ఆపత్కాలంలోనూ కాళేశ్వరం అక్కరకొస్తలె..కాల్వలు తవ్వలే.. నీళ్లు ఇయ్యలే.. 

ఆపత్కాలంలోనూ కాళేశ్వరం అక్కరకొస్తలె..కాల్వలు తవ్వలే.. నీళ్లు ఇయ్యలే.. 
  • ప్రాజెక్టును ప్రారంభించి ఇయ్యాల్టితో నాలుగేండ్లు పూర్తి
  • తాజాగా వర్షాభావ పరిస్థితులు.. తీరా ఎత్తిపోద్దామంటే నీళ్లు లేవు
  • ఈ నాలుగేండ్లలో ఎత్తిపోయాల్సింది 900 టీఎంసీలు 
  • ఎత్తిపోసింది 155 టీఎంసీలే.. అందులో 50 టీఎంసీలు కిందికే 
  • నేటికీ శ్రీరాంసాగర్​ ప్రాజెక్టే నంబర్​వన్​
  • ఇప్పటికీ బోర్లు, బావుల కిందే అత్యధిక సాగు
  • వర్షాల కోసం తప్పని రైతుల ఎదురుచూపులు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/నెట్​వర్క్, వెలుగు: వర్షాలు పడినప్పుడు కాదు, కరువు వచ్చినప్పుడు తెలుస్తది కాళేశ్వరం విలువ’’.. ఇదీ సీఎం కేసీఆర్​ సహా మంత్రులంతా తరచూ చెప్పే మాట. కొన్నేండ్లుగా జూన్​ ప్రారంభం నుంచే వానలు పడ్తున్నాయి.. కానీ, ఈ సారి జూన్​లో మూడువారాలు గడిచిపోయినా చుక్క వర్షం పడలేదు. అంటే ఒక రకంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సర్కారు కూడా ముందస్తు సాగుచేయాలనడంతో మృగశిరకే పత్తి, మక్క, కంది తదితర విత్తనాలు వేసిన రైతులు.. వర్షాల కోసం మొగులుకేసి ఆశగా చూస్తున్నారు. కొన్నిచోట్ల మొలకలను కాపాడుకునేందుకు బిందెలతో నీళ్లు పోస్తున్నారు. ఇలాంటి టైమ్​లో కాళేశ్వరం ద్వారా నీళ్లిచ్చి రైతులను ఆదుకోవచ్చు కదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ, వాస్తవం ఏమిటంటే లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంలోనే ఇప్పుడు నీళ్లు లేవు. కీలకమైన మేడిగడ్డ బ్యారేజీలో ప్రస్తుతం ఉన్నది 1.9 టీఎంసీలే!  

ఏనాడూ లక్ష్యం చేరలే

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ను‌‌ 2019 జూన్‌‌‌‌ 21న కేసీఆర్‌‌‌‌ ఘనంగా ప్రారంభించారు. 17 బాహుబలి మోటార్ల సాయంతో రోజుకు 3 టీఎంసీల చొప్పున ఏటా 225 టీఎంసీల నీళ్లను లిఫ్ట్‌‌‌‌ చేసి సుమారు 40 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. 

ఇందులో ఏకంగా18 లక్షల 25 వేల ఎకరాల కొత్త ఆయకట్టు ఉంది. ఈ లెక్కన గడిచిన నాలుగేండ్లలో మేడిగడ్డ బ్యారేజ్‌‌‌‌ నుంచి 900 టీఎంసీల నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 155 టీఎంసీల నీళ్లు లిఫ్ట్‌‌‌‌ చేశారు. ఎత్తిపోశాక వరదలు రావడంతో 50 టీఎంసీల నీళ్లను వృథాగా కిందికి వదిలేశారు. కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు అత్యధికంగా సాగైన కొత్త ఆయకట్టు కేవలం  74 వేల ఎకరాల్లోనే. అదీ గడిచిన యాసంగిలోనే!  రాష్ట్ర సర్కారు నాలుగేండ్లు మోటార్లు నడిపించినప్పటికీ ఏనాడూ లక్ష్యం చేరలేదు. నిజానికి వానాకాలం భారీ వర్షాలు పడితే ఒక్కపెట్టున ఎల్లంపల్లి నిండుతుంది. దీంతో అప్పటికే ఎత్తిపోసిన నీటిని దిగువకు వదిలేయాల్సి వస్తుంది. పోనీ సీజన్​ చివర్లో ఎత్తిపోద్దామంటే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉంటలేదు. 2019‒20లో మాత్రమే అత్యధికంగా 60 టీఎంసీల నీళ్లను లిఫ్ట్‌‌‌‌ చేశారు. 2020–-21లో 36 టీఎంసీలు, 2021‒22 లో 34 టీఎంసీలు ఎత్తిపోశారు. కాగా, గతేడాది గోదావరి వరదలకు కన్నెపల్లి, అన్నారం పంప్‌‌‌‌హౌజ్‌‌ లు నీట మునిగాయి. మోటార్లను రిపేర్‌‌‌‌ చేసి 25 టీఎంసీల నీళ్లను లిఫ్ట్‌‌‌‌ చేసినట్లు ఆఫీసర్లు చెప్పారు. ప్రతి సీజన్​లో18 లక్షల 25 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లివ్వాల్సి ఉన్నా 2021-–22 వానాకాలం సీజన్‌‌లో తొలిసారి 57 వేల ఎకరాలకు, 2022–23 యాసంగి సీజన్​లో 74,200 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చినట్లు ఇరిగేషన్​ ఆఫీసర్లు ప్రకటించారు.  

