కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల కోసమే

కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల కోసమే

టీ జర్నలిస్టుల ఫోరం సదస్సులో ఆల్​ పార్టీ లీడర్లు

ప్రశ్నించే గొంతులపై నిర్బంధాలేంది?

సంగమేశ్వరం కడితే పాలమూరుకు నీళ్లురావు: కోదండరాం

మేఘా.. ఈస్ట్‌‌ ఇండియా కంపెనీలా తయారైంది : రేవంత్​రెడ్డి

కేటీఆర్‌‌ను సీఎం చేసేందుకే ఏపీ ప్రాజెక్టులపై మౌనం: వివేక్‌‌

సమావేశంలో గంటకు పైగా కరెంట్​ కట్​

హైదరాబాద్‌‌, వెలుగు: కాంట్రాక్టర్ల కోసం, కమీషన్ల కోసమే ఇరిగేషన్​ ప్రాజెక్టులను సీఎం కేసీఆర్​ రీ డిజైన్  చేస్తున్నారని ఆల్​ పార్టీల లీడర్లు మండిపడ్డారు. కాళేశ్వరాన్ని రీ డిజైన్‌‌ చేయకపోతే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవని చెప్పారు. ప్రశ్నించే గొంతులపై ప్రభుత్వం నిర్బంధాలు విధిస్తున్నదని, దీనిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ‘కృష్ణా నది – తెలంగాణ పెండింగ్‌‌ ప్రాజెక్టులు’ అంశంపై టీ జర్నలిస్టు ఫోరం గురువారం హైదరాబాద్​లోని ఓ హోటల్​లో ఆల్​ పార్టీ మీటింగ్​ నిర్వహించింది.

కార్యక్రమంలో టీజేఎస్​ చీఫ్​ ప్రొఫెసర్​ కోదండరాం, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి, బీజేపీ కోర్‌‌‌‌ కమిటీ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కోదండరాం మాట్లాడుతుండగా హోటల్‌‌‌‌లో కరెంట్‌‌‌‌ పోయింది. దాదాపు గంటకుపైగా కరెంట్‌‌‌‌ లేకుండా చీకట్లోనే సమావేశం కొనసాగించారు.

ఒక వ్యక్తి ఇష్టానికి రీ డిజైన్లా?: కోదండరాం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచడంతో అన్ని ప్రాజెక్టులను పక్కన పెట్టాల్సి వచ్చిందని టీజేఎస్​ చీఫ్​ ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు.  కృష్ణా బేసిన్‌‌‌‌లోని ప్రాజెక్టులను నిర్మించాలంటే డబ్బులేదని చెప్తున్న ప్రభుత్వం రూ. 22 వేల కోట్లతో కాళేశ్వరం అడిషనల్‌‌‌‌ టీఎంసీ పనులకు టెండర్లు ఎలా పిలిచిందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రీ డిజైన్‌‌‌‌ చేయకపోతే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవని వివరించారు.  తెలంగాణ ఏర్పడిన ఆరేండ్ల తర్వాత కూడా నీటి వాటాలు తేలలేదని, అత్యంత కీలకమైన నీటి వాటాలపై చర్చించకుండా ఏపీ సీఎం జగన్‌‌‌‌తో కేసీఆర్‌‌‌‌ ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఏపీతో కలిసి గోదావరి – కృష్ణా లింక్‌‌‌‌ ప్రాజెక్టు పేరుతో ఇంకో రూ. లక్ష కోట్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి రాబోయే ఎన్నికలకు డబ్బు సమకూర్చుకోవాలని అనుకున్నారని ఆరోపించారు. ఇంజనీర్లు కాకుండా ఒక వ్యక్తి తన ఇష్టానికి ప్రాజెక్టులను ఎలా రీ డిజైనింగ్‌‌‌‌ చేస్తారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం రీ డిజైనింగ్‌‌‌‌ మాదిరిగానే పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి ఎందుకూ పనికి రాకుండా చేశారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకునే హైట్‌‌‌‌ను 821 అడుగులకు మార్చడం వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్​ చేశారు. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టుల డిజైన్‌‌‌‌ మారుస్తారా అని కోదండరాం నిలదీశారు. సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే పాలమూరుకు నీళ్లు వచ్చే అవకాశమే లేదన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌ తమ మాట వింటలేరని రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌ శ్యాంప్రసాద్‌‌‌‌రెడ్డి తమ వద్ద ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్లుగా తాము చెప్పేదానికన్నా గూగుల్‌‌‌‌ మ్యాప్‌‌‌‌లను కంప్యూటర్‌‌‌‌లో చూపించే ఆపరేటర్‌‌‌‌ మాటలకే కేసీఆర్‌‌‌‌ ఎక్కువ విలువనిస్తున్నారని శ్యాంప్రసాద్‌‌‌‌రెడ్డి వాపోయేవాడని ఆయన పేర్కొన్నారు.

