కాళేశ్వరం ఈ సారీ అక్కరకు రానట్టే..కేసీఆర్​ సమీక్షతో ప్రాజెక్టు అసలు కథ తేటతెల్లం

కాళేశ్వరం ఈ సారీ అక్కరకు రానట్టే..కేసీఆర్​ సమీక్షతో ప్రాజెక్టు అసలు కథ తేటతెల్లం
  • కాళేశ్వరంలో ఇద్దామన్నా నీళ్లు లేవ్ 
  • ఇసుక తవ్వకాలకు మేడిగడ్డ  ఖాళీ 
  • ప్రాణహిత నుంచి ప్రవాహాల్లేవ్
  •  సొంత జిల్లాకు నీళ్లిచ్చేందుకేనా సీఎం రివ్యూ?

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ​డ్రీమ్ ​ప్రాజెక్టు కాళేశ్వరం ఈ ఏడాదీ రైతులకు అక్కరకు రాదని తేలిపోయింది. కేసీఆర్ సోమవారం నిర్వహించిన రివ్యూతో ఈ ప్రాజెక్టు అసలు కథ తేటతెల్లమైంది. కాళేశ్వరంలో ఇద్దామన్నా నీళ్లే లేవు. కేవలం ఇసుక తవ్వుకోవడం కోసం మేడిగడ్డ బ్యారేజీని ఖాళీ చేశారు. ప్రస్తుతం ఈ బ్యారేజీలో 2 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. మరోవైపు ప్రాణహిత నుంచి ప్రవాహాలు ఇంకా మొదలు కాలేదు. కేవలం 850 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. ఎగువన వర్షాలు లేకపోవడంతో ప్రాణహిత, వైన్​గంగా, వార్ధా నదులన్నీ వట్టిపోయాయి. ఎల్లంపల్లిలో 12 టీఎంసీలు ఉన్నా హైదరాబాద్​ తాగునీటితో పాటు మిషన్​ భగీరథ అవసరాల కోసం ఇప్పట్లో వాటిని లిఫ్ట్​ చేయరాదని నిర్ణయించారు. ఎస్సారెస్పీలో 20.39, కడెంలో 3.21 టీఎంసీలున్నాయి. వర్షాలు కురిసి, అవి నిండితే తప్ప వాటి ఆయకట్టుకు నీళ్లివ్వలేని పరిస్థితి.

సీఎం సొంత జిల్లాకు..

మిడ్​మానేరులో 19.66 టీఎంసీలు ఉన్నాయి. ఎస్సారెస్పీ స్టేజ్​–1 పరిధిలోని ఐదు లక్షల ఎకరాలకు ఈ నీళ్లను ఆగస్టు నెలాఖరు వరకు ఇచ్చే అవకాశం ఉన్నా కేసీఆర్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కానీ అందులోంచి 2 టీఎంసీల నీళ్లను అర్జెంట్​గా తన సొంత జిల్లా సిద్దిపేటకు ప్రయోజనం చేకూర్చేందుకు రంగనాయకసాగర్​కు ఎత్తిపోయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్​లో 10.75, కొండపోచమ్మ సాగర్​లో 8.88 టీఎంసీలు ఉన్నాయి. కేసీఆర్ సొంత ఇలాఖాకు నీళ్లివ్వడానికి ఇవి సరిపోతాయి. గోదావరి బేసిన్​లోని ప్రాజెక్టుల్లో ఒక్క సింగూరులోనే ఆశాజనకంగా నీళ్లున్నాయి. దాని కింద పెద్దగా ఆయకట్టు లేదు. ఆగస్టులో కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ కెనాల్, టన్నెల్​మీదుగా హల్దీ వాగుకు నీళ్లు తరలించి నిజాంసాగర్​కు ఐదు టీఎంసీలు ఇవ్వాలని కేసీఆర్ ​ఆదేశించారు. అప్పటి వరకు వర్షాలు కురిస్తే ఈ నీళ్లు ఇవ్వాల్సిన అవసరమే రాదు. నిజాంసాగర్​లో డెడ్ ​స్టోరేజీ పోను 2.50 టీఎసీంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ నీళ్లను ఆయకట్టుకు మూడు తడులుగా ఇచ్చేందుకు​ ప్లాన్​ చేస్తున్నారు. నిజాంసాగర్​ ఆయకట్టుతో పాటు కేసీఆర్​ సొంత జిల్లాకు మాత్రమే నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు.

ఎస్సారెస్పీ పునరుజ్జీవంతోనూ..

ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లిచ్చే పేరుతో సీఎం రివ్యూ నిర్వహించారు. కానీ ఏ ప్రాజెక్టులోనూ సరిపడా నీళ్లు లేకపోవడంతో నీటి విడుదల ఇప్పట్లో వద్దని ఆదేశించారు. వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండితే తప్ప ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోలేమని, అందుబాటులో ఉన్న నీటిని తాగు అవసరాల కోసమే వాడుకోవాలని తేల్చిచెప్పారు. రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతోనూ ఎలాంటి ఉపయోగం లేదని తేలిపోయింది. ఏటా ఎస్సారెస్పీకి ఆగస్టులో వరద వస్తుంది. నాలుగేళ్లుగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఈసారీ వరద బాగానే వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఆగస్టులో పునరుజ్జీవం ఎత్తిపోతలు ఉత్తిమాటే అని ఇంజనీర్లు చెప్తున్నారు.