. అయితే ఆయకట్టు మాత్రం ఆ స్థాయిలో లేదని విమర్శలు వస్తున్నాయి. 

సీతారామ ప్రాజెక్టుకు 3 వేల కోట్లు కట్టాలె..  

కాళేశ్వరంతో పాటు సీతారామ వంటి వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడింది. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, గ్యారంటీ విధానంలో వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకుంది. కాళేశ్వరం కోసం రూ.97,447 కోట్లు అప్పు తీసుకుంది. దీనికి వడ్డీ కింద రూ.71,575 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంటే మొత్తం రూ.1.69 లక్షల కోట్లు చెల్లించాలి. కాళేశ్వరం రీపేమెంట్ పోయిన ఆర్థిక సంవత్సరం నుంచే మొదలైంది. ఇది ఏటేటా పెరుగుతూ పోతున్నది. ఇక సీతారామ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం దాదాపు రూ.20 వేల కోట్ల అప్పు తీసుకుంది. దీనికి సంబంధించిన రీపేమెంట్ కూడా మొదలైంది. ఈ ఏడాది రూ.3,200 కోట్లు కట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా ప్రతి నెలా రూ.267 కోట్లు కడుతున్నది. 

ఆదాయమంతా అప్పులకే.. 

రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో బడ్జేటేతర అప్పులు ఇష్టారీతిన చేసింది. ఇప్పుడు ఆ అప్పులను బడ్జెట్ నుంచే కట్టుకుంటూ వస్తున్నది. నిజానికి ప్రభుత్వానికి ఆదాయం బాగానే వస్తున్నప్పటికీ, అందులో ఎక్కువ మొత్తం అప్పుల చెల్లింపులకే పోతున్నది. దీంతో ఆదాయాన్ని సంక్షేమం కోసం వినియోగించలేని పరిస్థితి నెలకొన్నది. గ్యారంటీ అప్పులతో పాటు ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పులకూ ప్రభుత్వం చెల్లింపులు చేయాల్సి ఉన్నది. 

కేవలం బడ్జేటేతర అప్పులకు కిస్తీలు, వడ్డీల కిందనే ఈ ఆర్థిక సంవత్సరంలో కట్టాల్సిన మొత్తం రూ.60 వేల కోట్లుగా ఉంది. అంటే ప్రతినెలా సగటున రూ.5 వేల కోట్లు వాటికే పోతున్నది. కాగా, అప్పులు తీసుకున్నంత వేగంగా ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఒక్క కాళేశ్వరాన్ని మాత్రం ప్రారంభించి హడావుడి చేసింది. కానీ ఆ ప్రాజెక్టు కింద పంటలకు నీళ్లే అందడం లేదని, రూ.వేల కోట్లు నీళ్ల పాల్జేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.