ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

బెల్లంపల్లి/బెల్లంపల్లి రూరల్,వెలుగు: కేసీఆర్ తోనే తెలంగాణ, కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. శుక్రవారం బెల్లంపల్లి బాలికల జూనియర్ కాలేజీ హాస్టల్, కాసిపేట, తాండూరు మండలాల్లో మోడల్​స్కూల్, హాస్టల్​భవనాలు ప్రారంభించారు. బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్​కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. బీజేపీ లీడర్లు సీఎం కేసీఆర్​కుటుంబం, ప్రభుత్వాన్ని టార్గెట్​చేసి మాట్లాడడం సరికాదన్నారు. బండి సంజయ్​ రాష్ట్ర  ప్రభుత్వాన్ని విమర్శించడం మాని వంటగ్యాస్​ ధర తగ్గించాలని మాట్లాడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని మంత్రి చెప్పారు.  

పేద విద్యార్థులు సైతం విదేశాల్లో చదువుకునేలా రూ. 20 లక్షలు అందిస్తోందన్నారు. రాష్ట్ర అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ఎంపీ వెంకటేశ్​నేత, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కఅరుణ, కలెక్టర్​ భారతిహోళి కేరి, ఆర్డీవో శ్యామాలాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ప్రవీణ్, జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ మనుగడ కోసమే కేసీఆర్​ జిమ్మిక్కులు

భైంసా,వెలుగు: రాజకీయ మనుగడ కోసమే కేసీఆర్​రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారని బీజేపీ ఆదిలాబాద్​ పార్లమెంట్​కన్వీనర్​అయ్యన్నగారి భూమయ్య విమర్శించారు. శుక్రవారం భైంసాకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గిరిజనులపై మొసలి కన్నీరు కారుస్తున్న కేసీఆర్​నిజస్వరూపం త్వరలో బయటపడుతుందన్నారు. మునుగోడు బై ఎలక్షన్​లో టీఆర్ఎస్​కు ఓటమి​ఖాయమన్నారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు నారాయణ్ రెడ్డి, రవిపాండే, గోపాల్​సార్డా, కౌన్సిలర్ విజయ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూషణ్, పోశెట్టి, అంజుకుమార్​ రెడ్డి, నాగనాథ్​ కొర్వ శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరాలి

మంచిర్యాల/బెల్లంపల్లి,వెలుగు: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​వెరబెల్లి కోరారు. శుక్రవారం మంచిర్యాల ప్రతిభ జూనియర్ కాలేజీలో మోడీ సాధించిన విజయాలపై ఎగ్జిబిషన్ నిర్వహించారు. నరేంద్రమోదీ పట్టుదలతో శ్రమించడం వల్లే దేశానికి ప్రధాని కాగలిగారన్నారు. కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు, లీడర్లు వెంకటేశ్వరరావు, జోగుల శ్రీదేవి, ఏనుగు జైపాల్ రెడ్డి, అశోక్, చక్రి పాల్గొన్నారు.

కేంద్ర పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలి....

కేంద్ర ప్రభుత్వ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి కోరారు. శుక్రవారం బెల్లంపల్లి కాంట్రాక్టర్ బస్తీలో పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన శక్తి కేంద్రం సమావేశంలో ఆయన మాట్లాడారు. 88, 89, 90, 91వ బూత్ అధ్యక్షులుగా శంకర్, గర్రేపల్లి.రాజేశ్, వెంబడి సత్యం, సమటేన్కి వెంకటేష్​ను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేశ్, జిల్లా కార్యదర్శి కోయిల్కర్ గోవర్ధన్, జిల్లా కార్యాలయ ఇన్​చార్జి సతీశ్​రావు, నియోజకవర్గ కన్వీనర్ రాచర్ల సంతోష్,  కో కన్వీనర్ రాజులాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

