ఎల్ అండ్ టీ అగ్నిప్రమాద ఘటనపై పోలీసుల విచారణ..ప్రమాదానికి కారణాలపై ఎస్పీ ఆరా

ఎల్ అండ్ టీ అగ్నిప్రమాద ఘటనపై పోలీసుల విచారణ..ప్రమాదానికి కారణాలపై ఎస్పీ ఆరా

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ గెస్ట్ హౌజ్‌‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కంపెనీ సమీపంలోని పంట పొలాలకు మంటలు అంటుకోవడం వల్ల ప్రమాదం జరిగిందా? కరెంట్ షార్ట్‌‌ సర్క్యూట్ కారణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

సోమవారం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మహదేవపూర్ మండలం అంబట్‌‌పల్లి సమీపంలోని ఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఆఫీస్, మీటింగ్ హాళ్లు పూర్తిగా దగ్ధం కావడానికి కారణాలపై ఆరా తీశారు.

 అగ్నిప్రమాదంతో జరిగిన నష్టం వివరాలు తెలుసుకున్న ఎస్పీ.. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. వేడి గాలుల మధ్య మంటలను అదుపులోకి తెచ్చిన తీరును కూడా పరిశీలించారు. ఆయన వెంట కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రూ.1.48 కోట్ల నష్టం..

ఎల్ అండ్ టీ ఆఫీస్‌‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై గెస్ట్ హౌజ్ ఇన్‌‌చార్జి తపాస్ కుమార్ నాయక్ సోమవారం మహదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కంపెనీ ఆఫీస్‌‌లో అగ్నిప్రమాదం సంభవించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ ప్రమాదంలో కంపెనీ గెస్ట్ హౌజ్‌‌తో పాటు అందులో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు, ఫర్నిచర్, ఇతర విలువైన సామగ్రి, సిబ్బందికి చెందిన వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. కంపెనీకి సుమారు రూ.1.48 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.పవన్ కుమార్ తెలిపారు.