తుది దశ ఉద్యమానికి రెడీ కావాలి: రేవంత్‌‌‌‌రెడ్డి

60 ఏండ్ల సమైక్య పాలకులకు మించి ఆరేండ్లలో కేసీఆర్‌‌‌‌ తెలంగాణ అస్తిత్వాన్ని విధ్వంసం చేశారని పీసీసీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌, ఎంపీ రేవంత్‌‌‌‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌‌‌‌ తాగునీటి కోసం నిజాం నవాబులు నిర్మించిన గండిపేట, హిమాయత్‌‌‌‌సాగర్‌‌‌‌ను కేసీఆర్‌‌‌‌ చంపేసి కేశవపూర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ కడుతున్నారని ఆయన అన్నారు. కేసీఆర్‌‌‌‌ను దించితే తప్ప పరిస్థితిలో మార్పు రాదని చెప్పారు. ఈస్ట్‌‌‌‌ ఇండియా కంపెనీ మాదిరిగా మేఘా కృష్ణారెడ్డి కంపెనీ తయారైందని, తెలంగాణను దోచుకోవడానికే ఆ కంపెనీ ఉందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన అనుభవాన్ని చూపించే కృష్ణారెడ్డి ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నాడని ఆయన చెప్పారు. ఉమ్మడి ఏపీలో కొట్లాడి సాధించుకున్న కొడంగల్‌‌‌‌ – నారాయణపేట లిఫ్ట్‌‌‌‌ ప్రాజెక్టుకు తెలంగాణ వచ్చిన తర్వాత పక్కన పెట్టారన్నారు. కేసీఆర్‌‌‌‌ పీడ నుంచి తెలంగాణకు శాశ్వత విముక్తి కోసం తుది దశ ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడిన జితేందర్‌‌‌‌రెడ్డి, వివేక్‌‌‌‌ లాంటి నేతలకు కాకుండా ఒక్కరోజు కూడా ‘జై తెలంగాణ’ అనని పారిశ్రామికవేత్తలకు కేసీఆర్‌‌‌‌ టికెట్లు ఇచ్చారని ఆయన మండిపడ్డారు.

అన్ని లిఫ్ట్​లు కలిసినా ఎత్తిపోసేది ఒక్క టీఎంసీనే: లక్ష్మీనారాయణ

ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ టన్నెల్‌‌‌‌ పూర్తి చేయకపోవడం వల్ల ఏటా రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లుతున్నదని రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌ లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీ రోజుకు గ్రావిటీ ద్వారా 10 టీఎంసీలకు పైగా నీటిని తరలించుకుపోతున్నదని, అన్ని లిఫ్ట్‌‌‌‌ స్కీంలు కలిసినా తెలంగాణ ఎత్తిపోసేది రోజుకు ఒక్క టీఎంసీ మాత్రమేనని చెప్పారు. తెలంగాణ వచ్చాక రూ. 11 వేల కోట్లు ఖర్చు పెడితే 34 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చి ఉండేవని, రూ. 30 వేల కోట్లు పెడితే పూర్తయ్యే ప్రాణహిత ప్రాజెక్టును రీ డిజైనింగ్‌‌‌‌ పేరుతో లక్ష కోట్లకు తీసుకుపోయారని  అన్నారు.