కాల్వలు తవ్వలే.. నీళ్లు ఇయ్యలే.. 

లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి నాలుగేండ్లవుతున్నా పొలాలకు నీళ్లిచ్చే కెనాల్స్​నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు.  మొత్తం 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టగా.. కేవలం సీఎం సొంత జిల్లా సిద్దిపేటకు నీళ్లిచ్చే లింక్- 4, 5, 6 పనులు మాత్రం యుద్ధప్రాతిపదికన కంప్లీట్​చేశారు. 10 నుంచి19 ప్యాకేజీల కింద మెయిన్​ కెనాల్స్​ నిర్మించి కొమురవెల్లి మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్​కు నీళ్లు తీసుకుపోతున్నారు. కానీ, కాళేశ్వరం పక్కనే ఉన్న పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని లింక్- 1 పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ఈ రెండు జిల్లాల పరిధిలో 30 వేల ఎకరాలకు సాగునీరిస్తామని ప్రాజెక్టు ప్రారంభం రోజే సీఎం ప్రకటించినా.. ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం కోసం ఎలాంటి భూమీ సేకరించలేదు. కాళేశ్వరం కోసం భూములు త్యాగం చేసిన ఈ రెండు జిల్లాల రైతులు.. బ్యాక్​వాటర్ వల్ల నాలుగేండ్లుగా పంటలు కోల్పోతున్నారు. ఇంతా చేస్తే కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకపోవడంపై రెండు జిల్లాల్లోని రైతులు సర్కారుపై మండిపడ్తున్నారు. పలు ప్రాంతాల్లో వివిధ ప్యాకేజీల కింద  మెయిన్​కెనాల్స్​, టన్నెల్స్ నిర్మాణం మొదలుపెట్టినా ఫండ్స్ లేక నత్తనడకన సాగుతున్నాయి. చాలా జిల్లాల్లో భూసేకరణ కూడా పూర్తికాలేదు.  2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు, ఇక 18 లక్షల 25 వేల700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిస్తామని సీఎం  చెప్పినప్పటికీ.. సిద్దిపేట జిల్లా, దాని పరిసర జిల్లాల్లో తప్ప ఎక్కడా కొత్తగా ఒక్క ఎకరాకు కూడా కాళేశ్వరం ద్వారా నీళ్లందడం లేదు. 

ముందస్తు సాగన్నరు.. సైలెంట్​ అయిన్రు

వానాకాలంలో వరదలు, కుంభవృష్టి వల్ల జరుగుతున్న పంట నష్టాన్ని తగ్గించేందుకు ఈసారి సాగు సీజన్‌‌‌‌ను నెల రోజులు ముందుకు జరపాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రైతులంతా ముందస్తు సాగుచేపట్టాలని వ్యవసాయశాఖ ద్వారా ప్రచారం చేసింది. అవసరమైతే కాళేశ్వం ద్వారా ప్రాజెక్టులను నింపి, కాల్వ నీళ్లు ఇస్తామని చెప్పుకొచ్చింది. దీంతో రైతులు మృగశిరకే పత్తి, కంది, మక్క తదితర విత్తనాలు వేయడం ప్రారంభించారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఇప్పటికే సుమారు 30 లక్షల ఎకరాల్లో పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలు వేసుకున్నారు. తీరా జూన్ ​నాలుగో వారంలోకి అడుగుపెడ్తున్నా రాష్ట్రంలో వానల జాడలేదు. అటు భూగర్భజలాలు కూడా అడుగంటడంతో రైతులు మొగులుకేసి చూస్తున్నారు. 