బకాయిలు మాఫీ చేస్తే సింగరేణికి నష్టం

మందమర్రి,వెలుగు: సింగరేణి సంస్థకు ట్రాన్స్​కో, జెన్​కో నుంచి రావాల్సిన విద్యుత్తు, బొగ్గు బకాయిల్లో రూ.1,250 కోట్లు మాఫీ చేసేందుకు సింగరేణి బోర్డ్ డైరెక్టర్ల మీటింగ్​లో​ నిర్ణయం తీసుకోవడంతో కంపెనీ, కార్మికులకు నష్టం జరుగుతుందని ఏఐటీయూసీ సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం మందమర్రి ఏరియా కేకే-1 గనిపై జరిగిన గేట్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సొమ్మును అక్రమంగా వాడుకుంటోందని, బకాయిలు మాఫీ చేసే పవర్ సింగరేణికి లేదన్నారు. మాఫీ విషయం వివరాలు బయటపెట్టాలని డిమాండ్​ చేశారు.  డీఎంఎఫ్​టీ, సీఎస్సాఆర్, ప్రజాప్రతినిధులకు దారదత్తం చేశారని, రామగుండం మెడికల్ కాలేజీకి రూ.500 కోట్లు ఇచ్చారని, భద్రాచలం వరద బాధితులకు రూ.1000 కోట్లు చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గత ఏడాది సంస్థ ఆర్జించిన వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 35 శాతం వాటా ఇవ్వాలన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ వైస్​ ప్రెసిడెంట్​ భీమనాధుని సుదర్శనం, లీడర్లు వెల్ది సుదర్శన్, శర్మ, కంది శ్రీనివాస్​, కొత్త తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

విశాక ట్రస్ట్ ఆధ్వర్యంలో బేంచీల అందజేత

జైపూర్(భీమారం),వెలుగు: ‘కాకా’ వెంకటస్వామి ఫౌండేషన్, విశాక చారిటబుల్​ ట్రస్ట్​​ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని ఆరేపల్లి ప్రైమరీ స్కూల్​కు 25 బేంచీలు అందజేశారు. వాటిని బీజేపీ మండల అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్, లీడర్లు హెచ్​ఎంకు ఇచ్చారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ విద్యార్థులు కూర్చోవడానికి బేంచీల కొరద ఉందని బీజీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి విన్నవించగా వెంటనే స్పందించి విశాక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయూతనిచ్చారన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ భరత్ రెడ్డి కిసాన్, బీసీ, ఎస్సీ మోర్చా లీడర్లు సల్ల రాజిరెడ్డి, కంకణాల సుధాకర్ రెడ్డి, దేవా పోశం, లీడర్లు ఆవిడపు సురేశ్, కోట రాజేశ్, సెగ్గం మల్లేశ్, రత్నం లక్ష్మి, జిమ్మిడి రాజేశ్వరి, అనపర్తి జంపయ్య , దుర్గం రాజమల్లు, అనపర్తి మల్లేశ్, మేడి విజయలక్ష్మి, హెచ్ఎం, సిబ్బంది రవీందర్, రజిత తదితరులు పాల్గొన్నారు. 

భూమి గుంజుకున్రు

జైపూర్(భీమారం), వెలుగు: తమ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని భీమారం మండల కేంద్రానికి చెందిన దాసరి బానేశ్ - కల్యాణి,  దాసరి స్వామి, స్వరూప స్థానిక పోటు తిరుపతిరెడ్డి ఫర్టిలైజర్​షాప్​ఎదుట పురుగుల మందు డబ్బాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. పోతనపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 305/10లో 1.25 ఎకరాల భూమిని పోటు తిరుపతి రెడ్డి తన భార్యపేరిట చేయించుకున్నాడని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎస్సై సుధాకర్​ను వివరణ కోరగా అమ్మిన భూమి తిరిగి ఇవ్వాలని తిరుపతిరెడ్డిని బెదిరిస్తున్నారని వివరించారు.