కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ నందకుమార్ రాజీనామా

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ నందకుమార్ రాజీనామా

హైదరాబాద్: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‎లర్ (VC) పదవికి డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆయన గవర్నర్‎కు పంపించారు. ఇటీవల కాళోజీ యూనివర్శిటీలో పేపర్ల మూల్యాంకనంతో పాటు ఇన్‌చార్జీల నియామకంలో అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. పేపర్ల వాల్యుయేషన్‌లో అవకతవకల జరిగినట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు వర్శిటీలో సోదాలు చేపట్టారు.

 మరోవైపు.. కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ల మూల్యాంకనంలో అక్రమాలు, ఇష్టారీతిగా ఇన్‎ఛార్జీల నియామకంపై సీఎం ఆరా తీశారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను వివరణ కోరారు. వర్శిటీలో ఈ పరిస్థితులకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఘటనల వెనక ఎంతటివారున్నా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ఉన్నతస్థాయి సంస్థల సిబ్బంది నిష్పక్షపాతంగా పని చేయాలని సూచించారు. కాళోజీ వర్సిటీ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన నిమిషాల్లోనే నందకుమార్ వీసీ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.