కాళేశ్వరం రోడ్డుకు అటవీ చిక్కులు

కాళేశ్వరం రోడ్డుకు అటవీ చిక్కులు
  •     అటవీ శాఖకు భూములు అప్పగించడంతో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం
  •     జాయింట్​ సర్వే జరిగితేనే ఫారెస్ట్​ క్లియరెన్స్​
  •     మహదేవపూర్ టు కాళేశ్వరం రోడ్డు వెడల్పుకు రూ.160 కోట్లు 
  •     నాలుగేళ్లుగా మూలుగుతున్న నిధులు 
  •     ఇరుకు రోడ్డుతో అవస్థలు

జయశంకర్​ భూపాలపల్లి/ మహదేవపూర్, వెలుగు : కాళేశ్వర క్షేత్రానికి వెళ్లే రహదారి నిర్మాణానికి అటవీ చిక్కులు ఏర్పడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. దీంతో ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనుల కోసం నిధులు కేటాయించి, పనులు మొదలుపెట్టింది. ఈ పనులు నాలుగేళ్లుగా ముందుకు సాగడం లేదు. 

రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో  పనుల్లో కదలిక లేదనే విమర్శలు ఉన్నాయి. ఇరుకుగా ఉన్న రోడ్డు, గుంతలమయంగా మారడంతో భక్తులు అవస్తలు పడుతున్నారు. ఈ ఏడాది మే 21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ఉండడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా రోడ్డు విస్తరణ చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

రోడ్డు విస్తరణకు రూ.160 కోట్లు.. 

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రానికి వెళ్లే రోడ్డు విస్తరణకు ప్రభుత్వం 2022లో రూ.160 కోట్లు కేటాయించింది. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు 17 కి.మీ ఉన్న బీటీ రోడ్డు 15 కిలోమీటర్ల వరకు అటవీ సరిహద్దుల్లోనే ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు అడ్డంకిగా మారింది. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు 10 మీటర్ల వెడల్పుతో రహదారి విస్తరణతో పాటు 22 బాక్స్ కల్వర్టులు, 22 పైపు కల్వర్టుల నిర్మాణం, ప్రమాదకరంగా ఉన్న 10 టర్నింగ్ పాయింట్ల వద్ద రే లైనింగ్ చేపట్టేందుకు ప్లానింగ్ రెడీ చేశారు. 15 కిలోమీటర్ల అటవీ భూమిలో 109 రకాలైన 7529 వృక్షాలు తొలగించాలని అటవీశాఖ లెక్క కట్టింది. 

ఈ వృక్షాల విలువ రూ.2.67 కోట్లుగా అంచనా వేశారు. భూమికి బదులు భూమి అటవీ శాఖకు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఓ ఏజెన్సీ అటవీ శాఖకు పైసలు చెల్లించాల్సి ఉంది. భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, గణపురం మండలంలో 22 హెక్టార్ల భూమిని కూడా కేటాయించారు. రెవెన్యూ, అటవీ శాఖల జాయింట్ సర్వేలు చేపట్టి అప్పగించాల్సి ఉండగా, సమన్వయ లోపంతో  పనులు ముందుకు సాగడం లేదు. సర్వే జరిపితేనే ఫారెస్ట్​ క్లియరెన్స్​ వస్తుందని ఆఫీసర్లు  చెబుతున్నారు. 

పుష్కరాల నాటికైనా అనుమతులు వచ్చేనా..?

ఈ ఏడాది మే 21నుంచి సరస్వతి అంత్య పుష్కరాలతో పాటు వచ్చే ఏడాది జులైలో గోదావరి పుష్కరాల నిర్వహణకు త్రివేణి సంగమం  సన్నద్ధమవుతుంది. పుష్కర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతుతున్నారు. మహరాష్ట్ర అంతర్రాష్ట్ర వంతెనతో పాటు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి భక్తుల తాకిడి నిత్యం ఉంటుంది. 

మేడిగడ్డ ప్రాజెక్టు, పంపుహౌస్ వెళ్లే వాహనాల రాకపోకలతో రోడ్డు రద్దీ తీవ్రత పెరిగింది. దీనికి తోడు పుణ్యస్నానాలు, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలతో ఇరుకుగా ఉన్న రోడ్డు, ప్రమాదకర మూలమలుపులతో ప్రమాదాలు జరుగుతున్నాయి. త్వరగా రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. 

క్లియరెన్స్ లేక పనులకు బ్రేక్..

మహదేవపూర్​ టు కాళేశ్వరం రోడ్డు విస్తరణ పనులకు అటవీశాఖ క్లియరెన్స్ లేక పనులు ముందుకు సాగడం లేదు. అనుమతులు ఇవ్వాలని పలుమార్లు అటవీశాఖ ఆఫీసర్లకు కోరాం. అనుమతులు రావడమే ఆలస్యం పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నాలుగేళ్ల కింద రోడ్డు విస్తరణకు, కల్వర్టుల నిర్మాణాలకు నిధులు కేటాయింపు జరిగింది.  
- మనోహర్, ఎన్ హెచ్ ఈఈ