- ఎన్డీఎస్ఏ
- ఫైనల్ రిపోర్ట్స్ఇవ్వడంలో జాప్యం చేస్తున్న ఎన్డీఎస్ఏ
- లేఖ రాసినా.. మంత్రి ఢిల్లీ వెళ్లి కలిసినా స్పందించట్లే
- మేడిగడ్డ బ్యారేజీ వద్ద టెస్టులను సాకుగా చూపుతూ లేట్
- రాజీవ్‌రతన్ మరణం, బాస్‌ల మార్పులతో విజిలెన్స్ రిపోర్ట్ ఆలస్యం
- ఆ నివేదికలు వచ్చాకే కమిషన్ ఫైనల్ యాక్షన్ రిపోర్ట్ రెడీ
హైదరాబాద్, వెలుగు: రెండు ఫైనల్ రిపోర్ట్స్ వస్తేనే కాళేశ్వరం జ్యుడీషియల్ ఎంక్వైరీ ముందుకు సాగనున్నది. వివిధ కారణాలతో ఎన్డీఎస్ఏ, విజిలెన్స్రిపోర్ట్లు ఆలస్యం కావడంతో విచారణపై ఎఫెక్ట్ పడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ దాదాపు చివరి దశకు చేరుకుంటున్నది. అధికారులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ జరుపుతున్నది. రెండు వారాల్లో అధికారుల విచారణ పూర్తి చేయాలని భావిస్తున్నది.
అనంతరం ప్రభుత్వానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలన్న యోచనలో కమిషన్ ఉన్నది. అయితే, ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ), విజిలెన్స్ డిపార్ట్మెంట్ల తుది నివేదికలు ఆలస్యమవుతుండడంతో జ్యుడీషియల్ కమిషన్ ఫైనల్ రిపోర్ట్ కూడా లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రెండు నివేదికలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా జ్యుడీషియల్ కమిషన్ ఎంక్వైరీ కూడా పూర్తవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్డీఎస్ఏ రిపోర్టు మస్తు లేటు
మేడిగడ్డ బ్యారేజ్‌కు జరిగిన డ్యామేజ్‌పై తుది నివేదిక ఇవ్వడంలో ఎన్డీఎస్ఏ తీవ్ర జాప్యం చేస్తున్నది. బ్యారేజీ పరిశీలన దగ్గర్నుంచి.. రిపోర్టు ఇచ్చే విషయం వరకు తాత్సారమే చేసింది. నిరుడు అక్టోబర్‌లో బ్యారేజీ కుంగితే ఈ ఏడాది మార్చి నెలలోగానీ ఎన్డీఎస్ఏ అధికారులు రాష్ట్రానికి రాలేదు. అధికారులను విచారించిన చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ.. ఆ తర్వాత రిపోర్ట్ విషయంలోనూ అంతే లేట్ చేసింది. మే మూడో వారంలో మధ్యంతర నివేదికను ఇచ్చింది.
వాస్తవానికి మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి రెండు వారాల ముందు సిక్కింలోనూ వరదలు వచ్చి తీస్తా డ్యామ్ కొట్టుకుపోయింది. అక్కడ మరో రెండు డ్యాములూ దెబ్బ తిన్నాయి. ఆయా డ్యాములను వెనువెంటనే పరిశీలించిన ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డ బ్యారేజీపై మాత్రం వేగంగా స్పందించలేదు. మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజ్‌ను కేటగిరీ 1 నుంచి కేటగిరీ 5 కింద మెన్షన్ చేసినా.. పరిశీలన దగ్గర్నుంచి రిపోర్టుల వరకు ఎన్డీఎస్ఏ ఆలస్యంగానే రెస్పాండ్ అవుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తుది నివేదిక విషయంలోనూ అదేతీరుగా వ్యవహరిస్తున్నది.
రిపోర్ట్ కోసం ఎన్డీఎస్ఏ అధికారులకు కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ లేఖ రాసినా ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదు. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ సాయిల్, మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్లు టెస్టులు చేసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్ఏ అధికారులతో భేటీ అయి.. రిక్వెస్ట్ చేసినా టెస్టుల పేరుతో కాలయాపన చేస్తున్నది. రిపోర్టుపై కనీసం పని చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని టెస్టులు మినహా మిగతా రిపోర్టులన్నీ ఎన్డీఎస్ఏ అధికారులకు ఇచ్చేశామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వరదలు రావడంతో పలు టెస్టులు ఆలస్యమవుతున్నాయని, వాటిని కూడా చేస్తున్నామని అంటున్నారు. మధ్యంతర నివేదికలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులన్నింటినీ చేశామని, వారి రిపోర్టు కోసమే వేచి చూస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ నుంచి రిపోర్ట్ వస్తేగానీ ముందుకు వెళ్లే పరిస్థితి లేదని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీ భేటీలోనూ ఇదే విషయాన్ని ఎన్డీఎస్ఏ అధికారులకు మంత్రి ఉత్తమ్ చెప్పినా.. టెస్టుల రిపోర్టులు వస్తేగానీ తుది నివేదికను ఇవ్వలేమని చెప్పింది. డిసెంబర్ వరకు ఫైనల్ రిపోర్ట్ ఇస్తామని చెబుతున్నా.. అప్పటికైనా నివేదిక ఇస్తారా? ఇవ్వరా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విజిలెన్స్ రిపోర్ట్‌కు అనుకోని అడ్డంకి
కాళేశ్వరం కమిషన్ విచారణకు విజిలెన్స్ రిపోర్టు కూడా బ్రేకులు వేస్తున్నది. విజిలెన్స్ మాజీ బాస్ రాజీవ్ రతన్ అకాల మరణం, పలుమార్లు బాస్‌లు మారడం వంటి కారణాలతో విజిలెన్స్ రిపోర్ట్ కూడా లేట్ అవుతున్నది. మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీపై ఈ ఏడాది జనవరిలో విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ ప్రారంభించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అప్పటి డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్.. విచారణకు నేతృత్వం వహించారు.
మేడిగడ్డలో కుంగిన ఏడో బ్లాక్‌లోని పియర్లు సహా బ్యారేజీ మొత్తాన్ని పరిశీలించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సీపేజీలపైనా దర్యాప్తు చేశారు. జలసౌధలో అధికారులను విచారించి, పలు రికార్డులనూ స్వాధీనం చేసుకున్నారు. విచారణ జరుగుతున్న క్రమంలోనే ఏప్రిల్ 9న రాజీవ్ రతన్ హఠాన్మరణం చెందడంతో విజిలెన్స్ రిపోర్టుపైనా ఎఫెక్ట్ పడింది. ఆయన మరణం తర్వాత జూలైలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ డీజీగా సీవీ ఆనంద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ మధ్యంతర రిపోర్ట్కావాలని అడగడంతో.. ఆగస్టులో కమిషన్ ముందు హాజరై సీవీ ఆనంద్ రిపోర్ట్‌ను సమర్పించారు. ప్రస్తుతం డిపార్ట్మెంట్కు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని డీజీగా నియమించారు. ప్రస్తుతం అధికారుల విచారణను కొనసాగిస్తున్నారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్
తుది నివేదిక కూడా రెండు నెలల్లో వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.