శ్యాంప్రసాద్‌‌‌‌రెడ్డి వర్సెస్‌‌‌‌ లక్ష్మీనారాయణ

పెండింగ్‌‌‌‌ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌‌‌‌రెడ్డి, దొంతుల లక్ష్మీనారాయణకు మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్లు డీపీఆర్‌‌‌‌లు, సర్వేల కోసం కేసీఆర్‌‌‌‌తో అంటకాగి రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తున్నారని లక్ష్మీనారాయణ అన్నారు. ఒక్క  డిండి ప్రాజెక్టు కోసమే ఏడు సార్లు సర్వే చేశారని చెప్పారు. దీంతో శ్యాంప్రసాద్‌‌‌‌రెడ్డి జోక్యం చేసుకొని వ్యక్తిగత విమర్శలు చేయొద్దని అడ్డుకున్నారు. ఇద్దరు రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్ల మధ్య వాగ్వాదం జరుగగా సమావేశానికి హాజరైన అనేక మంది లక్ష్మీనారాయణకు మద్దతు పలికారు. వారిద్దరికీ టీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్‌‌‌‌  సర్ది చెప్పారు.

కేటీఆర్‌‌‌‌ను సీఎం చేసి, జగన్‌‌‌‌ ఎంపీల బలంతో కేంద్రంలో ఉప ప్రధాని కావాలనే కేసీఆర్‌‌‌‌ పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంపై మాట్లాడటం లేదని బీజేపీ కోర్‌‌‌‌ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్‌‌‌‌ వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. జగన్‌‌‌‌ ఎంపీల మద్దతు కోసం కేసీఆర్‌‌‌‌ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. భారీ వర్షాలు కురిసి అన్ని ప్రాజెక్టులు నిండితే అవి కాళేశ్వరం నీళ్లేనని తప్పుడు వీడియోలు సర్క్యూలేట్‌‌‌‌ చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ధన సాయాన్ని తిరిగి రాబట్టుకోవడానికే సంగమేశ్వరం టెండర్ల ప్రక్రియ సాజావుగా సాగేందుకు కేసీఆర్‌‌‌‌ సహకరించారని విమర్శించారు. వైఎస్సార్​  సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44 వేల క్యూసెక్కులకు పెంచితే దానిపై ఎన్నో మాట్లాడిన కేసీఆర్‌‌‌‌ ఇప్పుడు మొత్తం కృష్ణా నీళ్లనే మళ్లించుకుపోతుంటే ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్‌‌‌‌ తాపత్రయ పడుతున్నారని అన్నారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులందరికీ ఒక్కో ఫామ్‌‌‌‌ హౌస్‌‌‌‌ కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల ద్వారానే వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్‌‌‌‌ దోపిడీని ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రూ. 60 వేల కోట్లున్న అప్పులను రూ. 3.60 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్‌‌‌‌దేనని విమర్శించారు. ప్రాజెక్టుల్లో కమీషన్ల రూపంలో దండుకున్న డబ్బులతో ఓట్లు కొనేందుకు కేసీఆర్‌‌‌‌ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఏకమై కృష్ణా నీళ్లలో దోపిడీ, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెంపుపై ముఖ్యమంత్రిని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.

10 లక్షల ఎకరాలకు మించి నీళ్లు రావు: శ్యాంప్రసాద్‌‌‌‌ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నా 10 లక్షల ఎకరాలకు మించి నీళ్లు రావని రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌ శ్యాంప్రసాద్‌‌‌‌ రెడ్డి అన్నారు. ఓపెన్‌‌‌‌ కెనాళ్లతో ప్రతిపాదించిన ఆయకట్టు మొత్తానికి నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. తెలంగాణలో కృష్ణా నదిపై చేపట్టిన అన్ని లిఫ్ట్‌‌‌‌ స్కీములను 90 వరద రోజులకు డిజైన్‌‌‌‌ చేశారని, వాటిని 30 వరద రోజులకు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.   ఇందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.

