
తెలంగాణ రాజకీయ రంగస్థలంలో సీఎం రేవంత్ రెడ్డి ‘వన్ షాట్ టు బర్డ్స్’ వ్యూహం రక్తికట్టిస్తున్నది. బీఆర్ఎస్‌ను రాజకీయంగా బలహీనపరిచే వ్యూహం ఒకవైపైతే, అదే సమయంలో బీజేపీని కూడా ఇరుకున పెట్టే ద్విముఖ వ్యూహం ఇప్పుడిప్పుడే స్పష్టమవుతున్నది.
మరో పక్క కాళేశ్వరం అవినీతిపై సీబీఐకి అప్పగించడం ద్వారా దేశవ్యాప్త చర్చగా మార్చారు. అయితే, ఈ వ్యూహం బీఆర్ఎస్‌ను బీజేపీకి దగ్గర చేస్తుందా లేదా పార్టీని మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుందా? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ భవిత్యం, బీజేపీల ఉనికి ఏంటన్న రాజకీయ చదరంగపు ఆటను ఆడుతున్నట్టు కనిపిస్తున్నది. కాళేశ్వరం ఒక అవినీతి ప్రాజెక్ట్‌గా, తెలంగాణ మాగాణికి ఏ మాత్రం ఉపయోగపడదని చెప్పడంతోపాటు బీఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీకి ఒక ఏటిఎంలా ఉపకరిస్తున్నదని చెబుతూ వచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల టైంలోనే మేడిగడ్డకు పగుళ్లు రావడం, ఢిల్లీ నుంచి రాహుల్ సహా కాంగ్రెస్ నేతల్ని పిలిచి ప్రాజెక్ట్‌పై, అక్రమాలపై జనాల్లో చర్చ జరిగేలా చేసిన ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. అధికారంలోకి వచ్చిన వెనువెంటనే కాళేశ్వరంపై ప్రాజెక్ట్ అవినీతి, నాణ్యత, నిర్వహణ లోపాలు, నాటి ప్రభుత్వ పెద్దల బాధ్యతారాహిత్యంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించారు. 17 నెలల సుదీర్ఘ విచారణ అనంతరం ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికను ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి బహిర్గతం చేసింది.
శాసనసభలో రోజంతా చర్చ జరిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలున్నందున మరింత లోతైన విచారణకు సీబీఐకి అప్పగిస్తూ శాసనసభ ఏకగీవ్రంగా తీర్మానం చేయడంతో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కాయి. సీబీఐ, దాని పనితీరు మీద దేశవ్యాప్తంగా విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఏకంగా విచారణ కేసును సీబీఐకి ఇవ్వడం సంచలనమే. అంటే సోనియా, రాహుల్ గాంధీలు సీబీఐని విమర్శించినప్పటికీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు సిఫారసు చేయడం వెనుక కాంగ్రెస్ అధినాయకత్వంతో అంతర్గత సమన్వయం ఉండవచ్చు. తెలంగాణలో సీబీఐకి అనుమతి లేకపోయినా ఒక ప్రభుత్వంగా, సీఎంగా రేవంత్ తీసుకున్న సీబీఐ ఎంట్రీ నిర్ణయం బీఆర్ఎస్, బీజేపీలోనే కాదు, కాంగ్రెస్‌లోనూ చర్చ జరుగుతున్న మాట వాస్తవం.
సీఎం రేవంత్ వ్యూహం
సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా రాజకీయ, ఆర్థిక, సాంకేతిక కోణాల్లో బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఈ వ్యూహంలోని కీలక అంశాలు..పారదర్శకత జవాబుదారీతనం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ కోసం సీబీఐ దర్యాప్తును ప్రకటించడం ద్వారా, రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం పారదర్శకతకు కట్టుబడి ఉందని సందేశం ఇవ్వాలని చూస్తున్నారు. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతుంది.
కాళేశ్వరం బ్యారేజీలు, ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో గుర్తించిన సాంకేతిక లోపాలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక, ఎన్‌డీఎస్‌ఏ, కాగ్ నివేదికల ఆధారంగా, ఈ లోపాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్రణాళిక వేస్తున్నారు.
రేవంత్ రెడ్డి తన అసెంబ్లీ ప్రసంగంలో ‘తెలంగాణ ప్రజలకు లక్ష కోట్ల అప్పు ఎలా వచ్చింది? కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిన వైఖరిని చాటిచెప్పాయి. సీబీఐ దర్యాప్తు ద్వారా దోషులను శిక్షించడం, ప్రజాధనాన్ని రక్షించడం రేవంత్ వ్యూహంలో ముఖ్య భాగం.
బీఆర్ఎస్పై ఒత్తిడి
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై, పార్టీపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. బీఆర్ఎస్‌ను ‘అవినీతి పార్టీ’గా సీఎం రేవంత్ ఆరోపణల పరంపరను ఇంకా వ్యాపితం చేసే అవకాశం ఉన్నది.
ఒకవేళ సీబీఐ విచారణ జాప్యమైతే.. రేవంత్ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటారని విశ్లేషకుల అభిప్రాయం. కేటీఆర్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌ను ‘ట్రాష్’ అని విమర్శించినా, రేవంత్ దాన్ని ‘జైలు టికెట్’గా అభివర్ణించడం ద్వారా బీఆర్ఎస్‌ను మరోసారి రక్షణాత్మక స్థితిలోకి నెట్టారు.
బీజేపీ ఇరుకున పడేనా!