సాగునీటి ప్రాజెక్టుల్లోనూ 30 శాతానికి మించి నీళ్లు లేకపోడంతో కాల్వనీళ్లు వస్తలేవు. దీంతో వరినార్లు పోసుకునేందుకు రైతులు వెనుకాముందాడుతున్నారు. ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్​గతంలో చెప్పినట్లు కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపి, పొలాలకు నీళ్లివ్వాలి. కానీ, తీరా చూస్తే ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 1.9 టీఎంసీలకు మించి నీళ్లు లేవు. ప్రాణహిత నదిలో రోజుకు 800 క్యూసెక్కులకు మించి వరద రావట్లేదు. కరువు కాలం వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ విలువ తెలుస్తుందని ఇన్నాళ్లూ చెప్పిన ప్రభుత్వ పెద్దలంతా ఇప్పుడు నోరు విప్పడం లేదు. దీంతో సర్కారు మాటలు నమ్మి ముందస్తు విత్తనాలు వేసిన రైతులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

బోర్లు ఏసుడు తగ్గలే.. మొగులుదిక్కు సూసుడు ఆగలే

తెలంగాణలో కోటిన్నర ఎకరాలు సాగవుతుండగా, ఇందులో వివిధ ప్రాజెక్టుల కింద నీళ్లిస్తున్నది కేవలం 40 లక్షల ఎకరాలకేనని ఇరిగేషన్​ శాఖ లెక్కలు చెప్తున్నాయి. దీంతో మెజారిటీ రైతులు ఇప్పటికీ బోర్లు, బావులపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన 2014లో రాష్ట్రవ్యాప్తంగా19.03 లక్షల బోర్లు, బావులు ఉండగా.. గడిచిన తొమ్మిదేండ్లలో రైతులు కొత్తగా 8.46 లక్షల బోర్లు, బావులు తవ్వినట్లు, వాటికి కరెంట్​ కనెక్షన్​ ఇచ్చిన విద్యుత్ శాఖ ఇటీవల వెల్లడించింది. ఒక్కో బోరు, బావి కింద సగటున రెండున్నర ఎకరాలకు నీళ్లు అందుతాయి. ఈలెక్కన రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 60 లక్షల ఎకరాల భూమి బోర్లు, బావుల కిందే సాగవుతున్నది. అంటే మరో 50 లక్షల ఎకరాలకు వర్షాలే దిక్కవుతున్నాయి.

అత్యధికంగా సాగైంది  74వేల ఎకరాలే.. 

రాష్ట్రంలో కాళేశ్వరమే అతి పెద్ద ప్రాజెక్టు అని, 40 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చి, తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని సర్కారు చెప్పుకుంటున్నా అవన్నీ వట్టిమాటలేనని ఈ నాలుగేండ్ల ఇరిగేషన్​ లెక్కలు చెప్తున్నాయి.  ఏటా సాగునీటి కేటాయింపులకు సంబంధించి రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న శివమ్​ కమిటీ మీటింగుల ద్వారా ఈ విషయం స్పష్టమవుతున్నది. నిరుడు డిసెంబర్​లో జరిగిన శివమ్ ​కమిటీ మీటింగ్​లో, ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేసిన తెలంగాణ స్టాటిస్టికల్​ అబ్​స్ట్రాక్ట్ ​-2022 రిపోర్టులోనూ కాళేశ్వరం లోగుట్టు బట్టబయలైంది. నిరుడు వానాకాలంలో వివిధ ప్రాజెక్టుల కింద 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వగా.. యాసంగిలో కేవలం 36 లక్షల ఎకరాలకే నీళ్లిచ్చారు. యాసంగిలో  అత్యధికంగా ఎస్సారెస్పీ కింద 8 లక్షల ఎకరాలకు, నాగార్జునసాగర్​ కింద 6 లక్షల ఎకరాలకు సాగునీరివ్వగా, కాళేశ్వరం కింద ఇచ్చింది కేవలం 74,200 ఎకరాలకే. దీన్ని బట్టి రైతులకు ఇస్తున్న సాగునీటిలో కాళేశ్వరం వాటా అత్యల్పం కాగా..  ఎప్పట్లాగే ఎస్సారెస్పీనే నంబర్​వన్​ ప్రాజెక్టుగా నిలిచింది.