సీనియర్‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌ పాశం యాదగిరి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఖజానాను కొల్లగొట్టే ‘‘ఖాళీ’’శ్వరం అని విమర్శించారు. పోతిరెడ్డిపాడు విస్తరణ, ఏపీ అక్రమ ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత,  మాజీ ఎంపీ జితేందర్‌‌‌‌రెడ్డి అన్నారు. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లో సదస్సు నిర్వహించాలని జర్నలిస్టుల ఫోరం నేతలను ఆహ్వానించారు. టీ జర్నలిస్ట్‌‌‌‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్‌‌‌‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు వంశీచంద్‌‌‌‌రెడ్డి, ఎల్‌‌‌‌. రమణ, చెరుకు సుధాకర్‌‌‌‌, గోవర్ధన్‌‌‌‌, అజీజ్‌‌‌‌ పాషా, కత్తి వెంకటస్వామి, ఇందిరా శోభన్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.

నీళ్లలోంచి నిప్పులు మొలుస్తయ్​: నాగయ్య

కృష్ణా నదినే పెన్నా బేసిన్‌‌‌‌కు మళ్లించుకుపోయేందుకు ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అని సీఎం అంటారా? అని తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య ప్రశ్నించారు. కృష్ణా నీళ్ల విషయంలో తెలంగాణకు అనేక అన్యాయాలు జరిగాయని గుర్తుచేశారు. బ్రజేశ్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ ద్వారా అక్రమ ప్రాజెక్టులను సక్రమం చేసుకునేందుకే జగన్‌‌‌‌ ఒకేసారి భారీ మొత్తంలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ టైమ్‌‌లో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులే ఇవ్వడం లేదని అన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై అందరికన్నా తామే ముందుగా కేంద్రానికి కంప్లైంట్‌‌‌‌ చేశామని చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన ఆరేండ్ల తర్వాత కూడా నీటి వాటాలు తేలలేదు. అత్యంత కీలకమైన నీటి వాటాలపై చర్చించకుండా ఏపీ సీఎం జగన్‌‌తో కేసీఆర్‌‌ ఏం మాట్లాడారో చెప్పాలి. ఏపీతో కలిసి గోదావరి – కృష్ణా లింక్‌‌ ప్రాజెక్టు పేరుతో ఇంకో రూ. లక్ష కోట్ల ఎత్తిపోతల స్కీమ్​ను చేపట్టి రాబోయే ఎన్నికలకు డబ్బు సమకూర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇంజనీర్లు కాకుండా ఒక వ్యక్తి తన ఇష్టానికి ప్రాజెక్టులను ఎలా రీ డిజైన్​ చేస్తారు?  కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులపై తీవ్ర నిర్బంధం ఉంది.

– ప్రొఫెసర్​ కోదండరాం, టీజేఎస్​ చీఫ్

వైఎస్సార్​  సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44 వేల క్యూసెక్కులకు పెంచితే దానిపై ఎన్నో మాట్లాడిన కేసీఆర్‌‌ ఇప్పుడు మొత్తం కృష్ణా నీళ్లనే మళ్లించుకుపోతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్‌‌ తాపత్రయపడుతున్నరు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులందరికీ ఒక్కో ఫామ్‌‌ హౌస్‌‌ కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్లతోనే వచ్చింది.

– వివేక్‌‌ వెంకటస్వామి, బీజేపీ కోర్‌‌ కమిటీ మెంబర్​

ఈస్ట్‌‌ ఇండియా కంపెనీ మాదిరిగా మేఘా కృష్ణారెడ్డి కంపెనీ తయారైంది. తెలంగాణను దోచుకోవడానికే ఈ కంపెనీ ఉంది. సెక్రటేరియట్‌‌, అసెంబ్లీ, శ్రీశైలం పవర్‌‌ హౌస్‌‌ ఇలా అన్నింటిని విధ్వంసం చేసి చరిత్రను తెరమరుగు చేస్తున్నారు.  గండిపేట, హిమాయత్‌‌ సాగర్‌‌ను కేసీఆర్‌‌ చంపేసి కేశవపూర్‌‌ రిజర్వాయర్‌‌ కడుతున్నారు. కేసీఆర్‌‌ను దించితే తప్ప పరిస్థితిలో మార్పు రాదు.

రేవంత్‌‌రెడ్డి, ఎంపీ, పీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