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా బీజేపీని కూడా రాజకీయంగా ఇరుకున పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ సీబీఐ విచారణ పారదర్శకంగా జరిపితే సరి, ఒకవేళ విచారణలో జాప్యం జరిగితే బీజేపీని కూడా కార్నర్ చేసే అవకాశం ఉంటుంది.
బీజేపీ, -బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని, కేసీఆర్ మోదీ వద్ద ‘కాళ్ల బేరానికి’ వెళ్లారని అనేక సందర్భాల్లో రేవంత్ ఆరోపించారు. ఇపుడు సీబీఐ ఈ కేసును తీసుకుంటే ఫరవాలేదు, ఒకవేళ రిజెక్ట్ చేస్తే.. బీజేపీ, కేంద్రం నీతి నిజాయితీపై ప్రశ్నలు లేవనెత్తుతాయి.
సీబీఐకి అప్పగించడం ద్వారా కేసీఆర్, బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసే అవకాశముంటుంది. అనేక సీబీఐ విచారణ ఆదేశాలు జాతీయ స్థాయిలో ఒకింత చర్చకు దారితీసిన నేపథ్యంలో కాళేశ్వరం అవినీతి ఆరోపణల్ని కూడా హైలైట్ చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఈ అంశం సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది కూడా.
బీజేపీకి దగ్గరయ్యే అవకాశం?
ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. ఇపుడు సీబీఐ విచారణ బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా లేక బీజేపీకి దగ్గరవుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో
విస్తృతంగా సాగుతోంది. కేసీఆర్ మోదీ వద్దకు వెళ్లి సహకారం కోరితే, బీఆర్ఎస్ ‘భూ స్థాపితం’ అవుతుందని, అలా చేయకపోతే.. జైలు లేదా ‘చిప్పకూడు’ తప్పదని కాంగ్రెస్ విశ్లేషకులు చెబుతున్న మాట.
ఇది బీఆర్ఎస్‌ను రాజకీయ డైలమాలో ఉంచింది. ఇప్పటికే విద్యుత్ కొనుగోళ్ల విచారణ, గొర్రెల స్కాం, ఫార్మూలా ఈ రేసు కేసు, భూ బదలాయింపు, ధరణిమోసాలు, ఎమ్మెల్యేల అనర్హత, కవిత అరెస్ట్, కాళేశ్వరం కేసులతోపాటు పార్టీ పరంగా కూడా బీఆర్ఎస్ సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నది.
కీలక మలుపు కానుంది!
కాళేశ్వరం కేసు తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపుగా నిలుస్తుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. గత పదేండ్ల పాలనలో అవినీతిని వెలికితీయడం ద్వారా బీఆర్ఎస్‌ను ప్రజల ముందు నిలబెట్టడం, సీబీఐ విచారణ అంశంలో కేంద్రంలోని బీజేపీ చిత్తశుద్ధిని పరీక్షకు పెట్టడం ద్వారా రెండు పార్టీలకు రాజకీయంగా సవాలు తప్పదు. ఇదే క్రమంలో సీఎం రేవంత్ ఈ కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా నిష్పక్షపాత దర్యాప్తును నిర్ధారించడమే కాక, రాజకీయంగా ప్రత్యర్థులపై ఒత్తిడిని పెంచే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.
ఈ దర్యాప్తు ఫలితాలు కేవలం అవినీతిపై చర్యలకే పరిమితం కాక, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా ఒక ముందడుగుగా నిలుస్తాయి. అయితే, ఈ కేసు ముగింపు ఎలా ఉంటుందనేది సీబీఐ దర్యాప్తు ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియలో పారదర్శకత, న్యాయం, ప్రజలకు జవాబుదారీతనం కీలకంగా నిలుస్తాయి. తెలంగాణ ప్రజలు ఈ కేసు ముగింపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
కేసీఆర్ మౌనం వ్యూహాత్మక తప్పిదమా?
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వివాదం తలెత్తినప్పటి నుంచి కేసీఆర్ మౌనం వహించడం గమనార్హం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ రాజకీయంగా పెద్దగా కనిపించలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ‘వరప్రదాయిని’ గా చిత్రీకరించడంలో, దాని సాధనలను ప్రజలకు వివరించడంలో కేసీఆర్ విఫలమయ్యారనే విమర్శ ఉంది.
కేసీఆర్ మౌనం, ఈ ప్రాజెక్ట్‌పై వివాదాలను ఎదుర్కొనేందుకు కేటీఆర్, హరీశ్ రావు వంటి నాయకులను మాత్రమే ముందుంచడం, కాంగ్రెస్‌కు రాజకీయ ఆయుధంగా మారింది. అంతేకాకుండా సీఎం రేవంత్ పట్ల కేసీఆర్ మొదటి నుంచీ వ్యతిరేక ధోరణితోనే ఉంటూ రేవంత్ ఉండే సభకు తాను హాజరుకాలేననే వ్యవహార శైలితో ఉన్నారు. అంతేకాకుండా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ ఆయనను తక్కువగా చూడడం, ముఖ్యమంత్రి స్థాయిని గౌరవించకుండా వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
ఇదే సమయంలో కేటీఆర్, హరీశ్‌రావు దూకుడు, రేవంత్‌ను వ్యక్తిగతంగా, రాజకీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా రాజకీయ ఘర్షణను తీవ్రతరం చేశాయి. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడం, వ్యక్తిగత ఘర్షణల ఫలితంగా కాంగ్రెస్ తీసుకున్న రాజకీయ చర్యగా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
- వెంకట్ గుంటిపల్లి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం-